US-Israel-Iran War: సరిగ్గా నెల రోజుల క్రితం.. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేశాయి. అంతే, అప్పటి నుంచి ఇప్పటివరకు పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. అనేక తీవ్ర పరిణామాలు చవిచూశాయ్. మధ్యప్రాచ్యం మొత్తం గందరగోళంలో పడింది. యుద్ధంలో 3 వేల మందికి పైగా మరణించారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయ్. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకున్నా, ఏ పక్షానికీ మద్దతు తెలపకున్నా.. భారత్ లాంటి అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయ్. నెలరోజుల యుద్ధం తర్వాత.. అందరి దృష్టి నెక్ట్స్ ఏం జరగబోతోందనే దానిమీదే ఉంది. ఇప్పుడు.. దౌత్యపరమైన నిష్క్రమణ కనిపిస్తుందా? లేక సైనిక ఉద్రిక్తతలు మరోస్థాయికి వెళ్తాయా?
ఇరాన్ పాలనలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా, అమెరికా, ఇజ్రాయెల్.. టెహ్రాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయ్. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని తుడిచిపెట్టినప్పటి నుంచి యుద్ధం మొదలై నెల గడిచింది. అది, ఇంకా కొనసాగుతోంది. అయితే, కొద్ది రోజుల్లోనే.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తాము అనుకున్నదానికంటే బలమైన దేశాన్ని, విధ్వంసకర ప్రత్యర్థిని ఢీకొడుతున్నామనే విషయాన్ని గ్రహించారు.
టోమాహక్‌లు, బంకర్ బస్టర్లు, అనేక రకాల మిసైళ్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నా, ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతో కూడిన మిసైళ్లు, డ్రోన్లతో.. అమెరికా, ఇజ్రాయెల్‌ని ముప్పుతిప్పలు పెడుతోంది. గల్ఫ్ దేశాల్లోనూ దాడులతో వణుకు పుట్టించింది. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను అడ్డుకొని.. ప్రపంచ ఇంధన సరఫరాపై తన పట్టుని బిగించింది. దాంతో.. చమురు ధరలు 40 శాతానికి పైగా పెరగడంతో.. ప్రెసిడెంట్ ట్రంప్ చివరికి చర్చల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఏప్రిల్ 6 వరకు, పది రోజుల పాటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను నిలిపివేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, యుద్ధంలో ఇరాన్ ఇంకా ఉత్సాహంగానే కనిపిస్తోంది. యుద్ధమంటూ ముగింపు దశకు చేరుకుంటే.. అది తాము పెట్టిన షరతుల ప్రకారమే ముగుస్తుందని పదే పదే నొక్కి చెబుతోంది. మరోవైపు, కాల్పుల విరమణ కోసం రహస్య చర్చలను కూడా ప్రారంభించింది. కానీ, ఈ ప్రశాంతత వెనుక, వేలాది మంది మెరైన్లు, పారాట్రూపర్లు మధ్యప్రాచ్యానికి సమీపిస్తుండటంతో, అమెరికా భూతల దండయాత్రకు కూడా సిద్ధమవుతోందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచింది. అందువల్ల, నెల గడుస్తున్నా.. యుద్ధ పరిస్థితి అనిశ్చితంగానే ఉంది. ఈ సంఘర్షణ.. ఎక్కడికి దారితీస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
యుద్ధం మొదలైన మొదటి 24 గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు.. ఇరాన్‌లోని 1500 టార్గెట్లపై దాడి చేశాయ్. ఇరాన్‌పై వేగంగా, బలంగా దాడి చేస్తే, ఆ దేశంలో పాలన దానంతట అదే కుప్పకూలిపోతుందనుకున్నారు. మతపరమైన పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఇరాన్ ప్రజలకు.. తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇదే గొప్ప అవకాశమని ట్రంప్, నెతన్యాహు రెచ్చగొట్టారు. కానీ, జనంలో అలాంటి తిరుగుబాటేమీ కనిపించలేదు. తొలి విడత దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఐఆర్‌జీసీ కమాండర్, ఇరాన్ రక్షణ మంత్రి మరణించారు.
అయితే, ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన మిసైల్ దాడిలో.. 175 మంది విద్యార్థులు మరణించారు. ఈ ఘటనని ప్రపంచవ్యాప్తంగా ఖండించారు. తర్వాత.. ఇది అమెరికా సైన్యం టార్గెట్ సెట్ చేయడంలో జరిగిన పొరపాటుగా తేలింది. తర్వాత అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్‌లోని తన పొరుగు దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. యుద్ధం మొదలైన తొలి వంద గంటల్లోనే, ఇరాన్ 5 వందలకు పైగా మిసైళ్లు, 2 వేలకు పైగా షాహిద్ డ్రోన్లని ప్రయోగించింది. ఇవే.. ఇరాన్ ఎంత బలంగా ప్రతిఘటిస్తుందో చూపింది.
నెల రోజులు గడిచేసరికి, 16 దేశాలు ఈ యుద్ధంలోకి వచ్చేశాయ్. భారత్‌లో నేవీ డ్రిల్స్ ముగించుకొని తిరిగి వస్తున్న ఓ ఇరాన్ యుద్ధ నౌకను, అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ టార్పెడోతో ముంచేయడంతో.. యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జరిపిన తొలి సబ్‌మెరైన్ ఎటాక్‌లో.. దాదాపు 90 మంది ఇరాన్ నావికులు మరణించారు. యుద్ధం మొదలైన రెండో వారంలో.. ఈ ఘటన వరల్డ్ వైడ్ హెడ్‌లైన్‌గా నిలిచింది. ఈ యుద్ధం లెబనాన్‌లోనూ తెరమీదికొచ్చింది.
మార్చి 2 నుంచి ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన ఘర్షణల్లో 1200 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినప్పటికీ, ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం కాలేదు. రెండో వారంలో.. ఇరాన్ నిపుణుల సభ మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ, బహిరంగంగా కనిపించలేదు. అయితే, ఆయనొక సుదీర్ఘ సందేశాన్ని విడుదల చేశారు. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. హర్మూజ్ జలసంధి నుంచి రవాణా సాగే 20 శాతం చమురు, గ్యాస్‌ని దిగ్బంధిస్తామని నొక్కి చెప్పారు. అయితే, మొజ్తాబా కోమాలో ఉన్నారని కొన్ని రిపోర్టులు తెలియజేస్తున్నాయ్. ఇప్పటివరకు, ఇరాన్ సైన్యం ఎలాంటి సెంట్రల్ కమాండ్ లేకుండానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, అమెరికా, ఇజ్రాయెల్‌ని సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది.
యుద్ధం మొదలైనప్పడు ప్రపంచం మొత్తానికి అమెరికాదే పైచేయిగా కనిపించింది. కానీ.. నెల గడిచాక ఇరాన్ కూడా బలమైన ప్రత్యర్థిగానే కనిపిస్తోంది. మూడో వారంలో చమురు యుద్ధం తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ క్షేత్రాలు, ఇంధన సౌకర్యాలపై ప్రతీకార దాడులు జరిగాయ్. ప్రపంచ ఎల్‌ఎన్జీ సరఫరాకు వెన్నెముక అయిన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ గ్యాస్ ఫీల్డ్ ఇరాన్ దేశీయ గ్యాస్‌లో 80 శాతం అవసరాలను తీరుస్తోంది.
దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఖతార్‌లోని రాస్ లఫాన్ ఎల్‌ఎన్జీ ప్లాంట్, సౌదీ అరేబియాలోని చమురు దిగ్గజం ఆరామ్‌కోకు చెందిన సామ్రెఫ్ రిఫైనరీతో సహా ప్రాంతీయ ఇంధన సౌకర్యాలపై దాడి చేసింది. ఈ ఘటన.. ట్రంప్, నెతన్యాహు మధ్య ఉన్న విభేదాలను ఎత్తిచూపింది. అమెరికాకు ఏమీ తోచడం లేదని ట్రంప్ అంగీకరించారు. ఇరాన్ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయొద్దని.. నెతన్యాహుని హెచ్చరించారు. వాస్తవానికి, గత రెండు వారాలుగా.. ట్రంప్, నెతన్యాహు మధ్య పెద్దగా చర్చలు జరగలేదు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు హతమై ఉండొచ్చనే విస్తృతమైన ఊహాగానాలకు ఇది దారితీసింది.
నాలుగు వారాలుగా హర్మూజ్ జలసంధిపై.. ఇరాన్ పట్టు స్థిరంగా ఉంది. యుద్ధం జరుగుతున్నంత సేపు, ఇరాన్ మందుపాతరలు, సముద్ర డ్రోన్లు, షాహెద్ డ్రోన్లతో.. హర్మూజ్‌ని ఓ దుర్భేద్యమైన కోటగా మార్చేసింది. ఈ యుద్ధంలో.. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారింది. అయితే, దాని మూల్యాన్ని.. భారత్ లాంటి అనేక ప్రపంచ దేశాలు చెల్లిస్తున్నాయ్. ప్రస్తుతం.. భారత్‌తో సహా ఐదు మిత్రదేశాలతో ఇరాన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ దేశాలకు చెందిన ఆయిల్ నౌకలను మాత్రమే ముందుకు కదిలేందుకు అనుమతిస్తోంది. పైగా, ఇక్కడ ఇరాన్ టోల్ బూత్ ఏర్పాటు చేసింది. హర్మూజ్ గుండా సేఫ్‌గా ప్రయాణించేందుకు.. ఇరాన్ దాదాపు 18 కోట్లు వసూలు చేస్తోందని ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయ్. ఇప్పటివరకు, భారత జెండా కలిగిన సుమారు 9 చమురు, ఎల్‌పీజీ ట్యాంకర్లు.. హర్మూజ్ గుండా భారత తీరాలకు చేరుకున్నాయ్. సుమారు 22 భారతీయ నౌకలు ఇంకా అనుమతి కోసం వేచి ఉన్నాయ్.
ఈ యుద్ధంలో తలపడుతున్న మూడు దేశాలతోనూ.. భారత్ సున్నితమైన సమతుల్యతని కొనసాగిస్తోంది. ఏ దేశం కూడా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు వీల్లేకుండా.. కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే, హర్మూజ్ జలసంధి భారత్‌కు కీలకమైన జల మార్గం. మన దేశ చమురు దిగుమతుల్లో సుమారు 50 శాతం హర్మూజ్ గుండానే సాగుతాయ్. ఇరాన్ పట్టు బిగించడం వల్ల.. రెండు వారాలుగా భారత్ వంటగ్యాస్ సరఫరాలో తీవ్రమైన కొరత ఎదుర్కొంటోంది. ఇది, ప్రజలు భయంతో కొనుగోళ్లు మొదలుపెట్టేందుకు దారితీసింది. కొన్ని రెస్టారెంట్లని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగించడం అంత సులభం కాదు. కాల్పుల విరమణ కోసం చర్చలు జరిపేందుకు, హర్మూజ్‌ని తిరిగి తెరిచేందుకు.. ట్రంప్ ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులను ఐదు రోజులు నిలిపివేశారు. చర్చలు బాగానే సాగుతున్నాయంటూ.. ఆ గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. అయితే, ఇరాన్ దీనిని ఖండించింది. అయినప్పటికీ, టెహ్రాన్ రహస్య చర్చలు జరుపుతోందనే రిపోర్ట్స్ వస్తున్నాయ్. ఒకవేళ చర్చలు విఫలమైతే, హర్మూజ్‌ని తెరిపించేందుకు ట్రంప్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయ్. ఇప్పటికే, ప్రెసిడెంట్ ట్రంప్ మిడిల్ ఈస్ట్‌లో వేలాది మంది అమెరికా సైన్యాన్ని మోహరించాలని ఆదేశించారు. ఇది భూతల దండయాత్రకు దారితీసే అవకాశాలను, ఉద్రిక్తతలను పెంచుతోంది.
అందరి అటెన్షన్ ఇప్పుడు.. ఇరాన్ కిరీటంలో కలికితురాయిగా పిలిచే ఖార్గ్ ద్వీపంపై ఉంది. టెహ్రాన్ ఆర్థిక జీవనాధారమైన ఈ ద్వీపం నుంచే 90 శాతం చమురు ఎగుమతి అవుతుంది. అమెరికా ఇప్పటికే, యుద్ధం మధ్యలో ఖార్గ్‌లోని సైనిక స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అయితే, ఇంధన మౌలిక సదుపాయాలకు నష్టం జరగలేదు. ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు హర్మూజ్‌ని తిరిగి తెరవమని ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. ట్రంప్ ఖార్గ్‌లోనూ సైనిక బలగాలను మోహరించొచ్చని చెబుతున్నారు. అయితే, ఇరాన్‌పై ట్రంప్ మిలటరీ ప్రెజర్.. ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా? లేక.. యుద్ధం కొత్త మలుపు దిశగా సాగుతుందా? అనేది.. రాబోయే రోజుల్లో తేలిపోతుంది.
Also Read: కేటీఆర్ చేసిన పనికి ఆ రోజు మూసుకొని కూర్చున్న.. దానం ఆవేదన
Story by: Anup, Big Tv