Uravakonda YSRCP Future: ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ అవ్వడంతో ప్రత్యేకంగా ఫోకస్ అవుతోంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వాగ్దాటికి వైసీపీ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి లీడర్‌ని ఎదుర్కోవడానికి వైసీపీలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారంట. వైసీపీ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరెడ్డి సరిపోరని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టడానికి తాపత్రయపడుతున్నారంట. అదే ఇప్పుడు ఉరవకొండ వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోందంట
రెండు సార్లూ ఓటమి చవిచూసిన కేశవ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార, విపక్షాలకు అత్యంత బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి . 1994 నుంచి పయ్యావుల కేశవ్ అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సార్లూ ఓటమి చవిచూసిన కేశవ్, సార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరుస విజయాలు సాధించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా మంచి సబ్జెక్ట్ ఉన్న నేతగా పయ్యావుల కేశవ్‌కు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పయ్యావుల కేశవ్‌కు 2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
ఉరవకొండ వైసీపీలో కేశవ్‌ని ధీటుగా ఎదుర్కునే నేత కరువు
2019లో టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు గెలుపొందని కేశవ్‌కు టీడీపీ అధినేత పీఏసీ చైర్మన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత 2024లో కూటమి అధికారంలోకి రాగానే కేశవ్‌కి ఆర్థిక శాఖను అప్పజెప్పారు. ఆ స్థానాన్ని ఆయన సమర్థంగా నిర్వహిస్తున్నారు. అయితే పయ్యావుల కేశవ్ ను ధీటుగా ఎదుర్కొనే నేత వైసీపీ లో లేకపోవడం ఆ పార్టీకి కొద్దిగా ఇబ్బందికరంగా మారిందట.ఉరవకొండ వైసిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు సొంత తమ్ముడు కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కొంత మైనస్ అవుతోందంట. మరో వైసీపీ నేత, ఎమ్మెల్సీ వై శివరామరెడ్డితో కూడా విశ్వేశ్వరరెడ్డికి పొసగడం లేదు. ఆ క్రమంలో ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఇప్పుడు ఉరవకొండ వైసీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్నారట.
గత 2 ఎన్నికల్లో విశ్వేశ్వర్‌కి సహకరించని శివరామిరెడ్డి
గత రెండు ఎన్నికల్లో విశ్వేశ్వర్‌రెడ్డికి శివరామరెడ్డి సహకరించలేదని, అందుకే విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2024 ఎన్నికల్లో లో విశ్వేశ్వర్ రెడ్డిని కాదని టికెట్ సాధించుకోవాలని శివరామరెడ్డి గట్టిగానే ప్రయత్నించారు. 2029 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడం, పయ్యావులు కేశవ్ మంత్రిగా ఉండటంతో ఉరవకొండలో విశ్వ కొంత సైలెంట్ అయ్యారంట. ఆ గ్యాప్‌ను శివరామరెడ్డి భర్తీ చేసేందుకు తహతహలాడుతున్నారు. హంద్రీనీవా కాలువ పనులపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులుకు బహిరంగ సవాల్ విసిరి సెన్సేషన్ అయ్యారు.
Also Read: మాట మార్చిన హరీష్.. మరి కవిత లెక్కలేంటి?
హంద్రీనీవా కాలువ పనులపై చర్చకు శివరామరెడ్డి సవాల్
హంద్రీనీవా కాలువ పనులు ఎవరి హయాంలో ఏ మేరకు జరిగాయో బహిరంగ చర్చకు రావాలని శివరామిరెడ్డి టీడీపీకి సవాల్ విసిరారు. దానిపై రియాక్ట్ అయిన కాలువ శ్రీనివాసులు జీడిపల్లి డ్యాం వద్ద చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. ఈ నెల 21 న బహిరంగ సవాల్ కు ముహూర్తం ఏర్పాటు చేశారు…సరిగ్గా ఈ మే 21 ఉదయం 11 గంటలకు జీడిపల్లి డ్యాం వద్దకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ శివరామరెడ్డి మాత్రం ఉరవకొండ శిలాఫలకం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. చెప్పిన మాట ప్రకారం కాలువ శ్రీనివాసులు జీడిపల్లి డ్యాం వద్దకు రాగా, ఉరవకొండ శిలాఫలకం వద్దకు శివరామరెడ్డి తన అనుచరులతో చేరుకున్నారు. ఇద్దరు చేరో చోట బిచాణా వేయడంతో బహిరంగ చర్చ జరగలేదు. ఆ ఇద్దరు కాసేపు ఫోన్లో చర్చించుకుని సవాళ్ల పర్వానికి తెర దించారు.
సవాల్‌తో హైలెట్ అయిన శివరామిరెడ్డి
హంద్రీనీవా కాలువ పనులపై చర్చకు శివరామరెడ్డి సవాల్ చేయడం ఆయనకు పొలిటికల్ మైలేజ్ తెచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ సమన్వయకర్త , ఎంపీ మిథున్ రెడ్డి జిల్లా పర్యటనలో ఉండగా, అందులోనూ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్చార్జిలతో మీటింగ్‌లో ఉండగా శివరామరెడ్డి ఈ ఇష్యూతో పార్టీలో బాగా హైలైట్ అయ్యారట. ఇక ఇదే ఊపుతో నియోజకవర్గంలో దూసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఎమ్మెల్సీ శివరామరెడ్డి దూకుడు కి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని విశ్వేశ్వరరెడ్డి వర్గీయులు ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి ఉరవకొండ వైసీపీలో ఎవరిది పైచేయి అవుతుందో.