Life Style: నాటికి నేటికి ఉన్న తేడా చెప్పడంలో ఎవరికి వారు పోటాపోటీగా చెప్పేస్తారు. నాటి రోజుల కంటే.. నేటి రోజుల్లో జరిగే ఘటనల తీరే వేరు. ఏ దినపత్రిక చూసినా, ఏ టీవీ చూసినా.. జరిగే దారుణ ఘటనలు కోకొల్లలు. అత్యాచారయత్నాలు.. అత్యాచారాలు.. హత్యలు.. దాడులు.. ఘర్షణలు.. భార్యపై భర్త దాడి.. భర్త పై భార్య దాడి.. తండ్రిపై తనయుడు దాడి.. తండ్రిని హత్య చేసిన తనయుడు.. కుమారుడిని పొట్టనబెట్టుకున్న కన్న తండ్రి.. కోత మిషన్ తో మృతదేహం కోసి.. సాక్ష్యాలు మాయం.. మద్యం డబ్బుల కోసం తండ్రి హత్య, బ్రతికుండగానే తండ్రి కాటికి, ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో ఎన్నెన్నో ఘటనలు. నాటి రోజుల్లో లేని ఈ దారుణాలు ఇప్పుడేల? అసలు నేటికీ నాటికి ఏదో ఒకటి తగ్గింది, ఒకటి పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎన్నో ఘోరాలు చూడక మానరు అంటున్నారు మేధావులు. ఔను రానున్నది గడ్డు కాలమేనట.. ఇంతకు తగ్గిందేమిటి? పెరిగిందేమిటి తెలుసుకుందాం.
కాలం మారింది. మనం ఆధునిక కాలంలో ఉన్నాం. ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో బిజీబిజీ బ్రతుకులు అయ్యాయి. పల్లెలు ఖాళీ.. పట్టణాలు ఫుల్. మారిన కాలానుగుణంగా మనిషి మేథస్సు కంటే.. యంత్రాలకే ప్రాధాన్యత పెరిగింది. యంత్రాలకు పోటీనిచ్చే స్థాయిలో మనిషి ఆలోచిస్తూ.. ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. మానసిక ఆందోళన అనేది ప్రస్తుతం మనల్ని పట్టి పీడిస్తున్న అసలుసిసలైన వ్యాధి. కానీ ఇవన్నీ ఇప్పుడెందుకు మన జీవితంలో ఒక భాగమయ్యాయి అంటే అందుకు సవాలక్ష కారణాలు.
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటుంటారు. గతంలో ఒక్కొక్క ఇంటిలో పదుల సంఖ్యలో సంతానం ఉండేది. అందుకే అప్పట్లో ఈ నానుడి వచ్చింది. ఇప్పుడు ఒకరు లేక ఇద్దరే. అదే నానుడిని ఆదర్శంగా తీసుకున్న కొందరు.. ఉమ్మడి కుటుంబాలకు సెలవు చెప్పేశారు. మన లైఫ్ లో తగ్గిందని చెప్పుకుంటున్నామే అదే ఉమ్మడి అనే పదం. నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటే.. కుటుంబ పెద్ద అంతా తానై వ్యవహరించేవారు. కుటుంబంలో 20 మంది ఉన్నా.. ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ చేయి చేయి కలిపి, మాటామాటా కలిపి పరిష్కరించుకొనే వారు. ఎంత పెద్ద సమస్య అయినా కూడ ఒత్తిడి ఎరగని జీవితాలు అవి. అంతెందుకు ఒక ఊరికి ఆపద వస్తే ఊరే ఉమ్మడి కుటుంబాన్ని తలపించేలా ఎదురొడ్డి నిలిచి పోరాడే రోజులు అవి. ఇంటిలోని పిల్లలకు ప్రేమా ఆప్యాయతల విలువలు అప్పుడు తెలిసేవి. ఇప్పుడు అందుకు అంతా భిన్నం. ఎన్నో లక్షల కుటుంబాల్లో ఎక్కడో ఒకచోట నేటికీ అక్కడక్కడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అలా తప్పించి ఉమ్మడి కుటుంబం అనే పదానికి మంగళం పలికేశారు చాలా వరకు.
నేడు జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే, కుటుంబ పెద్ద ఉండరు ఆ కుటుంబాల్లో.. ప్రేమ రుచి ఒక్కటే చూపిస్తున్నాం పిల్లలకు. కష్టం , మానవత్వం, బంధాల విలువలు వారికి అసలు తెలియని పరిస్థితి. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు గమనిస్తే.. ఎక్కడ కూడ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో జీవితాన్ని సాగిస్తున్న వారే. ఒక మనిషిని చంపి కుక్కర్ లో ఉడికించేంత సాహసం మరో వ్యక్తి చేసినట్లు ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. అంటే మనిషి ఆలోచనలు రోజురోజుకు ఏ స్థాయికి వెళుతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో చిన్న దెబ్బ తగిలితే..ఊరు ఊరంతా.. అరెరె ఏమైందనే పలకరింపులు.. నేడు ఆ మాటలు శూన్యం. కళ్లెదుట జరిగే దారుణాలను కూడ ఆపేందుకు వెళితే ప్రమాదం ముంచుకొచ్చే రోజుల్లో ఉన్నాం. గ్రామాల్లో ఇంకా అక్కడక్కడ ఇటువంటి ఆప్యాయతలు ఉన్నా.. పట్టణాల్లో మాత్రం ఆ పరిస్థితులు చెప్పనవసరం లేదు.
Also Read: Lakshmi On Kiran: కిరణ్ రాయల్ ఎపిసోడ్ మరో మలుపు.. లక్ష్మీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తల్లిదండ్రులు అంటే ఆ గౌరవం వేరు. ఆ ప్రేమ వేరు. ప్రపంచంలో నీపై ఎవరు అమిత ప్రేమ చూపిస్తారనే ప్రశ్నకు సమాధానం నాడు.. తల్లిదండ్రులు.. అన్నా చెల్లెలు.. మన కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇవి కాకుండ ఏవేవో వస్తున్నాయి. అందుకు కారణం బాల్యం లోనే పట్టణాలకు పరుగులు పెట్టడం. ఉమ్మడి కుటుంబ రుచి నేటి పిల్లలకు, యువతకు చూపకపోవడమే అంటున్నారు మేధావులు. బంధాలు, మానవతా విలువల గురించి పిల్లలకు చెప్పే సమయం కూడ లేని రోజులివి. అందుకే రోజురోజుకు మన లైఫ్ లో ఏదో ఒకటి తగ్గిందనే ప్రశ్న అందరిలో మెదులుతోందని విద్యావేత్తల వాదన. కానీ ఒకటి పెరిగిందని కూడ చెబుతున్నారు.. అదే స్వార్థం.
నేటి సమాజంలో కుటుంబం కంటే స్వార్థానికి విలువ ఎక్కువట. అందుకే వివాహం కావడం.. వేరుగా రావడం. మన ఆదాయం మనకే.. మన ఇంటి వారికి కాదనే భావన పెరిగిపోయిందన్నది పలువురి భావన. ఇప్పటికైనా పిల్లలకు బంధాల విలువలతో పాటు, నీతి కథల రూపంలో సమాజంలో జరిగే ఘటనలను ఉదహరిస్తూ బోధించకపోతే రానున్నది గడ్డు కాలమేనట. అంతేకాదు ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబాలకు మళ్లీ ఆజ్యం పోసి సమస్యల కాలంలో ఒత్తిడికి లోను కాకుండా, జీవితాలను ఆనందంగా సాగించాలని పెద్దలు సూచిస్తున్నారు. పెరిగిన వృద్ధాశ్రమాల సంఖ్యను చూస్తే చాలు.. ఉమ్మడి కుటుంబాలు ఏ మేరకు నేటి సమాజంలో ఉన్నాయో చెప్పవచ్చని, ఇప్పటికైనా మన లైఫ్ లో తగ్గిన ఆ ఒక్కటి ఉమ్మడి అనే పదాన్ని కలిపి, పెరిగిన స్వార్థం అనే భావనను దూరం చేయాల్సిన అవసరం ఉందట. లేకుంటే మన వేలుతో మన కంటికి మనం గురి పెట్టుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు నాటి పెద్దలు. మున్ముందు కాలం తీరు మారునా? సమాజంలో మార్పు వచ్చునా అన్నది భవిష్యత్ లో జరిగే ఘటనలే మనకు తార్కాణమట.