Ranveer Allahabadia Supreme Court | ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. “పాపులారిటీ ఉంటే అసభ్యంగా మాట్లాడతారా? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా?” అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, అసభ్య మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. “అసలు ఇలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా?” అని కోర్టు అన్నది.
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను ఏకీకృతం చేసి విచారించాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును కోరాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం (ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ ఎన్.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?” అని అతన్ని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనకూడదని అల్హాబాదియాకు ఆదేశించారు. అయితే, అతని వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతన్ని అరెస్టు చేయకూడదని స్టే మంజూరు చేసింది. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసిద్ధి పొందిన అల్హాబాదియా, అతని స్నేహితుడు సమయ్ రైనాతో కలిసి షోలో పాల్గొన్నప్పుడు ఈ అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, అస్సాం ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంపై స్పందించారంటే, పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు..
యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు కఠిన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్‌వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
ఏంటీ వివాదం?
యుట్యూబర్ సమయ్ రైనాకు చెందిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (IGL) కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళా అభ్యర్థిని ఆమె తల్లిదండ్రులు పడక సుఖం పొందుతుంటే ఆమె చూస్తూ నిలబడతావా లేక.. ? అంటూ చాలా అసభ్యంగా రణ్‌వీర్ అల్హాబాదియా ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతని వ్యాఖ్యలపై అనేక పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. సమయ్ రైనా షోలో రణ్‌వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతనిపై వివిధ రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లపై ఇటీవల రణ్‌వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఏకీకృతం చేయాలని ఒక పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపైనే ఇటీవల విచారణ జరిగింది.
ఇటీవలే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యతల నుంచి రిటైర్ అయిన జస్టిస్ డీవై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్, రణ్‌వీర్ తరఫున వాదనలు వినిపించారు. నైతిక విలువల ప్రకారం తన క్లయింట్ వ్యాఖ్యలు సమర్థించదగినవి కావని, అయితే అతడిని హత్య చేస్తామని బెదిరింపులు వస్తున్నాయని కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో మహారాష్ట్ర, అస్సాం పోలీసులను సంప్రదించవచ్చని కోర్టు సూచించింది. అలాగే, సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే ప్రణాళికలు ఉన్నాయా అని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ అందజేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది.