Vijay Caste: స్వేచ్ఛ బ్యూరో: ఎస్.. ఆంధ్రా కులం రొచ్చులోకి.. ఇప్పుడు తమిళనాడు విజయ్‌ని కూడా లాగేశారు. టీఎన్‌లో టీవీకే గ్రాండ్ విక్టరీ చూశాక.. అంతా విజయ్‌ని మావాడంటే.. మావాడని సొంతం చేసేసుకుంటున్నారు. మా కులపోడే.. అంటూ కలిపేసుకుంటున్నారు. విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించాక.. ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయం ఒకటే.. విజయ్ కులమేంటి? అని! విజయ్ కులంపై.. రకరకాల చర్చలు, డిబేట్లు నడుస్తున్న సమయంలో.. ఏపీలో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య పోట్లాట మొదలైంది.
దశాబ్దాల తర్వాత.. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. డీఎంకే, ఏడీఎంకే లాంటి ద్రవిడ దిగ్గజాల మధ్య తమిళ రాజకీయం నలిగిపోయింది. ఈ పరిస్థితుల్లో.. దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో సంచలనం సృష్టించారు. ఇది.. తమిళనాడులో జరిగితే, దాని ప్రకంపనలు మాత్రం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గట్టిగా వినిపిస్తున్నాయ్. పిడుగు అక్కడ పడితే.. గుండెపోటు ఇక్కడ వచ్చినట్లుగా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ నడుస్తోంది. అసలు.. విజయ్ విక్టరీ ఏపీ రాజకీయాల్లోకి ఎందుకు ఎంటరైందనేదే బిగ్ క్వశ్చన్.
విజయ్ తన ప్రచారంలో.. ఎక్కడా కులం ఊసెత్తలేదు. సెక్యులరిజం, అవినీతి రహిత పాలన, యువతకు ప్రాధాన్యం అంటూ చాలా హుందాగా రాజకీయం చేశారు. కానీ, ఆయన గెలుపు వార్త.. ఏపీ సరిహద్దులు దాటగానే రంగు మారిపోయింది. ఏపీలోని కొన్ని కులాల వారు విజయ్‌ని తమవాడిగా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. విజయ్ పూర్వీకులు ఫలానా కులానికి చెందిన వారని, ఆయన తండ్రి ఈ కులమని, తల్లి ఆ కులమని.. సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయ్. తమ కులం వాడు కాబట్టే ఇంతటి ఘన విజయం దక్కిందని ఓ వర్గం పోస్టులు పెడుతుంటే, అలా ఏమీ కాదు, విజయ్ మూలాలు మా కులంలో ఉన్నాయంటూ.. మరో వర్గం కౌంటర్లు ఇస్తోంది. తమిళనాడులో ఓ ఫిల్మ్ స్టార్ రాజకీయాల్లో సక్సెస్ అవడాన్ని.. ఏపీలోని కొన్ని గ్రూప్స్ తమ రాజకీయ ప్రత్యర్థులను తిట్టేందుకు ఆయుధంగా వాడుకుంటున్నాయ్. తమిళనాడులో విజయ్ సాధించిన విజయాన్ని.. ఏపీలో పవన్ కల్యాణ్ సాధించిన విక్టరీతో పోలుస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇక్కడ కింగ్ మేకర్ అయితే, విజయ్ అక్కడ కింగ్ అయ్యాడంటున్నారు. పవన్ అప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోతే.. విజయ్ రెండు చోట్లా గెలిచాడని గుర్తు చేస్తున్నారు. విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలోనే సీఎం అవుతుంటే.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన పదేళ్లకు డిప్యూటీ సీఎం అయ్యాడని ట్రోల్ చేస్తున్నారు.
Also Read: గద్వాల రెవెన్యూ శాఖలో జోరుగా భూ దందాలు.. రికార్డులను తారుమారు చేస్తూ..?
ఒక్క పవన్ కల్యాణ్ గురించే కాదు.. వైసీపీ, టీడీపీ పైనా ట్రోల్స్ కనిపిస్తున్నాయ్. విజయ్ టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ రాలేదని.. 11 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలంతా తమిళనాడు వెళ్లిపోతే.. ఓ పనైపోతుందని కొందరు ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ సపోర్టర్స్ కూడా సింగిల్ వర్సెస్ కూటమి అనే పాయింట్‌ని హైలైట్ చేస్తున్నారు. విజయ్ ఏ కూటమిలో లేకుండా, ఎలాంటి పొత్తులు లేకుండా.. ఒంటరిగా పోరాడి గెలిచారని గుర్తు చేస్తున్నారు. విజయ్ దమ్మున్న నాయకుడని, పొత్తుల కోసం వెంపర్లాడలేదని.. జనసేన, టీడీపీ పొత్తుని టార్గెట్ చేస్తున్నారు. విజయ్‌ని.. జగన్ లాంటి మొండి ధైర్యం ఉన్న నేతగా ఎలివేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలా.. టీడీపీ, జనసేనపై.. వైసీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌పై కూటమి మద్దతుదారులంతా.. తెగ ట్రోల్స్, సెటైర్లు వేసుకుంటున్నారు. విజయ్ తాత చిత్తూరు జిల్లాకు చెందిన దళితుడని.. తమిళనాడుకు వలస వెళ్లారని, పిళ్లై కులానికి చెందిన వారని సోషల్ మీడియాలో అనేక రూమర్లు వచ్చాయ్. కానీ, ఇందులో ఎంత వాస్తవం ఉందనేది.. ఇప్పటికీ సస్పెన్సే.
కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలు, అభిమానులే కాదు.. ప్రధాన పార్టీల ఐటీ సెల్స్ కూడా విజయ్ గెలుపుని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయ్. రాజకీయాల్లోకి కొత్త రక్తం వస్తే.. పాత పార్టీలు ఎలా కొట్టుకుపోతాయో చూశారా అని కొందరు.. అక్కడ గెలిచారు సరే.. ఇక్కడ మీ పరిస్థితేంటి? అని ఇంకొందరు సైటెర్లు వేసుకుంటున్నారు. కానీ.. తమిళనాడు ఎన్నికల్లో క్యాస్ట్ కార్డ్ పనిచేయలేదు. పైగా.. విజయ్ కూడా తన ఎన్నికల అఫిడవిట్‌లో నో క్యాస్ట్ అనే మెన్షన్ చేశారు. తమిళనాడులో కేవలం ఓటర్లు మార్పు కోరుకున్నారు. విజయ్ తన సినీ గ్లామరే.. జనాన్ని ఆకర్షించింది. టీవీకే యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. కుల సమీకరణాల కంటే.. గుడ్ గవర్నెన్స్ స్లోగన్‌కే తమిళ ప్రజలు పట్టం కట్టారు. కానీ, ఏపీలో మాత్రం ఆ గెలుపుని.. కులం కళ్లతో చూడటమే ఇప్పుడింత రచ్చకు దారితీసింది. విజయ్ గెలుపు చూసి ఏపీలో జరుగుతున్న కుల పోరాటాలు, సోషల్ మీడియా ట్రోల్స్ చూస్తుంటే.. మన రాజకీయ పరిణితి ఇంకా ఆ కులం దగ్గరే ఆగిపోయిందా? అనే అనుమానం కలుగుతోంది. పొరుగు రాష్ట్రంలో తమిళనాడు నాయకుడి గురించి.. ఇక్కడ గొడవపడటంలో అర్థమేంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజకీయాల్లో దళపతి విజయ్ పేరు మారుమోగుతోంది. తమిళనాడులో సంచలన విజయం అందుకోవడంతో.. విజయ్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన కులం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజునే.. సుమారు 80 లక్షల సార్లు ఆయన కులం గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దేశంలో.. ఓ వ్యక్తి సాధించిన విజయం కంటే, ఆ విజయం వెనుక ఉన్న సామాజికవర్గంపై ఆసక్తి చూపడం కొత్తేమీ కాదు. ఇప్పుడు.. విజయ్ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. అయితే, విజయ్ దళితుడని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదంటున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ మూలాలు సౌత్ తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో ఉంటే, తల్లి వైపు మూలాలు చెన్నైలో ఉన్నాయ్. ప్రస్తుతం.. విజయ్ కుటుంబం రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోంది. అందువల్లే.. తండ్రి చంద్రశేఖర్ పేరులో ఆంటోనీ యాడ్ అయింది. విజయ్ పూర్తి పేరు కూడా విజయ్ జోసెఫ్. అలా.. విజయ్ కుటుంబం రెండు విభిన్న సామాజిక, మతపరమైన నేపథ్యాల కలయికతో ఉంది.
Also Read: వరుసకు అక్కాతమ్ముళ్లు.. మనసు పడి పెళ్లి చేసుకున్నారు.. చిక్కబళ్లాపూర్‌లో పెను సంచలనం!
విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్.. తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు. తల్లి శోభ భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యంలో నైపుణ్యం కలిగినవారు. వీరి కుటుంబం చాలా ఏళ్లుగా చైన్నైలోనే స్థిరపడింది. కన్యాకుమారి జిల్లాతో ప్రత్యక్ష సంబంధం ఉంది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. వెల్లాలా పిళ్లై కులానికి చెందినవారు. ఈ కులం.. ఓబీసీ కేటగిరీలోకి వస్తుంది. అయితే, చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్ స్కూల్ అడ్మిషన్‌లో తమిళన్ అని కులంగా రాయడం ద్వారా కుల వ్యతిరేక దృక్పథాన్ని వ్యక్తం చేశారు. ఇక.. తల్లి శోభ హిందువు. తులు వెల్లులా ఓబీసీ కులానికి చెందినవారు. అయితే.. సోషల్ మీడియాలో విజయ్ తాత ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి కన్యాకుమారికి వలస వచ్చారని, పిల్లై కులానికి చెందినవాడని రూమర్లు వచ్చాయి. కానీ, వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. విజయ్ కూడా.. ఎన్నో సార్లు కులాలు, మతాలు ప్రకృతికి సంబంధం లేవని, అంతా సమానులని ప్రకటించారు. తన కుటుంబం కులాలకు వ్యతిరేకంగా ఉండటంతో.. విజయ్ కూడా అదే ఫాలో అవుతున్నారు. కులాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించడం, రాజకీయంగానూ అదే దిశలో ముందుకు సాగడం ఇప్పుడు చర్చకు వస్తోంది.
వెల్లాలార్ అనేది తమిళనాడు, కేరళ శ్రీలంకలోని ఉత్తర-తూర్పు ప్రాంతాలలో నివసించే ఒక పురాతన భూస్వామ్య, వ్యవసాయ కులం. వీళ్లు అత్యున్నత సామాజిక వర్గాల్లో ఒకటిగా పేరుంది. శతాబ్దాలుగా తమిళనాడులో ఆధిపత్య వర్గంగా ఉన్నారు. చోళులు, పాండ్యులు, పల్లవుల కాలంలో.. వెల్లాలార్లు ఉన్నత స్థాయి యోధులుగా, పరిపాలనా అధికారులుగా, కోటల నిర్వాహకులుగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. వెల్లాలార్ అనేది.. ఓ పెద్ద సమూహం. ఇందులో చాలా ఉపకులాలున్నాయి. కొంగు, తుళువ, చోళియ, కర్కతార్, దేవేంద్ర వెల్లలార్ లాంటివి ఉన్నాయి. ఈ కమ్యూనిటీ వాళ్లు తమ పేర్ల చివర పిళ్లై, మొదలియార్, గౌండర్ లాంటి బిరుదులు పెట్టుకుంటారు. ప్రస్తుతం.. తమిళనాడు జనాభాలో వెల్లలార్ కులానికి చెందిన వారు 33 శాతంగా ఉన్నారు. వీరు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో చురుగ్గా ఉన్నారు.
Also Read: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!
విజయ్ దళితుడనే భ్రమ కలగడానికి అతనికి ఉన్న క్రిస్టియన్ గుర్తింపు ఓ కారణమై ఉండొచ్చు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా.. గతంలో తిరుపతి హుండీలో కానుకలు వేయడమంటే.. దేవుడికి లంచం ఇవ్వడమేనని కామెంట్ చేశారు. కేవలం దేవుడికి మొక్కులు చెల్లిస్తే పరీక్షల్లో పాస్ అవలేరన్నారు. దేవుడికి ఇచ్చే కానుకలే పరీక్షల్లో పాస్ చేయిస్తే.. ఇక పరీక్షలు రాయాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై.. ఓ హిందువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో చంద్రశేఖర్ పై కేసు కూడా నమోదు చేశారు. విజయ్ క్రిస్టియన్ అనడానికి.. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండదు. అతనికి.. ఏ కులంతోనూ సంబంధం లేదని చెప్పడానికే ఇదే ఉదాహరణ. కానీ.. వాస్తవానికి విజయ్ అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిగా ఎదగాలని చూస్తున్నారు.
విజయ్‌కి క్యాస్ట్ మీద ఇంట్రస్ట్ లేదని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ ఉంది. విజయ్‌కి చిన్నతనంలో ఓ అక్క ఉండేది. దురదృష్టవశాత్తూ ఆమె మరణించాక.. చాలా కాలం పాటు విజయ్ కోలుకోలేదు. అప్పటి నుంచే విజయ్ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవాడట. కొన్నాళ్లకు.. తండ్రి చంద్రశేఖర్ నిర్మాతగా మారి విజయ్‌తో ఓ సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అవడంతో.. మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొన్ని నెలల పాటు ఇంటి నుంచే బయటకు రాలేదు. ఆ తర్వాత.. కెప్టెన్ విజయ్‌కాంత్ పక్కన సైడ్ హీరో క్యారెక్టర్‌తో మరో సినిమా చేశారు. ఆ సినిమా హిట్ అయ్యాక.. మళ్లీ మామూలు మనిషి అయ్యాడు విజయ్. ఇప్పటికీ.. విజయ్ ఇంట్రావర్ట్‌గానే కనిపిస్తారు. ఆయన.. మిత భాషి. అవసరమైనంతే మాట్లాడతారు. అనవసరంగా ఒక్క మాట కూడా మాట్లాడరని చెబుతుంటారు. అంతా సమానమే అనే భావనతోనే ఉంటారు. స్కూల్ నుంచే నో క్యాస్ట్ అనే ట్యాగ్ తగిలించుకొని ఇక్కడిదాకా వచ్చారు. అలాంటి విజయ్‌ని.. మావాడంటే.. మావాడని కొన్ని కులాల వాళ్లు తన్నుకోవడం చూస్తుంటే.. ఆశ్చర్యమేస్తోంది.