BigTV English

Sigachi Industries: మాటలకందని విషాదం.. ఊహించని ప్రమాదం.. సిగాచీ ఇండస్ట్రీలో ఏం జరిగింది?

Sigachi Industries: మాటలకందని విషాదం.. ఊహించని ప్రమాదం.. సిగాచీ ఇండస్ట్రీలో ఏం జరిగింది?

Sigachi Industries: సిగాచి ఇండస్ట్రీస్ ఘటన పారిశ్రామిక వాడల్లో ప్రమాద తీవ్రతను మరోసారి హైలెట్ చేసింది. బతుకు దెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చి రిస్క్ ఉన్న పనులు చేసే వారి జీవితాలు గాల్లో దీపమే అన్నది రుజువు చేసింది. పేరున్న ఈ ఫార్మాసూటికల్ కంపెనీలో అసలు రియాక్టర్ ఎలా పేలింది? బిల్డింగ్ కూలిపోయేంతగా అందులో కెమికల్స్ ఏమి ఉన్నాయి? నిర్వహణా లోపమా.. అబ్ నార్మల్ కెమికల్ రియాక్షన్ జరిగిందా?


డ్యూటీలో 143 మంది కార్మికులు

రోజువారిలాగే సిగాచి ఇండస్ట్రీస్‌ లో పనులు చేసేందుకు కార్మికులు ఉదయం షిఫ్టులో వచ్చారు. మొత్తం 143 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. రియాక్టర్ యూనిట్‌లో 90 మంది కార్మికులు రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ రియాక్టర్‌లో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ – MCC తయారీకి సంబంధించిన కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. ఏం జరిగిందో ఏమో… ఒక్కసారిగా భారీ ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తమే కూలిపోయింది. రియాక్టర్ దగ్గరున్న కార్మికులైతే 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారంటే బ్లాస్ట్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఇంత పెద్ద పేలుడు ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. అంటే ప్రాథమిక అంచనాలు, అనుమానాలు కొన్నైతే తెరపైకి వచ్చాయి. అసలైన విషయం పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే తేలుతుంది. సాధారణంగా ఇలాంటి పరిశ్రమల్లో రియాక్టర్లు పేలుడుకు మూలకారణంగా ఉంటాయి. చెప్పాలంటే ఒక కెమికల్ బాంబు చుట్టూ పని చేస్తున్నట్లే లెక్క. కెమికల్ రియాక్షన్స్, టెక్నికల్ ఫాల్ట్స్, సేఫ్టీ ప్రొసీజర్ లో లోపాలు ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయ్. ఇందులో కొన్ని పాజిబులిటీస్ ఏంటో చూద్దాం.

1. స్ప్రే డ్రైయర్‌ ఒత్తిడి
మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఉత్పత్తి కోసం రియాక్టర్ లో స్ప్రే డ్రైయర్ ఉంటుంది. ఇందులో లిక్విడ్ కెమికల్స్ ను పొడిగా మార్చేందుకు వేడిగాలిని పంపుతారు. ఈ ప్రక్రియలో హై ప్రెజర్ లేదంటే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయితే రియాక్టర్ లోపల ఒత్తిడి పెరిగి పేలుడుకు దారితీస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ప్రెజర్ కుక్కర్ లో వాల్వ్ పని చేయకపోతే పేలిపోతుంది కదా.. అలాంటిదే ఇక్కడా జరిగి ఉండొచ్చన్న డౌట్లు ఉన్నాయి.

2. అసాధారణ రసాయన చర్య
సిగాచీ MCC తయారీ కోసం వుడ్ పల్ప్ అలాగే హైడ్రోక్లోరిక్ ఆసిడ్ – HCl వంటి కెమికల్స్ వాడుతుంది. ఈ రసాయనాలు సరిగా కంట్రోల్ కాకపోయినా.. లేదా అనుకోని కెమికల్ రియాక్షన్ జరిగినా, వేడి పెరిగి పేలుడుకు కారణమవుతాయి. ఇదొక అనుమానం.

3. సెల్యులోస్ డస్ట్ బ్లాస్ట్
మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ తయారీలో సెల్యులోస్ డస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డస్ట్ గాలిలో చెల్లాచెదురుగా ఉంటే, అది ఒక స్పార్క్ లేదా అధిక ఉష్ణోగ్రతతో కాంటాక్ట్ అయితే బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఒక గదిలో సిలిండర్ లీకై.. ఒక లైట్ వేయగానే ఎలా బ్లాస్ట్ అవుతుందో.. అలాగన్న మాట.

4. ఎయిర్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్
రియాక్టర్‌లోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్‌లో ఏదైనా అడ్డుపడటంతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్నది మరో రీజన్. ఇది రియాక్టర్ లో అనూహ్య ఒత్తిడి పెరగడానికి దారితీసి ఉండవచ్చంటున్నారు.

5. హ్యూమన్ ఎర్రర్
రియాక్టర్‌లో ప్రెజర్ లేదంటే టెంపరేచర్ ను అబ్జర్వ్ చేసే సెన్సార్‌లు ఫెయిల్ అయి ఉండవచ్చంటున్నారు. రియాక్టర్ మెయింటెనెన్స్ లో హ్యూమన్ ఎర్రర్స్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అలర్ట్స్ ను సరైన టైంలో క్యాచ్ చేయకపోవడం ఒక రీజన్ గా అనుమానిస్తున్నారు.

ఫార్మాలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఇంపార్టెంట్

సిగాచీ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే వాటిలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. దీన్ని ట్యాబ్లెట్లు, ఇతర ఫార్మా అవసరాల కోసం తయారు చేస్తారు. యాక్టివ్ ఫార్మా ఇంగ్రెడియెంట్స్ లో వాడే కెమికల్స్ సాధారణంగా సురక్షితమైనవి. అయితే వీటిపై కంట్రోల్ లేకపోతే కష్టమే. MCC తయారీలో వుడ్ పల్ప్ నుండి సెల్యులోస్‌ను శుద్ధి చేయడానికి HCL వాడుతారు. ఇది ఒక బలమైన యాసిడ్. ఒకవేళ HCl అధిక మోతాదులో వాడి సరిగా కంట్రోల్ చేసి ఉండకపోవడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి పేలుడు జరిగి ఉంటుందా అన్నది తేల్చనున్నారు. సిగాచీ పరిశ్రమలో క్లోరినేటెడ్ పారాఫిన్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తయారు చేసే వారు. ఇందులో క్లోరిన్ గ్యాస్ వాడుతారు. ఇది డేంజరస్ గ్యాస్. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ లేదా APIల తయారీలో కొన్నిసార్లు ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఇథనాల్, మిథనాల్ వంటివి వాడుతారు. ఈ కెమికల్స్ ఎక్కువ మండే కెపాసిటీతో ఉంటాయి. హైటెంపరేచర్ లో పేలిపోతాయి.

రియాక్టర్‌లో ఆటోమేటిక్ సెన్సార్లు పని చేయలేదా?

నిజానికి ఇప్పుడు పరిశ్రమల నిర్వహణలో అడ్వాన్స్ డ్ టెక్నిక్స్ వచ్చాయి. రియాక్టర్ లో ఒత్తిడి ఎంత ఉంది.. ఏం చేయాలి.. ఎలా డీల్ చేయాలన్నది ఆటోమేటిక్ వ్యవస్థలు, సెన్సార్ల ద్వారా ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. వీటిని సరైన సమయంలో గమనించి, ప్రాసెస్ ఆపేయడం ఒక పద్ధతి. అయితే సిగాచిలో రియాక్టర్ల కండీషన్ ఏంటన్నది తేలాల్సి ఉంది. బిల్డింగ్ మొత్తం కూలిపోయేంతగా పేలడం, కార్మికుల శరీరాలు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోవడం, కొందరి ఆచూకీ కూడా దొరకకపోవడం, మృతదేహాలను గుర్తించేందుకు DNA టెస్టులు అవసరం పడడం వంటివి సిగాచీలో ప్రమాద తీవ్రత ఎంత ఉందో సూచిస్తోంది.

అన్ని వ్యాపారాలు వేరు.. కెమికల్ రియాక్షన్స్‌తో వ్యాపారం చేసే కంపెనీలు వేరు. ఎందుకంటే ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది. అయితే కెమికల్ రియాక్టర్స్ ఉండే చోట, ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల్లో మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న నిర్లక్ష్యం చాలా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. మరి మన దగ్గరున్న పరిశ్రమల్లో ఉన్న సేఫ్టీ ఎంత? కార్మికులకు సరైన ట్రైనింగ్ ఇస్తారా?

సిగాచీ ఫ్యాక్టరీ గేట్ల వద్ద గుండెలు పగిలేలా రోదనలు

తన 20 ఏళ్ల కొడుకు కోసం సిగాచీ ఫ్యాక్టరీ గేట్ల వద్ద గుండెలు పగిలేలా ఏడ్చింది. మేరా బేటా నహీ మిల్ రహా అంటూ కనిపించిన వారందరినీ అడిగింది. ఈ దృశ్యం అక్కడున్న వాళ్లందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఆమె కొడుకు ఇదే ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బ్లాస్ట్ అయ్యాక అతడి జాడ తెలియలేదు. ఉపర్మిలా గోసాయ్ అనే మహిళ ఆవేదన అంతా ఇంతా కాదు. తన కుటుంబంలోని నలుగురు ఈ ఫ్యాక్టరీ బ్లాస్ట్ తర్వాత కనిపించకుండా పోయారు. ఇది మాటలకందని విషాదం. తప్పంతా సిగాచీ ఇండస్ట్రీదే అని బాధిత కుటుంబీకులు చెబుతున్న మాట. సేఫ్టీ చర్యలు సరిగా తీసుకోకపోవడం వల్లే ఇలా ప్రాణాలు గాల్లో కలిసి పోయాయంటున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారనుకుంటే… హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. సిగాచీ ఇండస్ట్రీస్‌లో వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ ఇలంగోవన్ కూడా ఈ పేలుడులో చనిపోయాడు. తన కారు నుంచి బయటకు రాగానే పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగి చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరిది ఒక్కో దీనగాధ. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన కార్మికులు ఇలా అన్యాయంగా బలైపోయారు. చనిపోయిన వారిలో చాలా మంది రియాక్టర్ కు దగ్గరగా ఉన్న వారే అంటున్నారు.

DNA పరీక్షలతో మృతుల గుర్తింపు

బాధితుల శరీరాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. దీంతో DNA పరీక్షలు అవసరమయ్యాయి. ఇది వారి కుటుంబాలకు మరింత బాధాకరమైన విషయం. ఈ వలస కార్మికులు తమ కుటుంబాలను పోషించడానికి రిస్క్‌తో కూడిన పనులను చేస్తున్నారు. వారి బంధువులు ఆసుపత్రుల వద్ద, ఫ్యాక్టరీ గేట్ల వద్ద నిరీక్షిస్తూ తమవారి జాడ కోసం ఎదురుచూస్తున్నారు. చనిపోయిన వారిలో చాలా మంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువకులే ఉన్నారు. మిస్ అయిన వారిలో కొత్తగా పెళ్లైన జంట కూడా ఉందంటున్నారు. ఎన్నో కలలతో కొత్త జీవితంలో అడుగు పెట్టిన వారి జీవితం సిగాచీ పేలుడుతో శాశ్వతంగా ముగిసిపోయింది. ఇది మాటలకందని విషాదం. ప్రధాని మోడీ మరణించినవారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేల రూపాయల పరిహారం ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తక్షణ సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు. కంపెనీ నుంచి 10 కోట్ల పరిహారం ఇప్పిస్తామన్నారు. ఈ ఘటనను విచారించడానికి ఒక ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. బాధితులకయ్యే చికిత్స ఖర్చుల విషయంలో వెనుకాడొద్దన్నారు.

పాశమైలారం యూనిట్‌కు బీమా కవరేజ్ ఉందన్న సిగాచీ

హైదరాబాద్ యూనిట్‌లో ఉత్పత్తిని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిగాచీ కంపెనీ ప్రకటించింది. ఈ పాశమైలారం యూనిట్‌కు బీమా కవరేజ్ ఉందని, బాధితులకు సహాయం అందిస్తామని చెప్పింది. ఈ బీమా రావడానికి టైం పడుతుంది. మరోవైపు చూస్తుంటే.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను 1989లో స్థాపించారు. దీనికి హైదరాబాద్ పాశమైలారంలో ఒక యూనిట్, జగ్గయ్యపేటలో మరో యూనిట్ గుజరాత్ దహేజ్ లో మూడో యూనిట్ ఉంది. ఈ కంపెనీ ఫార్మా రిలేటెడ్ మైక్రోక్రిస్టలైన్ సెల్యులోస్, అలాగే APIలను తయారు చేసి 40కి పైగా దేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తుంది. పెద్ద కంపెనీయే. కానీ పాశమైలారం యూనిట్ లో ఘోరం జరిగిపోయింది.

రెండు స్థాయిల్లో పరిశ్రమల్లో సేఫ్టీ చెకింగ్స్

పరిశ్రమల్లో సేఫ్టీ చెకింగ్స్ రెండు స్థాయిల్లో జరుగుతాయి. అంతర్గత తనిఖీలు అంటే కంపెనీవాళ్లు చేసుకోవాలి. బాహ్య తనిఖీలు చేసేది ప్రభుత్వ ఆఫీసర్లు. ప్రతి పరిశ్రమలో ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు. రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఇతడి డ్యూటీ. మెషీన్స్, కెమికల్స్ చెకింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి కంపెనీలో ఒక భద్రతా కమిటీ ఉంటుంది. ఇది కార్మికులు, యాజమాన్యం నుంచి సభ్యులను కలిసి ఉండి రిస్క్‌లను గుర్తించి, భద్రతా విధానాలను అమలు చేస్తుంది. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టరేట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వంటి సంస్థలు పరిశ్రమలను తనిఖీ చేయాలి. సేఫ్టీ రూల్స్, కెమికల్స్ నిల్వ, యంత్రాల భద్రతను పరిశీలించాల్సి ఉంటుంది. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి రిస్క్ అసెస్‌మెంట్ తప్పనిసరి. ఏవైనా లీక్ లు, లోపాలను గుర్తించడం కీలకం.

Also Read: 8 రోజులు.. 5 దేశాలు! మోడీ ఏక్ దమ్ టూర్ ఏం చేయబోతున్నారంటే?

రెగ్యులర్ ఇన్‌స్పెక్షన్స్ అవసరం. అలాగే కార్మికులకు సేఫ్టీ ప్రొసీజర్స్ నేర్పించడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా డీల్ చేయాలో చెప్పడం, కెమికల్స్ మేనేజ్ మెంట్ పై ట్రైనింగ్ ఇవ్వడం కీలకం. ఎమర్జెన్సీ ప్లాన్స్ కూడా ఉండాలి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లడం ముఖ్యం. టెక్నికల్ గా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే రియాక్టర్లలో సెన్సార్లు, లీక్ డిటెక్టర్లు, ఆటోమేటెడ్ షట్‌డౌన్ సిస్టమ్స్ వంటివి వాడాలి. మరి సిగాచీ పేలుడు విషయంలో ఇవన్నీ ఎటు వెళ్లాయి అన్నది తేలాల్సిన విషయం. నిజానికి తెలంగాణలోని పారిశ్రామిక ప్రాంతాల్లో తనిఖీలు అరుదుగా జరుగుతాయని, ఇది ప్రమాదాలకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×