తెలంగాణ బీజేపీలో పదవులు పంపకం.. ముందు చూస్తూ నుయ్యి…వెనుక చూస్తే గొయ్యిలా మారిందట. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన వారు కొందరైతే…. కొత్తగా పార్టీలోకి చేరి.. అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నవారు మరికొందరు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు కాషాయపార్టీ నేతల్లో మరింత అసమ్మతి రేపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆశించిన వారికి జిల్లాలో కీలకపదవులు రాలేదని సదరు నేతలతో పాటు… క్యాడర్ కూడా నిరాశకు గురైన సందర్భాలున్నాయని టాక్ నడుస్తోంది.
హన్మకొండ జిల్లాలోని బీజేపీలో.. బీసీ నేతల ప్రాబల్యం ఎక్కువనే చెప్పాలి. దశాబ్దాల కాలంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసి.. తమకు గుర్తింపు వస్తుందని.. చాలా మందీ ఎదురుచూస్తున్నారట. జిల్లా అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచారట. అయితే..ఆశించిన విధంగా అధ్యక్ష పదవి దక్కకపోవటంతో.. వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తాము ఎంత కష్టపడినా.. కోటరీ రాజకీయమే పనిచేస్తుందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా బీసీలకు సరైన గుర్తింపులేదని కొందరు కాషాయపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా సంతోష్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం ప్రకటన చేయడంతో అసమ్మతి నేతలంతా ఒకటవుతున్నారనే టాక్ నడుస్తోంది.
జిల్లాలో బీజేపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకూ… ఒక్క బీసీనేతకూ అవకాశం కల్పించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా తమ వర్గానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని లాబీయింగ్ కూడా చేశారట. అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు బీసీ నేతల పేర్లు పరిశీలించినా.. చివరకు మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అనుచరుడైన సంతోష్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో మిగతా నేతలంతా గుర్రుగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవి… బీసీలకు ఎందుకు ఇవ్వరని కొందరు నేతలు బహిరంగంగానే ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇలా చేయటం పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశాలూ లేకపోలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
కాషాయపార్టీలో సామాజిక న్యాయం చెప్పుకోవడానికే సరిపోతుందని… కష్టపడ్డ వాళ్లకు తగిన గుర్తింపు లేదని మదన పడుతున్నారు బీసీ నాయకులు. అధిష్టానం తమకు గౌరవం ఇవ్వనప్పుడు… తాము పార్టీలో ఉండడం ఎందుకంటూ.. వారంతా ఏకతాటిపైకి వస్తున్నట్లు సమాచారం. ఇదే అజెండాతో వరంగల్‌లోని ఓ హోటల్‌లో బీసీ నేతలంతా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని..మూకుమ్మడిగా పార్టీ మారేందుకు వ్యూహరచన చేశారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధిష్టానం సదరు నేతలకు ఫోన్ చేసి… రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారట. అధ్యక్ష పదవి హామీ నిలబెట్టుకోలేని అధిష్టానం మాటలు నమ్మలేమని… తమ దారి తాము చూసుకోక తప్పదని కొందరు తెగేసి చెప్పినట్లు టాక్ నడుస్తోంది.
Also Read: కేటీఆర్ కొత్త ప్లాన్.. అలాగైతే మేం రెడీ, మీ శకం ముగిసిందన్న అధికార పార్టీ
రాష్ట్రమంతా బీసీ నినాదం రాజకీయాలను కుదిపేస్తున్న వేళ… కనీసం తమకు గుర్తింపు ఇవ్వట్లేదని….రాజకీయంగా ఎదగకుండా బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని అధిష్టానంపై శ్రేణులు మండిపడుతున్నారట. తమ దారి తాము చూసుకోక తప్పదని… అధిష్టానానికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాషాయ పార్టీలోని బీసీ నేతలు అంతా ఎటువైపు వెళ్తారోననే చర్చ జోరుగా సాగుతోందట. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో… అధికార పార్టీలోకి వెళ్తేనే బాగుంటుందని కొంతమంది సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. మరి… హన్మకొండ బీజేపీలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.