Abbaiah Chowdary Vs Chintamaneni: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. వట్లూరులోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి మధ్య రాజుకున్న వివాదం నియోజకవర్గ స్థాయి దాటి రాష్ట్రస్థాయి పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరికి వారు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, పోలీసు ఫిర్యాదులతో.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఏలూరు జిల్లా వట్లూరులో ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఫంక్షన్ హాల్ ఆవరణలో చింతమనేని వాహనానికి అడ్డుగా వైసీపీ నేత అబ్బయ్య చౌదరి డ్రైవర్ తన కారును పెట్టాడు. అడ్డు తీయమని చెప్పినా వినకపోవడంతో చింతమనేని ఆగ్రహానికి గురై అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ని దుర్భాషలాడిన వీడియో వైరల్ అయింది.
తర్వాత ఎమ్మెల్యే చింతమనేని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే కాసేపటి తర్వాత ఇరువర్గాల పార్టీల నేతలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హుటాహుటిన పోలీసులు చేరుకుని వారికి సర్ది చెప్పి పంపించేశారు. అయితే ఘటనపై ఏలూరు మూడో పట్టణ పోలీసులకు చింతమనేని డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు చేశారు. ఇనుప రాడ్లతో తనతో సహా ఎమ్మెల్యే, గన్‌మెన్‌పై దాడి చేశారని , అబ్బయ్య చౌదరి సహా దాదాపు 25 మంది దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చింతమనేని డ్రైవర్ సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు తో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తోపాటు మరికొంతమంది పై ఏలూరు త్రీ టౌన్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 38/2025 లో A1 గా అబ్బయ్య చౌదరిని చేర్చడం తోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి సహా పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ కొంతమంది తమ ఉనికి కాపాడుకోవడానికి సంచలనాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వైసీపీ నేతలు చేసిన అరాచకాన్ని ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఉద్దేశపూర్వకంగా నియోజకవర్గంలో గొడవలు సృష్టించేందుకు అబ్బయ్య చౌదరి ప్రయత్నించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదని ఘటనపై విచారణ చేపట్టి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Also Read: వంశీ బాటలో కొడాలి నాని..! త్వరలో అరెస్టేనా?
అదలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా దెందులూరు నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండి పడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేక టీడీపీ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం మాని వైసీపీ నేతలపై దాడులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైరయ్యారు. ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో తిరగాలా మిగిలిన వారికి తిరిగే స్వాతంత్య్రం లేదా అని ధ్వజమెత్తున్నారు.
ఈ ఘటన విషయం తెలియడంతో టీడీపీ శ్రేణులు భారీగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వచ్చాయి. అటు వైసీపీ వర్గీయులు పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని అబ్బయ్యచౌదరి ఇంటికి భారీగా చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు చింతమనేనిపై మూకుమ్మడిగా దాడి చేయడానికి వస్తున్నాయని పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు.చింతమనేని – అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయ పోరు నువ్వా నేనా అన్నట్లుగా మారటంతో దెందులూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.