Vallabhaneni Vamsi: గన్నవరం వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఫోర్త్ ACMM కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు A7గా ఉన్న శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్ విధించారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. తర్వాత ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. ముగ్గురిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
మరోవైపు వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉందని.. అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేసినట్లు తెలిపారు. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
గురువారం ఉదయం హైదరాబాదులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1గా వంశీ, ఏ7గా శివరామకృష్ణ ప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేర్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను అపహరించి దాడి చేశారనే అభియోగంతో వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్థన్ వాంగ్మూలం రికార్డు చేశారు.
ఇదిలా ఉంటే.. ముందు నుంచి దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన వల్లభనేని వంశీ తనతో పాటు వైసీపీ ఘోర పరాజయం పాలయ్యాక కూడా అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నారు. ఓట్ల కౌంటింగ్ రోజునే గన్నవరం నుంచి బిచాణా ఎత్తేసిన ఆయన తిరిగి గన్నవరం వస్తా.. సత్తా చాటుతా అన్నట్లు మాట్లాడుతుండటం కూటమి శ్రేణులకు మింగుడుపటడం లేదు.. వంశీ అరెస్టు తర్వాత ఆయన ఆరాచకాలు గుర్తు చేసుకుంటున్న కూటమి వర్గాలు ఇంత కాలం తమ నేతలు ఇచ్చిన అలుసు కారణంగానే ఆయన ఇష్టానుసారం వ్యహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు టీడీపీ కార్యాలయంపై వంశీ నేతృత్వంలోనే పలువురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని.. ఫర్నిచర్ ధ్వంసం చేశారని అభియోగాలు ఉన్నాయి. ఆ దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా.. ఏకంగా ఫిర్యాదుదారుడినే వంశీ బెదిరించి, కిడ్నాప్ చేయించిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లైటుగా తీసుకోవడం.. ఇక వంశీ పని అయిపోయింది. మనల్నేం చేయలేడని.. క్యాజువల్‌గా భావించడం వల్లే వంశీ తిరిగి చక్రం తిప్పాలని చూశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Also Read: వంశీకి వైద్య పరీక్షలు పూర్తి – ఏ క్షణమైనా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు
ఇంత తతంగం నడుస్తుంటే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను మాజీ మంత్రి కొడాలి నాని ఖండిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు వంశీ అరెస్ట్ ఓ ఉదాహరణ అంట. టీడీపీ ఆఫీస్‌పై దాడిపై కేసులో ఫిర్యాదును వాపసు తీసుకున్నా.. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. కోర్ట్ ఉత్తర్వులు ఉన్నా.. వంశీని అరెస్ట్ చేయడం ఏంటని తన ట్వీట్లో ప్రశ్నించారు. మరి ఫిర్యాదు వాపసు తీసుకున్నారని అంటున్న కొడాలి నానికి సత్యవర్ధన్‌ని బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేయడం.. తర్వాత అది బయట పడకుండా అతన్ని కిడ్నాప్ చేయడం తెలియదా? అని అదే సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు కౌంటర్లు ఇస్తున్నాయి. నెక్ట్స్ నువ్వే నాని.. రెడీ అవ్వమని సలహాలిస్తున్నాయి.
వంశీ ఎపిసోడ్‌కి సంబంధించి ఆయన అరెస్ట్ తర్వాత టీడీపీ ముఖ్యనేతలు మాట్లాడుతున్న మాటలు పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తున్నాయంట. వల్లభనేని వంశీ అరెస్ట్‌పై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. పార్టీ ఆఫీసుపై దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న ఆయన.. కేసు పెట్టిన వ్యక్తి దాన్ని ఉపసంహరించుకోవడంతో ఆశ్చర్యపోయారంట. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అప్పుడే అనుకున్నారంట.
ఏదైతేనేం ఎట్టకేలకు వంశీ అరెస్ట్ అయ్యారు.. ఇంకా వైసీపీలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న నాయకులు చాలా మందే ఉన్నారు. వంశీ కిడ్నాప్ పర్వం తెలిసి ఉలిక్కిపడుతున్న తెలుగు తమ్ముళ్లు.. మిగిలిన వారిపై అయినా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.