Lokam Madhavi VS Aditi: ఒక సారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఎవరైనా పాఠాలు నేర్చుకుని .. ప్రజలకు మరింత చేరువవ్వడానికి పనితీరు మరింత మెరుగు పర్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు ఆ పాయింట్ ఒంటపట్టినట్లు లేదు.. మొదటి సారి ఓడిపోయినా రెండో సారి టికెట్లు దక్కించుకుని కూటమి వేవ్‌లో విజయం సాధించిన ఆ ఇద్దరు.. అటు ప్రజలకే కాదు.. కనీసం పార్టీ కేడర్‌కి కూడా అందుబాటులో లేకుండా పోయారంట.. నియోజకవర్గాల్లోనే ఉంటున్నా సొంత వ్యవహారాలు చూసుకుంటూ తమ ప్యాలెస్‌లకే పరిమితమవుతున్నారంట. కలిసి సమస్యలు చెప్పుకుందామని వచ్చే వారిని ఎమ్మెల్యేల ప్రైవేట్ సైన్యం గేటు దగ్గర నుంచే తరిమేస్తున్నారంట. ఆ క్రమంలో విజయనగరం జిల్లాలో అదితి, లోకం మాధవిల వ్యవహారతీరు హాట్‌టాపిక్‌గా మారింది.
లోకం మాధవి, అదితి గజపతిరాజు ఒకరు నెల్లిమర్ల నియోజకవర్గం నుండి గాజు గ్లాసు గుర్తు పై, మరొకరు విజయనగరం నియోజకవర్గం నుండి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకే జిల్లాలకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో అదృష్టం వెక్కిరించింది. అయితే గత ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆ మహిళా నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు . టీడీపీ నేత అదితికి గొప్ప చరిత్ర కలిగిన కుటుంబ నేపద్యముంటే, జనసేన వీరమహిళ లోకం మాధవిది కార్పొరేట్ నేపథ్యం. మొదటి సారి ఓటమిపాలయ్యాక జనానికి దూరమైన ఆ ఇద్దరు 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రజల్లోకి వచ్చినప్పటికీ ఓటర్లు విశేషంగా ఆదరించారు. గతంలో ఆయా నియోజకవర్గాలలో కనీవినీ ఎరుగని మెజారిటీతో విజయం సాధించారు
ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన అదితి, మాధవీలకు అప్పుడే ప్రజలు, కార్యకర్తలతో గ్యాప్ అప్పుడే పెరిగిపోయిందట. కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. ఇద్దరు మహిళా నేతల తీరు గెలవకముందు ఒకలా, గెలిచాక మరోలా ఉందని లబోదిబో మంటున్నారు సదరు పార్టీల కార్యకర్తలు. ఎమ్మెల్యేల కంటే వారి పక్కన ఉన్నవారే ఎమ్మెల్యేలా బిహేవ్ చేస్తున్నారని, అసలు తమ మొర కూడా చెప్పుకొనే అవకాశం లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట
పూసపాటి అశోక్ గజపతి రాజు వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచాక నిన్న మొన్నటివరకు అందరితో కలుపుగోలుగా వ్యవహరించారు. అయితే చుట్టూ చేరిన మందిమగాదుల కారణంగా క్రమ క్రమంగా కేడర్ కు దూరమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అశోక్‌గజపతిరాజు బంగళానే అంటిపెట్టుకుని ఉండే కొంతమంది నాయకులు … ఆమె చుట్టూ చేరి తమ స్వలాభం కోసం అహో ఓహో అని భజనలు చేస్తూ.. కేడర్ ను దగ్గరకు రానీయడం లేదంట. పొగడ్తలతో ముంచెత్తే పనిలో బిజీగా ఉంటూ.. పార్టీ కార్యక్రమాలకు కూడా అదితిని దూరం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు గోడు వెళ్లబోసు కుంటున్నాయి.
ఇన్నాళ్లు పార్టీ గెలుపు కోసం కష్టించి పని చేశామని, కానీ ప్రస్తుతం తమ సమస్య చెప్పుకొనే అవకాశం కూడా లేకుండా పోయిందని విజయనగరం టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అదితి దృష్టికి తీసుకువెళ్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ సదరు భజన బృందం అడ్డం పడిపోతుందంట. మేడమ్ ఖాళీగా లేరని ఇపుడు మాట్లాడడం కుదరదని చెప్పి పంపించేస్తున్నారట. ఆ క్రమంలో యువరాణి కంటే రాజుగారే బెటర్ అన్న సెటైర్లు పెరిగిపోతున్నాయి. మరి ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వస్తున్న వ్యతిరేకతపై ఎమ్మెల్యే అదితి కి ఎవరు ఎలా సమాచారం అందిస్తారో చూడాలి
మరోపక్క నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహారతీరుపై అక్కడి జనసైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గం టికెట్ ను ధన బలంతో లోకం మాధవి కైవసం చేసుకున్నారన్న విమర్శలున్నాయి. నెల్లిమర్ల టీడీపీ ఇన్చార్జ్ బంగార్రాజు టికెట్ తనదే అన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుని ఎన్నికల ముందే విజయంపై ధీమాగా కనిపించారు. అయితే చివరి నిముషంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి లోకం మాధవి విజయానికి కృషి చేశారు.
Also Read: ధూళిపాళ్లకు అవమానం.. అంబటికి టీడీపీ సపోర్ట్
ఎన్నికల పోలింగ్ వరకు టీడీపీ ఇంచార్ బంగార్రాజుతో కలిసికట్టుగా పని చేసిన లోకం మాధవి.. గెలిచిన తరువాత బంగార్రాజుతో పాటు టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోవడం మానేశారు అన్నది బహిరంగ రహస్యమే. దానిపై ఇప్పటికే రెండు పార్టీలు బాహా బాహీకి దిగిన ఉదంతాలున్నాయి. స్థానికంగా బలోపేతమవ్వడానికి లోకం మాధవి వైసీపీ వారిని చేరదీస్తూ.. జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తెలుగుతమ్ముళ్లతో కలిసి జనసైనికులు కూడా అదే వాయిస్ వినిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
మొదట్లో జనసైనికులకు పెద్ద పీట వేసిన లోకం మాధవి ఇపుడు మెల్లగా వారిని కూడా పక్కకి నెట్టేస్తున్నారట. నెల్లిమర్లకు స్థానికేతురాలైన లోకం మాధవిని పాలన వ్యవహారాల్లో ఆమె భర్త లోకం ప్రసాద్ డామినేట్ చేస్తూ .. అధికార కార్యక్రమాలు, ప్రభుత్వ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. తాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం అహర్నిశలు పని చేస్తుంటే… ఎమ్మెల్యే, ఆమె భర్త సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ రాజకీయం చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.
ఆ క్రమంలో నాన్ లోకల్ వాళ్ళని గెలిపించడం పెద్ద తప్పైందని నెల్లిమర్ల కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వారిని ఇప్పటికే దూరం పెట్టేసిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు, ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకుందామంటే కుదరడం లేదంట. ఇంటి దగ్గరకు వెళ్తే మాధవి భర్త పర్సనల్ వ్యక్తులు గేటు దగ్గరే అడ్డుకుంటూ… ఎపుడు అడిగినా మేడమ్ బిజీ అంటూ తరిమేస్తున్నారంట. జిల్లాలో ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల తీరు చూస్తూ .. మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్న కూటమి ప్రభుత్వం.. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా విడుదల చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటే మా మహిళా ఎమ్మెల్యేల పనితీరు ఎంత గొప్పగా ఉందో తేలుతుందని.. విజయనగరం, నెల్లిమర్ల ప్రజలు సూచిస్తున్నారు.. మరి జనం సలహాలపై ప్రభుత్వ పెద్దల రియక్షన్ ఎలా ఉంటుందో చూడాలి