PM Modi Tour: పదేళ్ల తర్వాత ప్రధాని సుదీర్ఘ విదేశీ పర్యటనల్లో పాల్గొంటున్నారు. ఒకటి కాదు ఏకంగా ఐదు దేశాలు. అసలీ టూర్ అప్ డేట్ ఏంటి? ఏయే దేశాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంది? ఆయా దేశాల్లో మోడీ ఏం చేయనున్నారు? ఇప్పుడు చూద్దాం..
5 దేశాలు ఎనిమిది రోజులు.. మోడీ టూర్
5 దేశాలు, ఎనిమిది రోజులు.. ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇంతకీ ఆ ఐదు దేశాలేంటని చూస్తే జూలై 2 నుంచి ఘనా, ట్రినాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో మోడీ పర్యటిస్తారని ప్రకటించారు కేంద్ర విదేశాంగ శాఖ ఆర్ధిక కార్యదర్శి రవి. జూలై 2, 3 దేశాల్లో ఘనాలో పర్యటిస్తారు మోడీ. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఈ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా తో చర్చలు జరుపుతారు.. మహామా 2025 జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్ధిక, ఇంధన, రక్షణ సహకారంలో మరింత భాగస్వామ్యం పెంపొందించే అవకాశాలను ఈ ఇరువురు నేతలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత జూలై 3, 4 తేదీల్లో ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టుబాగోలో పర్యటిస్తారు. 1999 తర్వాత ఈ దేశంలో పర్యటించనున్న భారత ప్రధాని మోడీయే అవుతారు.
జూలై 4న అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని
జూలై 4న అర్జెంటీనాకు వెళ్లనున్నారు ప్రధాని. ఐదవ తేదీ వరకూ ఇక్కడే పర్యటిస్తారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్ పునరుత్తాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు.. వంటి కీలకాంశాల్లో ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరగనున్నాయి. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేలాంటి ఒప్పందాలు చేసుకోనున్నారు మోడీ. జూలై 5 నుంచి 8వ తేదీ వరకూ ప్రధాని మోడీ బ్రెజిల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లోని రియో వేదికగా సాగనున్న.. 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొని ప్రపంచంలో పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయనున్నారు. ప్రపంచ పాలనా సంస్కరణలు- శాంతి, కృత్రిమ మేధస్సు వినియోగం.. పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యం, ఆర్ధికాంశాలతో పాటు.. పలు కీలకాంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సదస్సులో పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కొనసాగించేలా తెలుస్తోంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో గ్లోబల్ సౌత్ లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలు విస్తరించడమే ధ్యేయంగా చర్చలు చేయనున్నారు మోడీ.
జూలై 9న నమీబియా టూర్.. పార్లమెంటులో ప్రసంగం
జూలై 9న నమీబియా వెళ్లి.. అక్కడ పార్లమెంటులో ప్రధాని ప్రసంగించనున్నారు. నమీబియాలో ప్రధాని పర్యటన సందర్భంగా.. ఆ దేశంతో భారత్ కి ఉన్న పలు సంబంధాలను పునరుద్దరించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ రాబోయే ఐదు దేశాల పర్యటన గురించి విదేశాంగ కార్యదర్శి రవి మాట్లాడుతూ.. జూలై 9న ప్రధానమంత్రి నమీబియాను సందర్శిస్తారని, ఈ పర్యటన కూడా చాలా ముఖ్యమైనదని అన్నారు. ఇది 27 సంవత్సరాల తర్వాత జరుగుతోందని అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నేతుంబో నంది-న్దైత్వా ఈ సంవత్సరం మార్చిలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని చేయనున్న నమీబియా పర్యటనతో ఇరు దేశాల మధ్య ఆర్ధిక సంబంధాలు మరింత మెరుగు పరుచుకునే అవకాశముందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదకొండు ఏళ్లలో మోడీ చేయనున్న సుదీర్ఘ పర్యటనల్లో ఇదీ ఒకటి. జులై 9 వరకూ కొనసాగే ఈ ఎనిమిది రోజుల్లో మోడీ రెండు ఖండాల్లో పర్యటించనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకే సారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇది రెండో సారి. 2016లో ఆయన అమెరికా, మెక్సికో,స్విట్జర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్ లో ఒకే సారి పర్యటించారు. అలాగే 2015 జూలైలో ఎనిమిది రోజుల పాటు ఆరు దేశాల్లో పర్యటించారు. ఈ సమయంలో రష్యాతో పాటు మధ్య ఏషియాలో పర్యటించారు మోడీ.
సుదీర్ఘ పర్యటన సంగతి సరే.. దీని ద్వారా భారత్ కి లభించనున్న ప్రయోజనాలేంటి? ఏయే దేశాలతో ఏయే అంశాల పట్ల చర్చలు కొనసాగున్నాయి? వీటి ద్వారా మోడీ ఏం సాధించనున్నారు? మరీ ముఖ్యంగా నమీబియా పర్యటన ద్వారా ఎలాంటి ఆర్ధికాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది? ఆ వివరాలు ఎలాంటివి?
ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాకో, నమీబియా
బ్రిక్స్ లో గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించే దేశంగా ఎస్టాబ్లిష్ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, నమీబియా చూడ్డానికి చిన్న దేశాలే. ఈ త్రీ కంట్రీస్ పాపులేషన్ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల జనాభాకన్నా తక్కువ ఉండొచ్చు. అయినా వీటి ద్వారా ఎంతో వ్యూహాత్మక భాగస్వామ్యం పొందవచ్చు. భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగడంలో ఈ దేశాలతో ఫ్రెండ్షిప్ ఎంతో అవసరమని తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సుకు ముందే భారత్ ప్రపంచానికి ఈ సందేశాన్ని ఇస్తోంది. మేము గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడ్డం మాత్రమే కాదు.. అందుకు నాయకత్వం వహిస్తాం కూడా అంటోంది భారత్. వచ్చే ఏడాది బ్రిక్స్ గ్రూప్ నకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. దీంతో ప్రధాని మోడీ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను మరింత బలోపేతం చేయనుందని భావిస్తున్నారు. మన విదేశాంగ శాఖ చెప్పడాన్ని బట్టీ చూస్తుంటే.. ఈ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు మాత్రమే కాదు.. డిజిటల్ డిప్లొమసీ, రక్షణ సహకారం, వ్యాక్సిన్ అభివృద్ధి, క్రిటికల్ మినరల్స్ సేఫ్టీ వంటి కీలకాంశాలపై చర్చించనున్నారు. అంతే కాదు ఈ దేశాలకు రక్షణ పరికరాల సరఫరాకు కూడా సిద్ధమవుతోంది భారత్.
ఇప్పటికే 30 వేల కోట్లకు పైగా భారత్‌కు ఆర్డర్లు
మన భారత రక్షణ మార్కెట్ మరింత విస్తరిస్తోంది. మేకిన్ ఇండియా ద్వారా రూపొందించిన బ్రహ్మోస్ వంటి మన ఆయుధాలు ఇప్పటికే 30 నుంచి నలభై వేల కోట్ల రూపాయల మేర ఆర్డర్లను దక్కించుకుంది. ఒక రకంగా చెబితే.. ఇది ఎంతో చౌక. అదే అమెరికా వంటి దేశాల నుంచి ఇలాంటి ఆయుధాలను కొనుగోలు చేయాలంటే.. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారత్ తనకున్న మానవ వనరులు, ఇతర సదుపాయాలతో తక్కువ ధరకు ఆయుధాల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. రష్యా, ఇజ్రాయెల్ సాంకేతిక సహకారాలతో.. మనం ప్రత్యామ్నయ ఆయుధ సరఫరా చేయగల దేశంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. మొన్నటి ఆపరేషన్ సిందూర్ ద్వారా.. మన ఆయుధాలు సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో.. ఈ దిశగా.. భారత్ తన డిఫెన్స్ మార్కెట్ ని మరింత ఇంప్రూవ్ చేసుకోదలిచింది. దీని ద్వారా గ్లోబల్ సౌత్ కి రక్షణాత్మక భరోసా అందించనుంది భారత్. దీన్ని మరింత ఎస్టాబ్లిష్ చేసేలా కనిపిస్తోంది మోడీ లీడర్షిప్ లోని భారత్.
ఘనా జనాభా సుమారు 3. 38 కోట్లే
ఘనా జనాభా సుమారు 3. 38 కోట్లే. అయినా భారత్ కి ఎంతో కీలకమైన దేశం. ఎప్పుడూ భారత్ కి మద్ధతుగా నిలిచే ఈ దేశాన్ని మోడీ జూలై 2, 3 తేదీల్లో సందర్శించనున్నారు. అక్కడి ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశపు ప్రధాని అయిన మోడీ ఆ దేశ పార్లమెంటునుద్దేశించి ప్రసంగించనున్నారు. వ్యవసాయం, వ్యాక్సిన్ ఉత్పత్తి, రక్షణ సహకారం, డిజిటల్ మౌలిక వేదికలపై కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇప్పటికే భారత్ హెల్త్, ఐటీ, విద్య రంగాలకు సంబంధించి మద్ధతనిస్తోంది. మోడీ పర్యటన ద్వారా ఈ బంధం మరింత బలపడనుంది. ప్రధాని మోడీ జులై 3, 4 తేదీల్లో ట్రినిడాడ్ టుబాగోను తొలిసారి దర్శించనున్నారు. ఇక్కడ భారత్ సంతతి వారి జనాభా ఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఈ దేశంలో సుమారు రెండున్నర లక్షల మంది హిందువులున్నారు. ఇక్కడ భారతీయ సాంస్కృతిక చిహ్నాలైన హిందూ దేవాలయాలు సైతం ఉన్నాయి. మోడీ పర్యటన భారత డయాస్పోరా డిప్లమసీకి మరింత మద్ధతు లభించనుంది. ఈ రెండు దేశాల మధ్య చర్చలు ఫలిస్తే- వ్యాపారం, విద్య, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకోనున్నాయి.
భారత్‌కు చీతాలను తిరిగి ఇచ్చిన నమీబియా
తర్వాత మోడీ జూలై 9న నమీబియా వెళ్లనున్నారు. ఒక భారత ప్రధాని నమీబియా సందర్శించడం ఈ మూడు దశకాల్లో ఇదే తొలిసారి. ఇక్కడ కూడా ప్రధాని మోడీ నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రక్షణ, ఇంధన, ఖనిజ రంగాల భాగస్వామ్యం పై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే నమీబియా.. భారత్ కు చీతాలను తిరిగి పంపిన దేశంగా పేరుంది. ఈ పర్యటనతో ఈ బంధం మరింత బలపడనుందని అంటున్నారు. నమీబియా పర్యటన ద్వారా జరగనున్న అతి ముఖ్యమైన ఒప్పందం.. వజ్రాల వ్యాపారినికి సంబంధించినది. అంతే కాదు కీలకమైన యురేనియంకి సంబంధించి కూడా ఈ దేశంతో మనకు ఎంతో అవసరం. నమీబియాలో అనేక భారతీయ వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. నమీబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్న సముద్ర వజ్రాల నిక్షేపాలున్నాయి. మన భారతీయ కంపెనీలు మైనింగ్, తయారీ, వజ్రాల ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. ఈవిలువ 800 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో చెబితే ఈ మొత్తం సుమారు 70 వేల కోట్ల వరకూ ఉంటుంది. మోడీ టూర్ సందర్భంగా.. ఈ వ్యాపార బంధం మరింత బలోపేతం కానుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలకమైన ఖనిజాలు
అలాగని నమీబియా భారత్ కి ముడి వజ్రాలను నేరుగా అమ్మదు. మొదట లండన్, తదితర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఇటు వస్తాయి. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులకు ప్రయోజనం కలిగేలా కొన్ని కీలక ఖనిజాలను వాడుకునే వెసలుబాటును నమీబియా అందించేలా కనిపిస్తోంది. కోబాల్ట్, లిథియం.. అరుదైన మూలకాల కోసం కొత్త మైనింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే సామర్ధ్యం దీనికి ఉంది. ఇక యురేనియం విషయంలో నమీబియా భారత్ కి ఎంతో కీలక దేశం. ఈ దిశగా నమీబియా భారత్ మధ్య చర్చలు జరిగేలా తెలుస్తోంది.
బ్రిక్స్‌లో గ్లోబల్ నాయకత్వం వహించే దేశంగా ఎస్టాబ్లిష్
ఓవరాల్‌గా జూలై 6, 7 తేదీల్లో బ్రెజిల్లో జరగనున్న బ్రిక్ సదస్సులో మన వినిపించనున్న వాయిస్ ఏంటంటే.. గ్లోబల్ సౌత్ దేశాల ఐఖ్యత. అంతే కాదు భారత్ పాశ్చాత్య దేశాలను అనుసరించే దేశం కాదు.. గ్లోబల్ సౌత్ కి నాయకత్వం వహించే దేశంగా ఎదుగుతోంది. ఈ నాయకత్వం కేవలం మాటల్లో కాదు.. చేతల్లో స్పష్టంగా కనిపిస్తోన్న విధం ఎస్టాబ్లిష్ చేయనుంది.. మోడీ నాయకత్వంలోని భారత్.