Bhupal Naik: ఆశ మనిషిని బతికిస్తుంది.. కానీ అత్యాశ నిలువునా ముంచేస్తుంది. ఈ అత్యాశనే పెట్టుబడిగా పెట్టి 7 వేల 400 మందికి ఏకంగా 670 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు ఓ వ్యాపారి. ఇలా మోసం చేసింది బడా మనిషి అనుకుంటే.. మీరు పొరపాటు పడినట్టే. అతను ఒక తాపీమెస్త్రీగా పని చేసినవాడు. అలాంటి వ్యక్తి ఇన్ని వేల మందిని ఎలా మోసం చేశాడు..? 670 కోట్లు ఎలా ముంచాడు? అనే కదా మీ డౌట్. ఆశను పెట్టుబడిగా పెట్టి.. అత్యాశను రాబడిగా చూపించి.. జనాలను నిలువునా ఎలా ముంచాడో తెలుసుకుందాం రండి.
నెలకు లక్షకు 4 వేలు వడ్డీ!
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి.. అన్నా.. మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే నాకు ఇవ్వండి. ప్రతి నెలా 4 వేలు మీకు వడ్డీగా ఇస్తాను. మీ పెట్టుబడికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని చెబితే నమ్ముతారా? మొదట కొంచెం అనుమానం వస్తుంది. కానీ అదే వ్యక్తి మీ ఫ్రెండ్‌కి చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చి ఉంటే? మీ బంధువుకు కూడా ప్రతి నెలా వడ్డీ ఇస్తుంటే.. ఇక మీరు కూడా డబ్బులు పెట్టడానికి రెడీ అవుతారు కదా. నానావత్ భూపాల్ నాయక్ ఇదే మాట చెప్పాడు. 670 కోట్లు వసూలు చేశాడు.
తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్
ఒకప్పుడు ఆయన కూడా మనలాంటి సాధారణ జీవితమే గడిపినవాడే. చదువు పూర్తయ్యాక తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చాడు. మొదట తాపిమేస్త్రీగా పని చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్‌లో కూడా ఉద్యోగం చేశాడు. కానీ అతని లైఫ్‌లో 2013-14 టైమ్‌లో ఒక టర్న్ వచ్చింది. ఆ టైమ్‌లో అతను ఒక స్టాక్ బ్రోకింగ్ సంస్థలో ఏజెంట్‌గా చేరాడు. షేర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌లు, మనీ ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకున్నాడు. ఇక 2016లో కూకట్‌పల్లిలో బ్రోకరేజ్ ఫ్రాంచైజీ ప్రారంభించేశాడు. ఆ తర్వాత కిసాన్ పరివార్ లిమిటెడ్, షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో రెండు సంస్థలను ప్రారంభించాడు. ఇక ఇక్కడి నుంచే మొదలైంది అసలు కథ.
5 గుంటల భూమి.. 24% రాబడి!
మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటే కొంత వడ్డీ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నెలకు 4 శాతం రాబడి ఇస్తామని అనౌన్స్ చేశాడు. అంటే లక్ష రూపాయలు పెడితే నెలకు 4 వేలు. మొదట తనకు పరిచయం ఉన్న స్టాక్ మార్కెట్ క్లయింట్లను కాంటాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ ప్రచారంతో మరింత మందిని అట్రాక్ట్ చేశాడు. ఇలా ఒక్కొక్కరుగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. కిసాన్ పరివార్ సంస్థ ద్వారా భూముల్లో పెట్టుబడి పెట్టే పథకాన్ని కూడా ప్రచారం చేశాడు. ఐదు గుంటల భూమి కోసం12.5 లక్షలు పెట్టుబడి పెడితే 24 శాతం రాబడి ఇస్తామని హామీ ఇచ్చాడు. అంటే షేర్ మార్కెట్ పేరుతో ఒక స్కిమ్.. భూముల పేరుతో మరో స్కిమ్.
ఈ కథలో అసలైన ట్విస్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం..
ఇది అసలు కథ. ఈ కథలో అసలైన ట్విస్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది తెలియాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అనిల్ అనే వ్యక్తి ఈ సంస్థలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. అతనికి నెలనెలా వడ్డీ వస్తోంది. దీంతో తన ఫ్రెండ్ రాముకు కూడా ఈ స్కిమ్ గురించి చెప్పాడు. రాము కూడా లక్ష ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు రాము చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంత మనీని అనిల్‌కు లాభంగా ఇస్తాడు. ఇప్పుడు అనిల్ ఏమనుకుంటాడు.. కంపెనీ నిజంగానే లాభాల్లో ఉందనుకుంటాడు. రాము కూడా ఇలానే చేస్తాడు. ఇలా ఒకరి డబ్బును ఒకరికి పంచడమే సరిపోతుంది. మరి కంపెనీకి నిజంగా లాభాలు వస్తున్నాయా? లేదా? అనేది ఎవరూ పట్టించుకోరు. దీనినే పోంజీ స్కీమ్ అంటారు. కానీ ఒక్కసారి డబ్బులు రావడం ఆగిందా.. ఈ మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 2025 వరకు ఇలా ఒకరి డబ్బును ఇంకొకరికి పంచుతూ వెళ్లారు.
పోలీస్ స్టేషన్‌కి క్యూ కట్టిన బాధితులు..
కానీ ఆ తర్వాత డబ్బులు రావడం ఆగిపోయింది. బాధితులంతా పోలీస్ స్టేషన్‌కి క్యూ కట్టారు. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ రంగంలోకి దిగింది. ఇన్వెస్టిగేషన్‌లో బండారం మొత్తం బయటపడింది. దేశవ్యాప్తంగా 7 వేల 400 మంది ఈ రెండు సంస్థల్లో 670 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు తేలింది. ఇందులో సామాన్యులే కాదు.. రిటైర్డ్ నేవీ ఆఫీసర్లు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా బాధితులుగా ఉన్నారు. కంపెనీ అకౌంట్స్ అన్ని జల్లెడ పడితే.. జస్ట్ 35 లక్షలు మాత్రమే ఉన్నాయి. నాయక్ మొత్తం 140 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇందులో 70 ఎకరాలు KPL ఇన్వెస్టర్ల పేరుపై రిజిస్టర్ చేశాడు. మిగిలినవి తన పేరుపైనే ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కొండాపూర్‌లో ఒక విల్లా కూడా తన పేరుపై ఉంది. మొత్తం 45 ఆస్తులను పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఆ సంస్థకు సరైన అనుమతులు ఉన్నాయా?
నెలకు 4 శాతం రాబడి వస్తుందన్న ఆశతో వేలాది మంది తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు. మొదట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు వచ్చాయి. కానీ.. చివరలో పెట్టుబడి పెట్టిన వారే నిండా మునిగారు. ఏదేమైనా వికారాబాద్ నుంచి వచ్చి తాపీమెస్త్రీగా, పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ జనాలను ముంచే స్థాయికి ఎదిగాడు నాయక్. అందుకే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి.. మీ డబ్బుకు భారీ వడ్డీ ఇస్తాం.. ఎలాంటి రిస్క్ లేదు అని చెబితే వెంటనే నమ్మకండి. ఆ సంస్థకు సరైన అనుమతులు ఉన్నాయా? డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? లాభాలు ఎలా వస్తున్నాయి? అనే విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది.. కానీ ఓ తప్పుడు నిర్ణయంతో ఆ డబ్బు పోవడానికి ఒక్క క్షణం చాలు. ఇలాంటి నాయక్‌లు.. అట్రాక్ట్ చేసే సంస్థలు మన చుట్టూ చాలానే ఉంటాయి. సో తస్మాత్ జాగ్రత్త.
Also Read: పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!