Iran Israel War: మొత్తం మీద ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినట్టేనా? కాల్పుల విరమణ విషయంలో అమెరికా యత్నాలు ఒక రకంగా ఫలించినట్టేనా? ఈ దిశగా ఇరాన్- ఇజ్రాయెల్ దేశాలు అంగీకరించాయా? అసలీ మొత్తం ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ ఎక్కడ? ఏ కారణం చేత కాల్పుల విరమణ జరిగినట్టు భావించాలి? ఫైనల్ గా అమెరికా.. ఇరాన్ కి ఇస్తోన్న వార్నింగ్ ఎలాంటిది?
తుది విడత కాల్పులు పూర్తి చేసుకుని..
ఇది పది బాంబులకు సరిపోతుంది- సైంటిస్టులుఎట్టకేలకు ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయంటూ.. ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా పోస్టు సంచలనం సృష్టించింది. ఇప్పటి నుంచి సుమారు 6 గంటల తర్వాత ఇరాన్- ఇజ్రాయెల్ తుది విడత కాల్పులు పూర్తి చేసుకుని గాయపడిన తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయి. మొదట అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణ పాటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 గంటల నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణ మొదలు పెడుతుంది. అలా 12 గంటలు ముగిసిన తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుంది. ఈ ఒప్పందం అమల్లో ఉన్న వేళ పరస్పరం శాంతియుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు- ట్రంప్.
ఇజ్రాయోల్ దాడులు ఆపితేనే మేము ఆపుతాం-ఇరాన్
మరో వైపు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించింది. అయితే ట్రంప్ ప్రకటించిన ఆరు గంటల గడువు కూడా ముగిసింది. అయితే ఇజ్రాయెల్ పై ఇరాన్ మరిన్ని క్షిపణులు ప్రయోగించిన వార్తలొచ్చాయి. కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రాధేయపడ్డారని అంటోంది ఇరాన్. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా సైతం కొన్ని కథనాలను ప్రసారం చేస్తోంది. ఖతార్ లో అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే.. ఇజ్రాయెల్ తో బలవంతంగా కాల్పుల విరమణ అంగీకరించినట్టు చెబుతోంది ఇరాన్. ప్రస్తుతం ఇదే కీపాయింట్ గా భావిస్తున్నారంతా. మొత్తం మీద ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన పశ్చిమాసియా యుద్ధం చల్లారినట్టే కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే ఇరాన్ కాల్పుల విరమణ మొదలు పెట్టగా.. సీజ్ ఫైర్ ను మేము సైతం ఒప్పుకుంటున్నట్టు ప్రకటించింది ఇజ్రాయెల్. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి అణు ముప్పు తొలిగిపోయినట్టు ఇందులో ప్రస్తావించింది ఇజ్రాయెల్. ఇందుకు సహకరించిన ట్రంప్ కి కృతజ్ఞతలు చెప్పారు.. నెతన్యాహు.
ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్ని టార్గెట్లు ఫినీష్
ఆపరేషన్ రైజింగ్ లయన్ అన్ని టార్గెట్లను ఇజ్రాయెల్ సాధించిందని.. ఇరాన్ నుంచి ప్రధానమైన ముప్పు- అణ్వాయుధాలు, ఆపై బాలిస్టిక్ క్షిపణులు. వీటిని సమర్ధవంతంగా తొలగించామని అంటోంది ఇజ్రాయెల్. దానికి తోడు ఇరాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఇరాన్ కి చెందిన డజన్ల కొద్దీ ప్రాంతాలను ధ్వంసం చేయగలిగింది. అంతే కాక మరో సీనియర్ అణు సైంటిస్ట్ ని సైతం హతమార్చింది. మొత్తంగా టెహ్రాన్ అణు గుండెలను తాము దెబ్బ తీశామని ఈ ప్రకటన ద్వారా వెల్లడించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి రక్షణ పరంగా సాయం చేయడం మాత్రమే కాక.. యుద్ధంలోకి స్వయంగా అడుగు పెట్టింది యూఎస్. ఇరాన్నుంచి పొంచి ఉన్న అణు ముప్పు తొలగించడంలో సాయం చేసిన అధ్యక్షుడు ట్రంప్ కి కృతజ్ఞతలు చెబుతున్నాం అంటోంది ఇజ్రాయెల్. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రతిచర్య మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ని హెచ్చరించింది ఇజ్రాయెల్.
ట్రంప్ పోస్ట్ 6 గం.ల తర్వాత మొదలైన విరమణ
ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందంలోని మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. విరమణ తొలుత మొదలు పెట్టాల్సింది ఇరానే. తర్వాత ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఈ యుద్ధానికి ముగింపు లభిస్తుంది. ఈ ప్రకటన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య దాడులు జరగడం గమనార్హం. అయితే ట్రంప్ తన ట్రూత్ పోస్ట్ చేసిన ఆరు గంటల త్వాత కాల్పుల విరమణ మొదలు పెట్టినట్టు ప్రకటించింది ఇరాన్. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైతం ఇందుకు ఒప్పుకున్నట్టు ప్రకటించింది. దీంతో యుద్ధం ఒకరకంగా ముగిసినట్టే భావించాలంటారు యుద్ధ వ్యవహారాల నిపుణులు. ఇరాన్ మళ్లీ అణ్వాయుధాల జోలికి వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన వేళ.. వాన్స్ ఇలా స్పందించడం గుర్తించాల్సిన విషయం. ఈ దిశగా ఆయనొక ఇంటర్వ్యూ ద్వారా ఈ కామెంట్ చేశారు. ఇరాన్ కి అణ్వాయుధాలు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతను ఆయన ప్రకటించారు. ఒక వేళ ఇరాన్ ఫ్యూచర్లో అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తే.. అత్యంత శక్తిమంతమైన అమెరికన్ ఆర్మీని ఎదుర్కోవల్సి ఉంటుందని అంటారు వాన్స్. ఇప్పటికీ మేము ఇరాన్ తో సంప్రదాయ యుద్ధంలో లేం. జస్ట్ ఆ దేశపు అణు కార్యక్రమంపై మాత్రమే పోరాడుతున్నాం. అని అన్నారు వాన్స్.
ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో చెప్పం-వాన్స్
ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం శిథిలాల కింద పాతేయడమే తమ టార్గెట్. తాము దాన్ని సాధించామని అంటారు జేడీ వాన్స్. ప్రస్తుతానికి యురేనియం నుంచి అణ్వాయుధం తయారు చేసే సామర్ధ్యం వారికి లేదన్నారు వాన్స్. ఇక ఆ యురేనియం ఎక్కడ ఉందో అన్న సున్నితమైన అంశాన్ని తాము బయటకు చెప్పమని అన్నారు ఉపాధ్యక్షుడు వాన్స్. అమెరికా ఎంత భారీ దాడి చేసినా.. శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయట పడలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన 60 నుంచి 90 శాతం మధ్య శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ తయారు చేస్తున్నట్టు అమెరికా, ఇజ్రాయెల్, ఇతర పశ్చిమ దేశాల ఆరోపణ. ఇరాన్ న్కూక్లియర్ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీన్ని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడొచ్చు. దీన్ని చిన్న కంటైనర్లు, చివరికి కార్లలో కూడా తరలించవచ్చంటూ అమెరికా పత్రిక NPR కి తెలిపారు అణు శాస్త్రవేత్తలు. ఇదిపది బాంబులకు సరిపోతుందన్నది వీరి మాటగా తెలుస్తోంది. యుద్ధం ఎంతకీ ఆగడం లేదంటే అక్కడంటూ ఒక యుద్ధ తంత్రం అమలు కావడం లేదని అర్ధం. ఒక యుద్ధం ఆగిందంటే ఆ యుద్ధ దేశాల్లో ఒకటి ఖచ్చితమైన వ్యూహం వాడిందని అర్ధం. భారత్ పాక్ వార్ ఆగడానికి కేవలం 4 రోజుల సమయం సరిపోయింది. అదే ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లో 12 రోజులైనా.. యుద్ధం జరుగుతూ వచ్చింది. మధ్యలో యూఎస్ ఎప్పుడైతే.. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిందో ఇరాన్ పని సులువైంది. అదెలా? ఇప్పుడు చూద్దాం.
ఖతార్‌లో US సైనిక స్థావరం-అల్ ఉదీద్
ఇరాన్ వాడిన ఖతార్ టెక్నిక్ వర్కవుట్ అయినట్టు అంచనాఇదిగో ఇది చూశారా? ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరం. అల్ ఉదీద్ స్థావరం. మధ్య ప్రాచ్యం అంతటా అమెరికా గత కొన్ని దశకాలుగా.. తన స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఉంది. ఈ మొత్తం స్థావరాలు 8 వరకూ ఉండగా.. వీటి సైనిక సామర్ధ్యం సుమారు 50 వేల వరకూ ఉంది. అమెరికాకు సైనిక పరంగా అత్యంత కీలకమైన అల్ ఉదీద్ పై గురి చూసి కొట్టడంతో మొత్తం వార్ డైనమిక్స్ మారిపోయాయి. దానికి తోడు గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గత నెలలో ట్రంప్ ఈ స్థావరాన్ని సందర్శించారు. సెప్టెంబర్ లెవన్ దాడుల తర్వాత ఆఫ్టన్ లో తాలిబన్, అల్ ఖైదా కార్యకలాపాలను నియంత్రించడానికి అల్ ఉదీద్ నుంచి పని చేయడం మొదలు పెట్టింది యూఎస్ ఆర్మీ. ప్రస్తుతానికి వస్తే.. ఇరాన్- ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. దీంతో ఇరాన్ కి ఒక లీడ్ దొరికింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ మీద ఎంతటి దాడులు చేస్తున్నా సరే చలించడం లేదని గుర్తించింది. పైపెచ్చు ఇరాన్ లోని సైనిక నాయకత్వం నుంచి అణు శాస్త్రవేత్తల వరకూ ఎందర్నో కోల్పోయింది. అయినా సరే లెక్క చేయకుండా రోజుకు 2400 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరీ ఇజ్రాయెల్ ఈ దాడులు నాన్ స్టాప్ గా చేస్తూ వచ్చింది.
ఈ యుద్ధం ఆపమని ఇజ్రాయెలీల నిరసనలు
ఒక దశలో ఇజ్రాయెలీలు కూడా ఇరాన్ తో ఈ యుద్ధాన్ని ఆపమని తీవ్ర స్తాయిలో నిరసనలు వ్యక్తం చేశారు కూడా. అయితే ఖమేనీ అంతమే తన లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఈ యుద్ధంలోకి అమెరికా డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిందో.. ఇరాన్ కి ఒక దారి దొరికింది. అదే ఖతార్ లోని అమెరికా అతి పెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదీద్. ఇక్కడ గానీ గురి చూసి కొడితే.. అటు వైపు ఎన్నేసి యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయో మరెన్నేసి సైనికులు చనిపోయారో అన్న గణాంకం ఒక వార్త కానే కాదు. అమెరికా వంటి శక్తిమంతమైన దేశానికి చెందిన ఆర్మీని వెంట్రుక వాసి అంత దెబ్బ తీసినా కూడా అదొక సంచలన వార్త. ఎందుకంటే అమెరికన్ వెపన్ మార్కెట్ ఒక అద్దాల మేడ. అది ఎప్పుడూ గొప్పది గొప్పదీ అన్న కామెంట్ వింటూనే ఉండాలి. అమెరికా సైనిక సామర్ధ్యంపై ఎవరైనా చిన్న రాయి విసిరినా సరే చిన్నా భిన్నమై పోయే పరిస్థితి. మొన్న భారత్ పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడం ఒక ఎత్తు అయితే, అమెరికాకు చెందిన F16 రకం యుద్ధ విమానాలు సైతం దారుణంగా దెబ్బ తిన్నాయన్న వార్తకు ఒక్కసారిగా ఉలిక్కి పడింది అగ్రదేశం. ఎందుకంటే తమ ఆయుధాలు, యుద్ధ విమానాలు దెబ్బ తింటే అది తమ మార్కెట్ ని భారీ ఎత్తున దెబ్బ తీస్తుంది. దీంతో మొత్తం ఉల్టా- పల్టా అయిపోతుంది.
ఖతార్‌తో పాటు.. బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రయెల్
సరిగ్గా ఇదే టెక్నిక్ అప్లై చేసింది ఇరాన్. అల్ ఉదీద్ అనే అమెరికా సైనిక స్తావరాన్ని టార్గెట్ చేయంతో అదిరిపడింది యూఎస్. ఖతార్ తో పాటు బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, సౌదీ, సిరియా, అరబ్ ఎమిరేట్స్ తో సహా పశ్చిమాసియా అంతటా అమెరికా తన స్థావరాలను కలిగి ఉంటుంది. వీటన్నిటిలోనూ ఖతార్ సైనిక స్థావరం ఇరాన్ కి కేవలం 190 కి. మీ. దూరంలో మాత్రమే ఉంటుంది. అప్పటికీ యూఎస్ ఈ స్థావరాలన్నిటినీ అప్రమత్తం చేసి ఉంచింది. ఇరానీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు అలీ అక్బర్ తమ అణు కేంద్రాలపై అమెరికా చేస్తున్న దాడులకు తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. అందులో భాగంగా ఖతార్ లోని అల్ ఉదీద్ ని టార్గెట్ గా ఫిక్స్ చేసింది ఇరాన్. ఖతార్ రాజధాని దోహా అవుట్ స్కర్ట్స్ లోని ఎడారిలో సుమారు 60 ఎకరాల్లో 1996లో స్థాపించారు ఈ కేంద్రాన్ని. ఇది యూఎస్ సెంట్రల్ కమాండ్ ఫార్వర్డ్ కి హెడ్ క్వార్టర్. పశ్చిమాన ఈజిప్ట్ నుంచి తూర్పున కజకిస్తాన్ వరకూ విస్తరించిన భారీ భూభాగంలో యూఎస్ తన సైనిక కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్దేశిస్తుంది.
యూఎస్‌తో పాటు యూకే తదితర దేశాల విమానాలు
ఖతార్- అల్ ఉదీద్ వైమానిక దళంలో యూఎస్ వైమానిక దళంతో పాటు యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్, ఇతర ఎన్నో విదేశీ దళాలకు నిలయం ఈ స్థావరం. ఇది సుమారు 10 వేల మంది సైనికులను కలిగి ఉంటుంది. ఈ సంవత్సర ఆరంభంలో.. వాషింగ్టన్ డీసీ కి చెందిన ద హిల్ అనే వార్తా పత్రిక.. అల్ ఉదీద్ గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఇక్కడి పొడవైన రన్ వేలు.. ఇతర మౌలిక వసతులు యూఎస్ బలగాల ప్రొజెక్షన్లో కీలకంగా పని చేస్తున్నట్టు రాసుకొచ్చింది. అల్ ఉదీద్ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడానికి ఖతార్ సుమారు 8 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసిందని. ఇది అమెరికా పన్ను చెల్లింపు దారుల డబ్బు ఎంతగానో ఆదా చేయడంతో సమానమని రిపోర్ట్ చేసిందీ పత్రిక. ఈ స్థావరం.. ఇరాన్, ఆఫ్గాన్ వైమానిక కార్యకలాపాలతో పాటు 2021 కాబూల్ తరలింపుతో సహా ఎన్నో కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది.
ఇరాన్ వాడిన ఖతార్ టెక్నిక్ వర్కవుట్ అయినట్టు అంచనా
ఇరాన్ ఈ స్థావరాన్ని టార్గెట్ చేయడంతో ఖతార్ విదేశాంగ శాఖ ఈ వైమానిక స్థావరాన్ని తాత్కాలికంగా మూసి వేస్తున్నట్టు ప్రకటించింది. అంతే కాదు యూఎస్, యూకే రాయబార కార్యాలయాలు ఖతార్ లోని తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది ఇక్కడి ప్రభుత్వం. ఈ ముప్పు ముందే ఊహించిన యూఎస్ ఇక్కడి నుంచి తమ సైనిక విమానాలను సైతం తరలించింది కూడా. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇరాన్ అల్ ఉదీద్ ను టార్గెట్ చేయడంతో ఉలిక్కి పడ్డ ట్రంప్.. ఎట్టకేలకు యుద్ధం ఆపాల్సిందిగా తమను బతిమలాడారని చెబుతోంది ఇరాన్. గతంలో భారత్- పాక్ సంఘర్షణలోనూ సరిగ్గా ఇలాంటి పరిణామమే సంభవించడంతో.. అందరూ ఇదే నిజమై ఉంటుందన్న అంచనాకు వస్తున్నారు. మొత్తం మీద ఇరాన్ వాడిన ఖతార్ టెక్నిక్ పని చేసినట్టుగా అంచనా వేస్తున్నారు.
Story By Adhinarayana, Bigtv