భారతదేశం ఎన్నో దేవాలయాలకు నిలయం. మన దేశంలో దాదాపు 20 లక్షల ఆలయాలు ఉన్నాయని అంచనా. ఇంకా కొత్త దేవాలయాలను నిర్మిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది మన దేశంలోని ఆలయాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులోని అత్యధికంగా ఎక్కువ దేవాలయాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. తమిళనాడులో 80 వేల దేవాలయాలు ఉన్నట్టు అంచనా.
ఐరావతేశ్వర మహాదేవ్ ఆలయం
కొన్ని అంచనాల ప్రకారం ప్రతి లక్ష మంది భారతీయులకు 53 దేవాలయాలు ఉన్నాయి. అయితే మన దేశంలోని దేవాలయాల సంఖ్య పై ఖచ్చితమైన గణాంకాలు ఎక్కడా లేవు. కానీ ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు మాత్రం కొలివి దీరి ఉన్నాయి. వాటిల్లో కొన్నింటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయం తమిళనాడులో ఉంది. దీని పేరు ఐరావతేశ్వర మహాదేవ ఆలయం. దీన్ని శివునికి అంకితం చేశారు.
దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ అద్భుత దేవాలయాల్లో ఐరావతేశ్వర మహాదేవ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ వాస్తు శిల్పం, వైభవం చూసేందుకు అందంగా ఉంటాయి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించారని చెప్పుకుంటారు. అయితే ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
తమిళనాడు వెళ్ళిన వారు కచ్చితంగా చూడవలసిన ఆలయాల్లో ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ వాస్తు శిల్పం, ముఖ్యంగా మెట్లు ఎంతో ప్రత్యేకంగా నిర్మించారు.
ఈ ఐరావతేశ్వర మహాదేవ్ ఆలయాన్ని రెండవ చోళ మహారాజు నిర్మించాడని చెబుతారు. ఎంతో దూర ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తారు. ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అద్భుత రాతి శిల్పాలను ఎంత చూసినా కూడా తనివి తీరదు.
పేరు ఎలా వచ్చింది?
ఆలయానికి ఐరావతేశ్వర అనే పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇంద్రుడు ఉపయోగించే తెల్ల ఏనుగును ఐరావతం అంటారు. ఆ ఐరావతమే తొలిసారిగా ఈ ఆలయంలో పూజ చేసిందని అంటారు. అందుకోసమని దీనికి ఐరావతేశ్వర మహాదేవ ఆలయం అని పేరు పెట్టినట్టు చెబుతారు. ఇక్కడ కేవలం శివుడి విగ్రహమే కాదు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయు, బ్రహ్మ, విష్ణువు, సూర్యుడు, దుర్గా, సరస్వతీ, గంగా, యమునా, లక్ష్మీ దేవతల విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి.
సప్తస్వరాల మెట్లు
ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత సప్త స్వరాలను వినిపించే మెట్లు. ఈ ఆలయంలోని బలిపీఠం వద్ద మెట్లు అందంగా చెక్కి ఉంటాయి . వీటిని మీరు తాకుతూ ఉంటే వేరువేరు శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ మీరు ఏడు స్వరాలను వినవచ్చు. ఇవి చిన్న మెట్లే. రాతితో చెక్కినవి. కానీ వాటిని చేతితో తాకుతూ ఉంటే వివిధ స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. సంగీతాన్ని వినిపించే ఈ రాతి మెట్లను ఎలా నిర్మించారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇలా పురాతన ఆలయాలలో సైన్సుకు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ ఐరావతేశ్వర మహాదేవ ఆలయంలోని రాతి మెట్లు కూడా భాగమే.
ఈ ఐరావతేశ్వర మహాదేవ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయంలో 100 స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకోవచ్చు. తమిళనాడులోని గొప్ప చోళ దేవాలయాలలో ఈ ఐరావతేశ్వర మహాదేవ ఆలయం కూడా ఒకటి.