Kharg Island: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లే అనిపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్‌కు గుండెకాయ లాంటి ఖార్గ్ ఐలాండ్‌పై.. అమెరికా సేనలు కన్నేయడం పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధంలో హీట్‌ని మరింత పెంచుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఇది కేవలం ఓ చిన్న భూభాగం కాదు. ఇరాన్ ఎకానమీకి ఊపిరిపోసే చమురు టెర్మినల్. ఇరాన్ ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే విదేశాలకు వెళ్తుంది.
పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖార్గ్ ఐలాండ్‌పై ట్రంప్ గురి పెట్టడమంటే.. ఇరాన్ గొంతు నులమడమే అనే చర్చ జరుగుతోంది. అందుకోసమే.. ఇరాన్ చమురు నిల్వలను దెబ్బతీసి, ఆ దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి.. లొంగదీసుకోవాలనేది అమెరికా ప్లాన్‌గా కనిపిస్తోంది. ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నా, చేసుకోకపోయినా.. తమ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయంటున్నారు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. కొన్నాళ్ల పాటు అమెరికా ఆ ద్వీపాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవచ్చని కూడా చెప్పారు. ఇరాన్ దగ్గర సెల్ఫ్ డిపెన్స్ కోసం ఇంకేమీ మిగల్లేదని, ఒక్కసారి తాము దాడి మొదలుపెడితే.. చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్ ట్రిపోలి.. 3,500 మంది మెరైన్లతో పశ్చిమాసియా చేరుకుంది. యూఎస్‌ఎస్ ట్రిపోలిపై ఎఫ్-31 ఫైటర్ జెట్స్ లాంటి యుద్ధ విమానాలను మోహరించొచ్చు. యూఎస్‌ఎస్ బాక్సర్‌తో పాటు శాన్‌డియాగో నుంచి వచ్చిన ఇతర నౌకాదళ యూనిట్లు, అదనపు బలగాలు పశ్చిమాసియాకు చేరుకున్నాయి. మరోవైపు, ఇరాన్ ఓడిపోయే దాకా యుద్ధం చేయాలని గల్ఫ్ దేశాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలనా యంత్రాంగం పూర్తిగా కూలిపోయే దాకా యుద్ధం ముగించొద్దని ప్రెసిడెంట్ ట్రంప్‌ని ప్రైవేట్‌గా కోరాయట.
ఇలా కోరిన దేశాల్లో.. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ ఉన్నాయని.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయ్. గల్ఫ్ దేశాలు ఇరా కోరడానికి మేజర్ రీజన్ ఒకటే. అదే.. పట్టు సడలని ఇరాన్. నెల రోజులు దాటినా.. యుద్ధంలో ఇరాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపడలేదు. యుద్ధం ఎలాగూ కొనసాగుతోంది కాబట్టి.. టెహ్రాన్‌లోని మత పెద్దల పాలనని పూర్తిగా కూలదోసేందుకు ఇదొక చరిత్రాత్మక అవకాశమనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో.. పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపులు పెరుగుతుండటం ఉద్రిక్తతల్ని పెంచుతోంది.
ట్రంప్ సేనలు ఖార్గ్‌ను టచ్ చేస్తే, ఇరాన్ కేవలం రక్షణకే పరిమితం కాదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్.. తమకున్న అన్ని రకాల శక్తులను కూడగట్టి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రాలు రెండే రెండు. ఒకటి.. హర్మూజ్ జలసంధి. మరొకటి.. ఖార్గ్ ఐలాండ్. ఇప్పటికే.. హర్మూజ్‌ని మూసివేయడంతో చమురు సప్లై దెబ్బతింది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయ్. ఇప్పుడు.. ఖార్గ్ పైనా అమెరికా సేనలను మోహరిస్తే.. ఇరాన్ చూస్తూ ఊరుకోదు. అమెరికా గనక దాడి చేస్తే, ఇరాన్ మిసైళ్లని.. అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల వైపుకు మళ్లిస్తుంది. అమెరికా స్థావరాలున్న.. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్‌పైనా విరుచుకుపడే అవకాశం ఉంది. హెజ్బొల్లా, హౌతీ, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు.. ఏక కాలంలో అమెరికా ప్రయోజనాలపై దాడులు ప్రారంభిస్తాయ్. అప్పుడిది.. ఒక దేశంతో యుద్ధంలా కాకుండా, ఆ ప్రాంతమంతా విస్తరించే మల్టీ ఫ్రంట్ వార్ జోన్‌గా మారిపోతుంది.
ట్రంప్ సేనలు నేరుగా ఖార్గ్ ద్వీపంలో ల్యాండ్ అయి.. భూతల దాడులు ప్రారంభిస్తే.. అది సూసైడ్ మిషన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే.. పర్షియన్ గల్ఫ్ నిండా ఇరాన్ వేల సంఖ్యలో సముద్రపు మైన్లని మోహరించింది. అమెరికా యుద్ధ నౌకలు వీటిని దాటుకొని రావడం కష్టం. పైగా.. తన భూభాగంపై సుదీర్ఘకాలం పోరాడగలిగే సామర్థ్యం ఉన్న దేశం ఇరాన్. అప్పుడు, ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు. చమురు ధరలు బ్యారెల్‌కు 200 దాకా చేరే అవకాశం ఉంటుంది. ఇది, ప్రపంచవ్యాప్త మాంద్యానికి దారితీస్తుంది. ఇరాన్ ఎంతకూ లొంగకపోయే సరికి.. ట్రంప్ మ్యాగ్జిమమ్ ప్రెజర్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. దాంతో.. ఇరాన్‌ని లొంగదీసుకుంటారా? లేక.. వినాశకరమైన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఖార్గ్ ద్వీపంపై.. చిన్న నిప్పు కణికి పడినా, అది.. మిడిల్ ఈస్ట్ మొత్తానికి సెగ తగిలేలా చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
ఖార్గ్ ఐలాండ్.. ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఓ చిన్న ద్వీపం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మేజర్ క్రూడ్ టెర్మినల్ ఇందులోనే ఉంది. ఇరాన్‌ని లొంగదీసుకోవాలంటే.. ఖార్గ్‌లోనే కొన్నాళ్లు మకాం వేయాల్సి వస్తుందని ట్రంప్ ఇంతకుముందే చెప్పారు. ఈ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని, అక్కడి చమురు క్షేత్రాలను టార్గెట్ చేసుకోకుండా.. అమెరికా సైన్యం వేచి ఉందన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు.. ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా సేనలు ముందుకు కదులుతున్నాయ్. యూఎస్ దళాలు ఎప్పుడైనా ఖార్గ్ ఐలాండ్‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, తమ ఆధీనంలోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయ్. ఈ ద్వీపాన్ని అమెరికా గనక స్వాధీనం చేసుకుంటే ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడమే కాదు, అక్కడి నుంచే ఇరాన్ ప్రధాన భూభాగంపై దాడులు చేసేందుకు ఓ వేదికలా మారుతుంది.
ఖార్గ్‌ని స్వాధీనం చేసుకోవడం వల్ల.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్థిక మూలాలను సమర్థవంతంగా దెబ్బతీయొచ్చని, ఈ చర్య వారి యుద్ధ సామర్థ్యాన్ని ప్రభావం చేస్తుందని చెబుతున్నారు. హర్మూజ్‌ని తెరిచి ఉంచేలా.. ఇరాన్‌ని బలవంతం చేయడానికి ఈ ద్వీపాన్ని ఓ అస్త్రంలా వాడొద్దని అమెరికా భావిస్తోంది. మరోవైపు, అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పుతో.. ఇరాన్ కొన్ని వారాలుగా ఖార్గ్ ఐలాండ్‌లో సైనిక సిబ్బందిని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మోహరించి.. రక్షణని బలోపేతం చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను కూడా మోహరించింది. చుట్టుపక్కల నీటిలో యాంటీ పర్సనల్, యాంటీ ఆర్మర్ మైన్ ట్రాప్స్‌ని కూడా ఏర్పాటు చేసింది. కేవలం 24 చదరుపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఖార్గ్ ఐలాండ్ నుంచే.. ఇరాన్ 90 శాతం ఆయిల్‌ని ఎగుమతి చేస్తోంది. ఇరాన్ మనుగడకు ఇది చాలా కీలకం. కానీ, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాటి చేసినా, నష్టం కలిగించినా.. ఇంధనపరంగా అది చాలా పెద్ద పొరపాటు అవుతుందంటున్నారు.
అమెరికా ఇప్పటివరకు, ఇరాన్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే దిశగా ముందుకు సాగలేదు. ఇజ్రాయెల్ కొన్ని ప్రదేశాలపై దాడి చేసినప్పటికీ, ఆ యుద్ధంలో.. యూఎస్ చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. ఇరాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసే దేశం. వార్ వల్ల ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయ్. హర్మూజ్ మూసివేతతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి కీలక ప్రదేశాన్ని టార్గెట్‌గా చేసుకోవడం.. వ్యూహాత్మకంగా సరైంది కాదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయ్.
పర్షియన్ సామ్రాజ్యం నాటి నుంచే.. ఖార్గ్ ద్వీపం గల్ఫ్‌లో వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది. ఇరానియన్ తీరానికి దగ్గరగా ఉన్న ఈ దీవి దగ్గర సముద్రం లోతుగా ఉంటుంది. తీరప్రాంత జలాలతో పోలిస్తే.. ఇక్కడి జలాలు చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు ప్రధాన చమురు క్షేత్రాలైన.. అబూజర్, ఫోరౌజాన్, దోరూద్ నుంచి క్రూడ్ ఆయిల్ ఈ ఖార్గ్ టెర్మినల్‌కు చేరుతుంది. సముద్రం అడుగున ఉన్న పైపులైన్ల ద్వారా.. చమురుని ఇక్కడికి తరలిస్తారు. ఇక్కడే.. ముడి చమురుని ఎగుమతి కోసం ప్రాసెస్ చేస్తారు. ఈ టెర్మినల్ ద్వారా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల చమురు వెళ్తుంది. ఇక్కడ.. ఆయిల్ నిల్వ సామర్థ్యం కోటీ 80 లక్షల బ్యారెళ్లు. ఖార్గ్ దీవి చమురు ఎగుమతి కేంద్రంగా మారిన నాటి నుంచి ఇరాన్‌కు వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇంధన మార్కెట్‌లో దీని ప్రాముఖ్యత కారణంగా, అమెరికా ఇప్పటివరకు దీనిని టార్గెట్ చేయలేదు. కానీ, ఇప్పుడు అక్కడ అమెరికా అడుగుపెడితే.. బ్యారెల్ చమురు ధర 150 డాలర్లు దాటిపోతుందనే అంచనాలున్నాయ్. అదే జరిగితే, ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశం కూడా ఉండదంటున్నారు.
ఖార్గ్ ద్వీపంపై దాడి చేయకుండా, దానిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ చమురుని అమ్మలేకపోతే, పాలన కొనసాగించేందుకు అవసరమైన డబ్బు ఉండదనే ఆలోచనతో ఉంది. అందుకోసమే.. ఈ దీవిని స్వాధీనం చేసుకునేందుకు నేరుగా సైన్యాన్నే రంగంలోకి దించింది అమెరికా. ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల మధ్య.. ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగే అవకాశాలు లేవని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు.. ఏ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఖార్గ్ ద్వీపంపై దాడి చేసేందుకు ధైర్యం చేయలేదు. మరి.. ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఇరాన్ ఎలా రియాక్ట్ కాబోతోందనే దానిపై గ్లోబ్ అంతటా ఆసక్తిగా చూస్తోంది.
Also Read: వామ్మో.. వందే భారత్ ఫుడ్ అంత డేంజరా? లేడీ ప్యాసింజర్ షాకింగ్ కామెంట్స్!
Story by: Anup, Big Tv