E-Paper
Advertisement

చిరంజీవి, పవన్ బాటలో విజయసాయి రెడ్డి.. ఏపీ పాలిటిక్స్‌లో పాత చరిత్ర పునరావృతమవుతుందా?

చిరంజీవి, పవన్ బాటలో విజయసాయి రెడ్డి.. ఏపీ పాలిటిక్స్‌లో పాత చరిత్ర పునరావృతమవుతుందా?
Advertisement

Vijaya Sai Reddy: ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ. మధ్యలో జనసేన, బీజేపీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు పార్టీలు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు ప్రాంతీయంగా, కుల సమీకరణాలతో పుట్టుకొచ్చిన చిన్నాచితకా పార్టీలు మరికొన్ని. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలలోకి మరో కొత్త పార్టీ వచ్చి చేరింది. అదే విజయసాయిరెడ్డి ప్రారంభించిన పరివర్తన రాజనీతి పార్టీ. పేరు కొత్తది. నినాదం కొత్తది. రాజకీయాలు కూడా కొత్తగా ఉంటాయంటున్నారు సాయిరెడ్డి. కానీ అసలు ప్రశ్న ఒక్కటే. ఏపీ రాజకీయాల్లో మరో పార్టీకి నిజంగా చోటుందా? లేక ఇప్పటికే ఉన్న రాజకీయ అసంతృప్తులకు మరో వేదిక మాత్రమే తయారైందా? చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీలు ఎన్నో ప్రయోగాలు చేశాయి. కొన్ని సంచలనాలు సృష్టించాయి. కొన్ని ఎన్నికల దగ్గరే చతికిలపడ్డాయి. మరి విజయసాయిరెడ్డి ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?

ఢిల్లీలో రాజకీయ సంబంధాలు..

Advertisement

విజయసాయిరెడ్డి.. ఒక్కసారి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే కొన్ని ప్రత్యేకమైన బలాలున్నాయి. వైసీపీలో ఒకప్పుడు కీలక నాయకుడు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు. ఢిల్లీలో రాజకీయ సంబంధాలు. పార్లమెంటరీ వ్యవహారాలపై అవగాహన. ఆర్థిక, పరిపాలనా అంశాలపై పట్టు. అంటే రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చిన అనుభవం లేని వ్యక్తి కాదు విజయసాయి రెడ్డి.

వైసీపీ ఓటర్లు ఆయన వెంట వస్తారా..?

Advertisement

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. పార్టీని నడపడానికి రాజకీయ పరిచయాలు సరిపోవు. ప్రజల్లో వ్యక్తిగత ఆదరణ ఉండాలి. కేడర్ ఉండాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసే నాయకత్వం ఉండాలి. ఇక్కడే సాయిరెడ్డికి అసలు పరీక్ష మొదలవుతుంది. వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఒక పార్టీ అండ ఉంది. జగన్ నాయకత్వం ఉంది. పార్టీ క్యాడర్ ఉంది. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకున్నాక ఆ బలం ఎంతవరకు ఆయన వెంట వస్తుందన్నదే ప్రశ్న. వైసీపీ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన వైసీపీ ఓటర్లు ఆయన వెంట వస్తారని అనుకోవడం రాజకీయ అమాయకత్వమే అవుతుంది. నిజానికి వచ్చే పరిస్థితి కూడా లేదు.

వైసీపీలో 74 సార్లు అవమానాలకు గురయ్యా..

ఇక ఆయన చెబుతున్న మరో విషయం.. వైసీపీలో 74 సార్లు అవమానాలకు గురయ్యానని. తనను తాను అవమానించుకున్న వ్యక్తిగా కాకుండా, ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ ప్రజలకు కావాల్సింది ఎవరు ఎవరిని అవమానించారన్నది కాదు. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? గత పార్టీలకు భిన్నంగా ఏం చూపిస్తారు? అనేదే.

ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం

విజయసాయి రెడ్డి మరో విషయం చెబుతున్నారు. కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తన పార్టీ ఉంటుందని. కానీ ఇది సాధ్యమేనా? ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం కుల సమీకరణాలు. టీడీపీకి ఒక సామాజిక పునాది ఉంది. వైసీపీకి మరో సామాజిక పునాది ఉంది. జనసేనకు తనదైన సామాజిక వర్గ బలం ఉంది. ఈ పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో కుల సమీకరణాలను అస్సలు ఇగ్నోర్ చేయవు. బయటికి ఎవరెన్ని మాటలు చెప్పినా ఇదే నిజం. ఇలాంటి పరిస్థితుల్లో తాను కులాలకు, వారసత్వ రాజకీయాలకు అతీతమైన పార్టీని నిర్మిస్తానంటున్నారు విజయసాయిరెడ్డి.

వారసత్వం గురించి చెబుతున్న విజయసాయి రెడ్డి..

నిజానికి మంచి ఆలోచనే. కానీ కులాలకు అతీతమైన రాజకీయాలు చేస్తానని చెప్పడం ఒకటి. కుల సమీకరణాలు బలంగా ఉన్న రాష్ట్రంలో వాటికి అతీతంగా ఓట్లు సాధించడం మరొకటి. ఇక వారసత్వం గురించి చెబుతున్న విజయసాయి రెడ్డి.. తాను వైసీపీలో ఉన్నప్పుడే పొలిటికల్‌గా స్ట్రాంగ్‌ అయ్యారు. ఆ పార్టీ పేరును ఉపయోగించుకునే రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనకు ఒక పొలిటికల్ ఐడెంటిటీని క్రియేట్ చేసిందే వైసీపీ పార్టీ అని మర్చిపోతే ఎలా అనేది కూడా ఇక్కడ మెయిన్ క్వశ్చన్.

విజయసాయి మరో ఇంట్రెస్టింగ్ కామెంట్

విజయసాయి మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. నిజమైన రాయలసీమ రెడ్లకు తన పార్టీ వేదిక అవుతుందని ఆయన చెబుతున్నారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. అసలు జగన్‌ను, చంద్రబాబును కాదని సాయిరెడ్డి దగ్గరకు ఎంతమంది రెడ్డి నాయకులు వస్తారు? రెడ్డి సామాజికవర్గంలో జగన్‌కు ఉన్న రాజకీయ పట్టు, వైసీపీకి ఉన్న క్యాడర్‌ను దాటుకుని సాయిరెడ్డి తనకంటూ కొత్త బలాన్ని నిర్మించుకోగలరా? అనేది అసలైన ప్రశ్న. రెడ్డి నాయకులు రావడం మాత్రమే కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కాపులు, ఇతర సామాజిక వర్గాలనూ కలుపుకోగలగాలి. లేకపోతే కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయం అంటూనే మరో సామాజిక వర్గ రాజకీయ వేదికగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

చిరంజీవి, పవన్ బాటలో విజయసాయి రెడ్డి..

కొత్త పార్టీ పెట్టడం చాలా సులభం. కానీ ఆ పార్టీని ఎన్నికల్లో నిలబెట్టడం అంత సులభం కాదు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి. అభిమానులు, భారీ సభలు, జనాకర్షణ.. అన్నీ ఉన్నాయి. అయినా ఎన్నికల్లో 16.32 శాతం ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకు దక్కింది ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే. ఈ రెండు ఉదాహరణలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అభిమానులుండటం వేరు. ఓటర్లుగా మారడం వేరు. ఓట్లు రావడం వేరు. వాటిని సీట్లుగా మార్చుకోవడం వేరు.

21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలూ గెలిచిన జనసేన…

అయితే జనసేన కథ అక్కడితో ముగియలేదు. 2024లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలూ గెలుచుకుంది. అంటే ఏపీ రాజకీయాల్లో ఒంటరి పోటీ కంటే కూటమి రాజకీయాలు ఎంత కీలకమో ఈ ఉదాహరణ చెబుతోంది. సాయిరెడ్డి చెబుతున్నట్టు టీడీపీ, వైసీపీలపై ప్రజల్లో అసంతృప్తి ఉండవచ్చు. కానీ అసంతృప్తి ఉందంటే అది ఆటోమేటిక్‌గా కొత్త పార్టీకి ఓటుగా మారిపోదు. అసంతృప్తి చెందిన టీడీపీ ఓటరు వైసీపీకి వెళ్లొచ్చు. వైసీపీ ఓటరు జనసేన వైపు చూడొచ్చు. మరొకరు రాజకీయాలకే దూరంగా ఉండొచ్చు. ఆ అసంతృప్తిని తనవైపు తిప్పుకోవాలంటే సాయిరెడ్డి ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం చూపించాలి.

పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ..

ముఖ్యంగా యువతకు 66 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని, 2029 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ఆయన వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. కానీ 175 స్థానాల్లో పోటీ చేయడం ప్రకటనతో అయిపోదు. 175 మంది బలమైన అభ్యర్థులు కావాలి. వారికి నియోజకవర్గాల్లో ప్రజాబలం ఉండాలి. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉండాలి. ఎన్నికల ఖర్చులు, ప్రచార వ్యవస్థ, స్థానిక నాయకత్వం ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకోవడానికి చాలా సమయం, వనరులు అవసరం.

సాయిరెడ్డి పార్టీలో చేరేది ఎవరు?

ఇప్పుడు మరో కీలకమైన ప్రశ్న. అసలు సాయిరెడ్డి పార్టీలో చేరేది ఎవరు? ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కని నాయకులా? పదవులు రాని అసంతృప్తులా? వైసీపీలో ప్రాధాన్యం కోల్పోయిన నాయకులా? లేక నిజంగా కొత్త రాజకీయాల కోసం వచ్చే యువతా? మొదటి మూడు వర్గాలతో పార్టీ నిండిపోతే అది కొత్త రాజకీయ పార్టీ కాదు. అన్ని పార్టీల్లోని అసంతృప్తులకు మరో పునరావాస కేంద్రంగా మారుతుంది. అదే జరిగితే సాయిరెడ్డి చెబుతున్న పరివర్తన లక్ష్యం మొదటి అడుగులోనే దెబ్బతింటుంది.

సాయిరెడ్డిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు..?

ఇంకా ముఖ్యంగా జగన్‌తో విభేదించి బయటకు వచ్చిన సాయిరెడ్డిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది కూడా కీలకమే. ఎందుకంటే నిన్నటివరకు వైసీపీకి ముఖ్య నేతగా ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలు, నాయకత్వం గురించి ఆయన మాట్లాడిన మాటలు.. ఆయన చేతలు ఏంటి? ఇప్పుడు వాటికి భిన్నంగా ఏం చెబుతున్నారు? అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. సో.. రాజకీయంగా వైసీపీని విమర్శించడం సులభమే. కానీ వైసీపీకి ప్రత్యామ్నాయంగా తనను తాను నిరూపించుకోవడం అంత సులభం కాదు.

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు..

అలాగని విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీకి అవకాశం లేదని ఇప్పుడే కొట్టిపారేయలేం. ఎందుకంటే ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నాయకత్వంపై అసంతృప్తి, కూటముల మార్పులు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమస్యలు.. ఇవన్నీ కొత్త రాజకీయ అవకాశాలకు దారితీయవచ్చు.

ఏ ఒక్కటి విఫలమైనా పీఆర్పీ ఇంపాక్ట్

కానీ అలా జరగాలంటే.. విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకుడిగా కాకుండా, స్వతంత్ర రాజకీయ నాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి.. రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాల నమ్మకం సాధించాలి. సభలు, ప్రకటనలు దాటి గ్రామస్థాయి నుంచి బలమైన పార్టీ నిర్మాణం చేసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి విఫలమైనా పీఆర్పీ ఇంపాక్ట్ ఉండదు.

ఆయనకు ప్రజాబలం ఎంత? కేడర్ ఎంత?

చిరంజీవి దగ్గర ప్రజాదరణ ఉంది.. కానీ అది పార్టీగా పూర్తిస్థాయిలో మారలేదు. పవన్ కల్యాణ్ దగ్గర అభిమానగణం ఉంది.. కానీ 2019లో అది సీట్లుగా మారలేదు. 2024లో మాత్రం కూటమి వ్యూహం, పార్టీ నిర్మాణం కలిసి ఫలితాన్నిచ్చాయి. మరి విజయసాయిరెడ్డి దగ్గర రాజకీయ అనుభవం ఉంది. కానీ ఆయనకు ప్రజాబలం ఎంత? కేడర్ ఎంత? ఎన్నికల విజయాన్ని సాధించే సామర్థ్యం ఎంత? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పార్టీ అవసరమా?

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పార్టీ అవసరమా? అంటే అవసరం ఉండొచ్చు. కానీ కొత్త పార్టీకి ప్రజలు ఓటు వేయాలంటే పాత పార్టీలపై విమర్శలు సరిపోవు. కొత్త నాయకత్వం, కొత్త ఆలోచనలు, కొత్త విశ్వసనీయత కనిపించాలి. విజయసాయిరెడ్డి తన పాత రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతారా? లేక జగన్‌తో విభేదించి బయటకు వచ్చిన మరో మాజీ వైసీపీ నేతగానే మిగిలిపోతారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా పరివర్తన రాజనీతి పార్టీకి అసలైన పరీక్ష పార్టీ ప్రారంభోత్సవం కాదు.. ప్రజల్లోకి వెళ్లిన తర్వాత మొదలవుతుంది.

Also Read: నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

Tags

Related News

అనుకున్నది సాధించాలి! అప్పటిదాకా అధికారంలో ఉండాలి! మూసీ పునర్జీవం ప్రారంభోత్సవానికి నన్నూ పిలవండి!

భారీ బహిరంగ సభల నిర్వహణ చేతగాక చేతులెత్తేసేలా! కేసీఆర్‌లా ప్రజెంట్ చేద్దామనుకున్నా సహకరించని నేతలు.. ! నిర్మల్‌ సభపై కేటీఆర్ అంసతృప్తి!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! ఈనెలాఖరులోగా ఇంటింటి సర్వే! వచ్చే నెల నుంచి పేదలందరికీ రూ.5లక్షల బీమా వర్తింపు!

తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్.. రూ. 670 కోట్లు ఎలా కొల్లగొట్టాడో తెలుసా?

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

Big Stories

Advertisement
×