BigTV English

Modi – Trump: అగ్ర నాయకుల మధ్య ఒప్పందాలు.. టారీఫ్‌ల టార్చర్ తగ్గిస్తుందా?

Modi – Trump: అగ్ర నాయకుల మధ్య ఒప్పందాలు.. టారీఫ్‌ల టార్చర్ తగ్గిస్తుందా?

Modi – Trump: ఇద్దరూ అగ్రనేతలు.. చానా ఏళ్ల గ్యాప్ తర్వాత కలిశారు. వైట్ హౌస్‌లో వన్ డిగ్రీ సెల్సియస్ చలిలో కనిపించగానే వెచ్చని కౌగిలింత.. మిత్రులిద్దరూ హత్తుకొని, తమ స్నేహ బంధాన్ని బహిరంగంగా మరోసారి ప్రకటించారు. అమెరికాకు రెండో సారి ప్రెసిడెంట్ అయిన ట్రంప్‌.. భారత్‌కు మూడోసారి ప్రధాని అయిన మోడీ.. మొదటిసారి కలుసుకోవడం విశేషమే కాదు.. విదేశాంగ చరిత్ర పుస్తకంలో ఒక పుటగా గుర్తుంటుంది. అంత వరకూ ఓకే గానీ.. అసలు విషయం ఏమయ్యిందీ..? వచ్చే రాగానే ట్రంప్ దూకుడికి భారత్ కూడా గజగజలాడింది. మరి మోడీ ఏదైనా మంత్రం వేశారా..? ట్రంప్ టారీఫ్‌ల టార్చర్ కాస్తైనా తగ్గించారా..? అసలు, అగ్ర నాయకులు మధ్య ఏం ఒప్పందాలు జరిగాయి..? టాక్స్ ఏంటీ.. టారీఫ్‌లేంటీ..?


ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై ఇప్పుడున్న ఆసక్తి గతంలో ఎప్పుడూ లేదనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గద్దెనెక్కితే…. భారత ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టారు. ఈ శుభ తరుణంలో ఇద్దరూ మొదటిసారి కలసిశారు. అందులోనూ, ఇద్దరు నాయకులు మంచి స్నేహితులమని చెప్పుకుంటారు గనుక దానికి తగ్గట్లే ఆహ్వానాలు అందాయి. ఈ ప్రియమైన స్నేహితుల మధ్య అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం అత్యుత్తమంగా ఉంటుందని భావించారు. అనుకున్నట్లే..ఇది నిరాశపరచలేదు. ప్రధాని మోడీ వైట్ హౌస్‌లోకి ప్రవేశించగానే హృదయపూర్వక కౌగిలింతల తర్వాత దృఢమైన కరచాలనం కూడా జరిగింది.


‘నమస్తే ట్రంప్!’, ‘హౌడీ, మోడీ!’ ర్యాలీల ఫోటో ఆల్బమ్

ఇక, అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పరస్పర సుంకాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మోడీ మొహంలో చలి తీవ్రత స్పష్టంగా కనిపించింది. విశ్లేషకులు మాటలో చెప్పాలంటే.. ప్రధాని మోడీ అమెరికాలో అడుగుపెట్టిన క్షణం నుండి.. ప్రతిదీ అస్థిరంగానే అనిపించింది. ప్రధాని మోడీ బస చేసిన బ్లెయిర్ హౌస్‌లో.. విదేశీ నాయకుడి కోసం గౌరవార్థంగా అమెరికా జెండా ప్లేస్‌లో త్రివర్ణ పతాకం ఎగరేశారు. టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ నుండి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్జ్ వరకు ట్రంప్ పరిపాలనలోని అగ్ర అధికారులతో అనేక కీలక సమావేశాలు ప్లాన్ చేశారు.

ప్రెసిడెంట్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA)’

అయితే, ట్రంప్ వాగ్దానం చేసిన సుంకాలకు సంబంధించిన సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం స్పష్టంగా కనిపించింది. ప్రెసిడెంట్ ట్రంప్.. ప్రధాని మోడీని ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. “మేము మిమ్మల్ని మిస్ అయ్యాము, మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము.. మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడటం చాలా బాగుంది” అంటూ ప్రెసిడెంట్ ట్రంప్… ప్రధాని మోడీని మురిపించారు. అలాగే.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా ఆర్థిక వ్యవస్థను దారిలోపెట్టబోతున్న ఎలన్ మస్క్.. ఇతర ఉన్నతాధికారుల పరిచయాలు పూర్తి చేసుకున్నారు.

దానికి తగ్గకుండా, మేమూ వసూలు చేస్తాం” -ట్రంప్

ఇద్దరు అధినేతలు తమ ద్వైపాక్షిక మీటింగ్ కోసం కూర్చునే క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్.. ప్రధాని మోడీ కోసం ఒక కుర్చీని కూడా లాగారు. నిజానికి, ట్రంప్, మోడీకి ఇచ్చిన బహుమతిలో కూడా పర్సనల్ టచ్ ఉంది. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో ఇద్దరి నేతలకు సంబంధించిన ప్రతిష్టాత్మక ర్యాలీలు అహ్మదాబాద్-‘నమస్తే ట్రంప్!’, హూస్టన్‌-‘హౌడీ, మోడీ!’ కార్యక్రమాల్లో తీసిన ఫొటోలతో తయారుచేసిన ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోడీకి బహుమతిగా ఇచ్చారు.

దిగుమతి సుంకాలు, మినీ వాణిజ్య ఒప్పందం…

ఇక, ఇద్దరి మధ్య పరస్పర అభిమానం ఉమ్మడి ప్రెస్ మీటింగ్‌‌లో కూడా స్పష్టంగా కనిపించింది. ఈ చారిత్రక ఘట్టానికి తనదైన మలుపు ఇవ్వడానికి ప్రధాని మోడీ.. ట్రంప్ “MAGA” నినాదాన్ని తెలివిగా వాడారు. “ప్రెసిడెంట్ ట్రంప్, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్-MAGA’ అంటారు… అలాగే, ఇండియాలో కూడా వికసిత్ భారత్ కోసం మేము కృషి చేస్తున్నామని చెప్పిన మోడీ.. దీనిని MIGA.. అంటే, ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్’ అంటూ ట్రాన్స్‌లేట్ చేశారు. ఇక, అమెరికా, భారత్ కలిసి పనిచేస్తే.. MAGA ప్లస్ MIGA కలిసి ‘MEGA’ భాగస్వామ్యంగా మారుతుందంటూ ప్రధాని మోడీ తనదైన స్పెషల్ టచ్ ఇచ్చారు. అయితే, ఒకరినొకరు ప్రశంసించుకోవడం వెనుక అసలు వ్యవహారాలైన వాణిజ్యం, సుంకాలకు సంబంధించిన కఠినమైన వాస్తవాలు దాగుడుమూతలు ఆడాయి.

మోడీ చర్చల్లో నాకన్నా కఠినంగా వ్యవహరిస్తారన్న ట్రంప్

తన స్నేహితుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశానికి కొన్ని గంటల ముందు.. పరస్పర సుంకాలను విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ కూడా మోడీకి చురకలు పెట్టారు. విలేకరులతో మాట్లాడుతూ… సుంకాల విషయానికి వస్తే భారత్ “అగ్రస్థానంలో” ఉందని అన్నారు. సంయుక్త ప్రెస్ మీటింగ్‌లో కూడా ట్రంప్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని మోడీ పక్కనే నిలబడి… ట్రంప్ తనదైన శైలిలో సంచలన ప్రకటన చేశారు. “ఇండియా మా దగ్గర ఎలా వసూలు చేస్తుందో.. దానికి ఏ మాత్రం తగ్గకుండా, మేము వసూలు చేస్తామంటూ” మరోసారి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, “ఇకపై భారత్ ఏమి వసూలు చేస్తారనేది మాకు పట్టింపే లేదంటూ” పొగ పెట్టి వదిలారు.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో వస్త్రాలు, ఔషధ ఉత్పత్తులు..

ఇద్దరి నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్… దిగుమతి సుంకాలు, మినీ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడులు, రక్షణ కొనుగోలు, ఇంధన సరఫరాలు, అణు సహకారం, వర్క్ వీసాలు, వలసలు వంటి చాలా అంశాలపై చర్చించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి ముందే యూఎస్ వాణిజ్య భాగస్వాములపై ​​ట్రంప్ “పరస్పర సుంకాల” ప్రకటన చేసేశారు. చైనా, భారత్‌తో సహా పలు దేశాలపై ట్రంప్.. అధిక దిగుమతి సుంకాలను విధిస్తున్న జీఓపై సంతకం చేశారు. న్యాయమైన వాణిజ్యం జరిగితే తప్ప ఇది ఇలాగే కొనసాగుతుందని వెల్లడించారు. ఇక, ట్రంప్-మోడీ చర్చల్లో.. అమెరికా నుండి రక్షణ కొనుగోళ్లు పెరగడం ప్రముఖంగా కనిపించే అంశం.

$500 బిలియన్లు చేరుకోడానికి కృషి చేస్తామన్న మోడీ

అలాగే, అమెరికా నుండి మరిన్ని చమురు, గ్యాస్ కొనుగోలు చేయడానికి కూడా భారత్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల భారత్ కేంద్ర బడ్జెట్ ప్రకటనలో.. ఏకపక్షంగా భారత్ అమలు చేసిన దానికంటే ఎక్కువగా ట్రంప్ మరిన్ని సుంకాల కోతలు కావాలంటే… రెండు దేశాల మధ్య ఒక చిన్న వాణిజ్య ఒప్పందం, లేదంటే, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధించాలని మోడీ అనుకున్నారు. అయితే, దీనిపైన ఇంత వరకూ పూర్తి స్పష్టత అయితే రాలేదు. అయితే, మీడియా సమావేశంలో ట్రంప్ ఒక్క మాట స్పష్టం చేశారు. “మోడీ నాకన్నా మంచి సంధాన కర్త” అని అన్నారు. “మోడీ చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారనీ.. ఆయన నాకన్నా మంచి నేగోషియేటర్.. ఆయనతో పోటీ కూడా పడలేమని” అన్నారు.

రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికత..

అయితే, మొదటిరోజే.. స్నేహ పారవశ్యంతో పాటు పగల పొగలు కూడా భగ్గున మండాయి. ఇప్పుడు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో… వస్త్రాలు, ఔషధ ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతుల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం మెండుగా కనిపిస్తుంది. భారతదేశం…అమెరికాకు అతిపెద్ద ఎక్స్‌పోర్ట్ డెస్టినేషన్ కాగా… ఇకపై భారత్‌ను భయపెట్టడం అత్యవసరం అనుకున్నట్లే ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. అసలే, భారతదేశంతో అమెరికా వాణిజ్య లోటు దాదాపు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. అందుకే, ప్రధాన మోడీతో దీర్ఘకాలంగా ఉన్న అసమానతలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతామని కూడా ట్రంప్ తన మీడియా బ్రీఫింగ్‌లో ఒప్పుకున్నారు. అయితే ప్రధాని మోడీ.. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందే ఒక కీలకమైన విషయాన్ని నొక్కి మరీ చెప్పారు.

భారతదేశానికి F-35 స్టెల్త్ ఫైటర్లను అందించే కీలక ఒప్పందం

భార్-యుఎస్ స్నేహానికి ఈ పర్యటన భారీ ఊపు తెస్తుందని అన్నారు. అన్నట్లే… 2030 నాటికి భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేసి 500 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి కృషి చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. ఇక, ట్రంప్ తన పాలనలో ఇండియా కోసం “అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు” చేసుకోబోతున్నట్లు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే… ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఒక సంయుక్త ప్రకటనలో… త్వరలో ఇరు దేశాల వాణిజ్యంలో ఉన్న అసమానతలపై చర్చలు ప్రారంభిస్తామనీ… రెండు దేశాల మధ్య మెరుగైన ఆర్థిక సహకారాన్ని పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

5th జనరేషన్ F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కు సరఫరా

ప్రధాని మోడీ, ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య కొన్ని సంవత్సరాల విరామం తర్వాత ఈ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సంభాషణలో, రెండు దేశాల మధ్య వాణిజ్యం నుంచి టెక్నాలజీ వరకు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. రక్షణ రంగం సహా ప్రతి విభాగంలో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం, సాంకేతికతకు సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు లీడర్లూ చర్చించారు. ఈ చర్చలో, ప్రతి రంగంలో భారత్-అమెరికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రెండు దేశాలు ఇంధనంపై ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ప్రకటించారు.

ఒక్కో విమానం గంట నడపడానికి $36 వేల డాలర్ల ఖర్చు

దీని ద్వారా, భారత్‌కు అమెరికా చమురు, సహజ వాయువు అగ్ర సరఫరాదారుగా మారుతుందని అన్నారు. అలాగే, అమెరికా అణు పరిశ్రమకు సంబంధించి, భారత మార్కెట్లో అత్యున్నత స్థాయిలో అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువవుతున్నట్లు తెలుస్తుంది. దీన్ని మరింత సులభతరం చేయడానికి భారతదేశం తన చట్టాలను కూడా మారుస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక, భారతదేశానికి సైనిక అమ్మకాలను కూడా అమెరికా భారీగా పెంచుకుంది. ఇందులో భాగంగా… భారతదేశానికి F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి ఒప్పందం చేసుకున్నారు.

5th జనరేషన్ F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కు సరఫరా

ఈ సంవత్సరం నుండి భారతదేశానికి సైనిక అమ్మకాలను “అనేక బిలియన్ డాలర్లు” పెంచుతామని వెల్లడించిన ప్రెసిడెంట్ ట్రంప్… త్వరలో 5th జనరేషన్ F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను భారత్‌కు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. లాక్‌హీడ్ మార్టిన్ నిర్మించిన F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అమెరికాలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన సైనిక ప్రాజెక్టులలో ఒకటిగా ఉంది. దీని మొత్తం ఖర్చు $1.7 ట్రిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, F-35ని నడపడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కో విమానానికి గంటకు దాదాపు $36 వేల డాలర్ల ఖర్చవుతుంది. అలాంటి ఫైటర్ జెట్‌ల కోసం భారత్‌ గతంలోనే ప్రయత్నించింది. అయితే, మధ్యలో ఫ్రాన్స్ రావడంతో ఆ అవకాశం చేజారింది. అయితే, ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన హామీతో భారత్ అమ్ముల పొదిలో శక్తివంతమైన ఆయుధం చేరుతుంది.

ఇండో పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచే చర్యలు

ఇక, ఇండో పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంచడానికి భారత్‌-అమెరికా కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యలో భాగంగా… చైనాను ఎదుర్కోవడానికి క్వాడ్‌ దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు భావించాలి. క్వాడ్‌ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు సభ్యులు. అయితే, రాబోయే క్వాడ్ సమ్మిట్‌ను భారత్‌లోనే నిర్వహించనుండగా దానికి ప్రెసిడెంట్ ట్రంప్‌ను ఈ సందర్భంగా ఆహ్వానించారు మోడీ. ఈ ఒప్పందం వల్ల అన్ని విధాలా చైనాను నియంత్రించడానికి భారత్‌కు కొంత అవకాశం కూడా దొరకుతుంది. ఇందులో భాగంగా… ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో అమెరికా సహాయం చేస్తుందని హామీ లభించింది. ఈ కారిడార్‌ ద్వారా భారతదేశం నుంచి ఇజ్రాయెల్, ఇటలీ, అమెరికాకు వాణిజ్య మార్గాలను నిర్మించనున్నారు.

ఒప్పందాల్లో కీలక ఖనిజాలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌…

ఇక, ట్రంప్-మోడీల మధ్య జరిగిన ఒప్పందాల్లో కీలక ఖనిజాలు, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, ఔషధాల కోసం బలమైన సరఫరా గొలుసు సృష్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… ఉమ్మడి తయారీ, ఉమ్మడి అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే, లాస్ ఏంజిల్స్, బోస్టస్‌లో భారత కాన్సులేట్లు కూడా ప్రారంభించడానికి ఈ సందర్భంగా సంతకాలు చేసుకున్నారు. మరోవైపు, భారతదేశంలో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను తెరవడానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఇక, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలూ కలిసి పని చేయాలని నిర్ణయించారు.

26/11 దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వూర్ రానో అప్పగింత

ఈ క్రమంలో, 26/11 దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వూర్ రానోను త్వరలో అమెరికా నుంచి భారత్‌కు పంపడానికి ట్రంప్ ఒప్పుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భారత్- అమెరిక మునుపెన్నడూ లేని విధంగా కలిసి పని చేస్తాయని కూడా ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్‌ సింగ్‌ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్‌ పరోక్షంగా హెచ్చరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఉగ్రవాదంతో జరిగే పోరాటంలో భారత్- అమెరికా కలిసి ఉంటాయనీ… సరిహద్దుకు అవతలి వైపున ఉద్భవించే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దృఢమైన చర్య తీసుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు.

ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించే చర్చ

ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రెసిడెంట్ ట్రంప్‌తో పాటు పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా, ట్రంప్‌ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్‌ఎక్స్‌ సీఈవో, అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ అధినేత ఎలాన్‌ మస్క్‌‌తో మోడీ భేటీ అయ్యారు. ఎలన్ మస్క్‌కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లోకి ప్రవేశించే అంశాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది. స్టార్‌లింక్ చాలా కాలం క్రితమే భారతదేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవ కోసం దరఖాస్తు చేసుకుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలపై చర్చ

అయితే, మోడీ ప్రభుత్వం నుండి ఇంకా ఆమోదం పొందలేదు. కాబట్టి, ఈ దిశగా ఇరువురి మీటింగ్‌లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారా లేదా అన్నది తేలాలి. ఇక ఇద్దరి మధ్య అంతరిక్షం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలతో సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు మోడీ ఎక్స్‌లో తెలియజేశారు. అలాగే, స్థిరమైన అభివృద్ధి మొదలైన విషయాల్లో భారత్‌ యూఎస్‌కు చెందిన సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. ‘మినిమమ్ గవర్నమెంట్-మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలను మస్క్‌కి వివరించినట్లు తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్షం..

మరోవైపు, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ వాల్జ్‌ కూడా నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత్‌-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకం కాబట్టి, వాటిపై వాల్జ్‌తో చర్చలు ఫలప్రదంగా సాగినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకోడానికి చర్చలు జరిగాయి. అలాగే, ట్రంప్ టీమ్‌లోకి కొత్తగా వచ్చిన నేషనల్ నిఘా వ్యవస్థ డైరెక్టర్, భారత సంతతికి చెందిన తులసీ గబ్బర్డ్‌ను కూడా ప్రధాని మోడీ కలిసారు. ఆమెతో నిఘా వ్యవస్థలో భాగస్వామ్యంపై చర్చించారు. అలాగే, యాంటీ-టెర్రరిజంలో ఇరు దేశాల సహకారం గురించి మాట్లాడారు.

వలసదారుల అంశంపైనా ఇరు దేశాధినేతలు కీలక చర్చ

ఇక, ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధాని మోడీ సమావేశంలో… వలసదారుల అంశంపైనా ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా… చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తెలిపారు. అలాగే, ‘యువత, పేదరికంలో ఉన్నవారిని మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారనీ.. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది మోసం చేస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని మానవ అక్రమరవాణా కింద భావించి, దాన్ని అరికట్టడానికి భారత్-అమెరికాలు సంయుక్తంగా పనిచేస్తాయని అన్నారు.

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×