రైతు గర్జన సభల పేరుతో బీఆరెస్ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. తాజాగా నిర్మల్‌లో జరిగిన సభ ఆగమాగమే అయ్యింది. నేతల మధ్య సమన్వయం లేదు. సభ ఏర్పాట్లపై ప్లానింగ్ లేదు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు గడబిడ.. తర్జన భర్జనగానే సాగింది. ప్రసంగం మధ్యలో పంటికింది రాయిలా సభలో అలికిడి, అలజడి, కేటీఆర్ దృష్టిలో పడేందుకు నేతల పోటాపోటీ ప్రయత్నాలు. వేదిక మీదే తోపులాటలు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకే ప్రయత్నాలు. అంత పెద్ద సభలను డీల్ చేయడం మా వల్ల కాదంటూ నేతలు చేతులెత్తేస్తున్న వైనం కనిపించింది.
కేసీఆర్ సభలకు ఇచ్చే ప్రయార్టీ, అప్పుడు ఉండే సీరియస్‌నెస్ ఇప్పుడు కనిపించడం లేదు. వీరిని అజమాయిషీ చేసే క్రమంలో కేటీఆర్ కూడా ఘోరంగా విఫలమయ్యాడు. నిర్మల్ సభలో ప్రసంగాన్ని వడివడిగా.. హడావుడిగా ముగించి.. స్టేజీ దిగి వెళ్లిపోయాడు కేటీఆర్. అతన్ని సన్మానించేందుకు,ఫోటోలు దిగేందుకు చాలా మంది ఉన్నారని తెలిసినా.. వారందరినీ కాదని, తను దబదబా స్టేజీ దిగి వెళ్లిపోవడంతో అంతా అవాక్కయ్యారు.
గతంలో సభల్లో మాట్లాడిన తీరుకు, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కొంత తేడా కనిపిస్తున్నది. కొంత పరిణతి సాధించినట్టుగానే ఉన్నా.. ఆ ఆదరాబాదరా ఏర్పాట్లు, కార్యకర్తల హడావుడి మధ్య కొంత ప్రసంగంతో తడబాటు కనిపిస్తోంది. పదే పదే రాసిచ్చిన స్క్రిప్టు చదవడం వల్ల తన తలను కిందకు పైకి ఆడించి చేసే ఆ ప్రసంగం సీరియస్ నెస్ ను తెచ్చిపెట్టడం లేదు. తన సోషల్ మీడియా టీమ్ రాసిస్తున్న యతిప్రసాల పంచు డైలాగులను చదివేందుకు కేటీఆర్ బాగా ఇంట్రస్టు చూపుతున్నాడు. కానీ ఆ సమయంలో కిందకు తల వాల్చి చూసుకుంటూ చదివే కేటీఆర్ చూసి .. కేసీఆర్‌ను పోల్చులేకపోతున్నారు బీఆరెస్ శ్రేణులు.
మాట్లాడేది సూటిగా, సుత్తి లేకుండా, నేరుగా జనాలను చూస్తూనే మాట్లాడే స్టైల్ కేసీఆర్‌ది. మధ్యలో వేదిక మీదనుంచి ఎవరు ఏ లీడరు చిట్టీ తెచ్చి ఇవ్వాలన్నా గజ్జుమంటారు. అలాంటిది కేటీఆర్ ప్రసంగం ఆసాంతం … నేతలు ఏదో ఒక చీటి తెచ్చి ఇచ్చుడు చికాకు తెప్పించుడు.. దీంతో ఆయన ప్రసంగం ఒక తోవ నుంచి మరో తోవకు పోయినట్టు దారి తప్పి సాగుతోంది. వేదిక మీదున్న స్క్రీన్‌పై రేవంత్ గతంలో ఇచ్చిన హామీలను చూపే ప్రయత్నంలో తన ప్రసంగం వాడిని తనే తగ్గించుకుని, జనాల్లో ఉన్న ఆ ఉత్కంఠను, ఉత్సాహాన్ని చల్లబరిచినట్టే చేస్తున్నాడు కేటీఆర్.
ఇక గడ్డం గురించి రేవంత్ వేసిన సెటైర్‌కు ఎటాక్ కౌంటర్ చేయక తప్పలేదు కేటీఆర్‌కు. మధ్యలో ఆ గడ్డం పెంచుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో గానీ, ఇలా వేదికల మీద దానిపైనా రాజకీయాలు మాట్లాడుకునే స్థితిని తెచ్చుకున్నాడు కేటీఆర్. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాపై ఎట్టకేలకు ఈ వేదికగా నోరు విప్పాడు కేటీఆర్. ఓట్ చోరీ పై అంతా గగ్గోలు పెడుతుంటే..బీజేపీ నేతలు ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు…? ఈ ఎన్నికల కమిషనర్ ఇష్యూలో మీ పార్టీకి ఎందుకంత గుబులు..? మీరింతలా భయపడి ర్యాలీలు తీస్తున్నారంటే.. దాల్‌మే కుచ్ కాలా హై అని అర్థమవుతుందని వారిని నిందించాడు కేటీఆర్.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కూడ ఘాటు విమర్శలే చేశారాయన. వీరిని అనవసరంగా గెలిపించారని, నయాపైసా లాభం కూడా వీరితో లేదన్నాడు. ఇద్దరి మధ్య సీక్రెట్ పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.