Ktr on Congress: ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్రెండ్ తగ్గట్టుగా కొత్త నినాదం ఎత్తుకోకుంటే రాజకీయాల్లో ఉనికి ఉండదని వేగంగా గ్రహించారాయన. ఏదో విధంగా వార్తల్లో ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో బీసీల వ్యవహారంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అదే పల్లవిని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.
కేటీఆర్ ఏ పల్లవి ఎత్తుకున్నా ఏదో విధంగా బూమరాంగ్ అవుతోంది. ఆయన మాటలను అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ఏదో విధంగా చీల్చి చెండాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకుంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగా బీసీ కులగణన సర్వే చేపట్టింది. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టింది. తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
ఇక రిజర్వేషన్లపై తేల్చాల్సింది కేంద్రం మాత్రమే. అయినా బీసీల రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఎత్తుకున్న బీసీ నినాదం ఇంప్లిమెంట్ అయితే తమ పార్టీకి ఊహించని డ్యామేజ్ జరుగుతుందని భావించారు. ఈ క్రమంలో కొత్త పల్లవి ఎత్తుకుంది ఆ పార్టీ.
కులగణనపై రీసర్వే చేస్తే తాము సిద్ధమేనన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలా చేస్తే తాను, కేసీఆర్ సైతం వివరాలు ఇస్తామని చెప్పకనే చెప్పారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలంటూ లింకు పెట్టారు. కేటీఆర్ మాటలను గమనించిన అధికార పార్టీ నేతలు, కౌంటరివ్వడం మొదలుపెట్టారు.
ALSO READ: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం, తగలబడిన షాపులు, నష్టం భారీగా
ఎన్నికల సమయంలో అఫిడవిట్లు ఇచ్చారని, మీరు ఆ తరహా వివరాలు ఇస్తారని, కొత్తగా ఇచ్చేదేముందని అంటున్నవాళ్లు లేకపోలేదు. తండ్రి-కొడుకుల కోసం కొత్తగా కులగణన చేపట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు. తమ ప్రభుత్వంలో కులగణన చేసి నివేదికను అసెంబ్లీ వేదికగా బయటపెట్టి చర్చించామని అంటున్నారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము సీక్రెట్‌గా ఉంచలేదన్నారు.
ఏదో విధంగా బీసీలను ఆకట్టుకునేందుకు రకరకాల మాటలు వద్దని, నిజాలు మాట్లాడాలన్నారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తాము ప్రజల కోసం చేస్తున్న పనులు అన్నీ ఇన్నీకావన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు కారు పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని దుయ్యబడుతున్నారు. ఓ అడుగు ముందుకేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని మనసులోని మాట బయపెట్టారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి తప్పకుండా వస్తామని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసినా అధికార పార్టీ-బీఆర్ఎస్ మధ్య నిత్యం మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పవచ్చు.