MLC Elections 2025: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పేరుకి పది మంది పోటీ పడుతున్నప్పటికీ ముగ్గురు అభ్యర్ధుల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఏపీటీఎఫ్, పీఆర్టీయూల నుంచి ఇప్పటికే శాసనమండలికి ప్రాతినిధ్యం వహించిన వారు పోటీ పడుతుంటే.. యూటీఎఫ్ నుంచి మొదటి సారి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్ధి ఆ సీనియర్లతో పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయా సంఘాలకు రాజకీయ పార్టీలు అందిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు కీలకంగా మారాయి.
ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. పొగొట్టుకున్న ఎంఎల్సీ స్థానాన్ని ఈ సారి ఎలాగైనా చేజెక్కించుకోవాలని గాదె శ్రీనివాసుల నాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సారి ఎలాగైన గెలిచి యూటీఎఫ్ బలం ఏంటో చూపించాలని మొదటిసారి పోటీ చేస్తోన్న పిడిఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఆశపడుతున్నారు. వీరికి తోడు మరో ఏడుగురు బరిలో ఉన్నారు. కాకపోతే సంఘ బలాబలాలరీత్యా పోటీ ప్రధానంగా ఆ ముగ్గురు మధ్యనే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు సంఘాలకు సభ్యత్వ రీత్యా కొంచెం అటూఇటుగా బలం సమానంగానే ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది.
2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన గాదె శ్రీనివాసులనాయుడు
గతంలో జరిగిన ఎన్నికలలో గాదె శ్రీనివాసుల నాయుడు మీద ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ విజయకేతనం ఎగురవేశారు. అప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన గాదెపై టీచర్లలో కొంత అసంతృప్తితో పాటు, ఏపీటీఎఫ్‌కి యూటిఎఫ్ మద్దతు ఇవ్వడం కూడా రఘువర్మ విజయానికి కలిసి వచ్చింది. అలా ఉత్తరాంధ్రా ఉపాధ్యాయ ఎంఎల్సీ స్థానాన్ని ఏపీటీఎఫ్ కైవశం చేసుకోగలిగింది. ఈ సారి పరిస్థితి మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏపీటీఎఫ్ తమకి సహకరించ లేదని యూటిఎప్ కోపంగా ఉంది. దాంతో ఆ రెండు సంఘాల మధ్య మిత్రబంధం ఈ ఎన్నికల్లో వైరంగా మారింది. ఈ సారి జరుగుతున్న ఎన్నికలలో యూటీఎఫ్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోరు ఖాయమైంది.
యూటీఎఫ్ పోటీతో రెట్టింపైన ఫీఆర్టీయూ ఆశలు
యూటీఎఫ్ ఎప్పుడైతే పోటీకి సిద్దమైందో పిఆర్టీయూ ఆశలు రెట్టింపు అయ్యాయి. వామపక్ష ప్రభావిత సంఘాలైన ఏపీటీఎఫ్, యూటీఎఫ్ వేర్వేరుగా బరిలో నిలవడం తమకి అనుకూలించే అంశమని పిఆర్టీయూ అంచనా వేస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల అనుభవం దృష్ట్యా అది తమకి లాభించే అంశమని బలంగా నమ్ముతోంది. ఆ నమ్మకంతోనే పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు అన్ని కోణాల నుంచి మద్దతను కూటగట్టేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాత్మకంగా రెండో ప్రాధాన్యతా ఓటను తన ఖాతాలో వేసుకునే విధంగా ఉపాధ్యాయులను ఒప్పించేందుకు యత్నిస్తున్నారు. ఈసారి రెండో ప్రాధాన్యత ఓటే గెలుపును డిసైడ్ చేయబోతుందనేది టాక్.
Also Read: ఇద్దరూ.. ఇద్దరే.. అప్పుడే కథ రివర్స్
ప్రైవేట్ విద్యా సంస్థల్లో యాజమాన్యాలకే కీలక పాత్ర
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీటీఎఫ్ , ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూటీఎఫ్, శ్రీకాకుళం జిల్లాలో ఏపీటీఎఫ్ కాస్త ముందు వరసలో ఉన్నాయి. పంచాయితీరాజ్ పరిధిలో ఉన్న పాఠశాలలే కాకుండా ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు కలుపుకుంటే ఏ సంఘం బలాబలాలు ఎక్కువ అంటే చెప్పడం కష్టమే. ప్రైవేట్ విద్యా సంస్థల దగ్గరికి వచ్చేసరికి యాజమాన్యాలకే కీలక పాత్ర. యాజమాన్యాలను ఎవరితై ప్రభావితం చేయగలుగుతారో వారికే అత్యధిక ఓట్లు పోలయ్యే అవకాశం లేకపోలేదు. అప్పుడు మాత్రం రాజకీయ పక్షాల మద్దతు అనివార్యమవుతోంది. అలా చూస్తే అధికార కూటమి ఎంతోకొంత ప్రైవేట్ రంగాన్ని ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉంది.
రఘువర్మకి టీడీపీ, జనసేనల మద్ధతు
గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ టీడీపీ అభ్యర్థి చిరంజీవులుకి మద్దతు తెలిపారు. ఆయన గెలిచారు కూడా. దాంతో ఇప్పటికే ప్రస్తుత ఎమ్మెల్సీ రఘువర్మకి టీడీపీ, జనసేనలు మద్దతు తెలిపాయి. బీజేపీతో ఇంకా చర్చలు జరుగుతున్నాయంట. పిఆర్టీయూకి వైసీపీ పరోక్షంగా సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక యూటీఎఫ్ మాత్రం సీపీఎం, సంఘ బలంతో గెలవడానికి ప్రయత్నిస్తోంది. పరోక్ష, ప్రత్యక్ష మద్దతులతో అభ్యర్థులు ఇప్పటికే ఓటు హక్కున్న ప్రతి ఉపాధ్యాయుడ్ని కలిశారు. వారి ఎజెండా ఏమిటో చెప్పారు. ఇప్పుడు పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తలుపుతెరుస్తున్నారు. విందు రాజకీయాలు నిర్వహిస్తున్నారు . చూడాలి మరి ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో ఉత్తరాంధ్ర టీచర్లు ఎవరికి పట్టం కడతారో?