Big Stories

BRS: ఢీలా పడ్డ బీఆర్ఎస్.. బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు?

Telangana BJP: లోక్ సభ ఎన్నికల్లో అధికార పార్టీతో సమంగా సీట్లు గెలుచుకుని బీజేపీ హుషారుమీదుండగా.. కనీసం బోణీ కూడా చేయలేక చతికిలపడ్డ బీఆర్ఎస్ ఉనికి కోసం తండ్లాడుతున్నది. ఒక వైపు ఎమ్మెల్యేల వలసలు.. మరో వైపు కేసుల ఉచ్చులతో బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఊపిరిసలపని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోయే ఎమ్మెల్యేలు పోయినా.. క్యాడర్‌ను నిలబెట్టుకుని పార్టీని కాపాడుకోవచ్చునుకున్న ఆ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం వరుస దర్యాప్తులతో బెంబేలెత్తిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు పార్టీని, ఉనికి కాపాడుకునేది ఎలా? అధినాయకులూ ప్రజల్లో నిలబడేదెలా? మరో వైపు రాష్ట్రంలో టీడీపీ కూడా బలపడాలని ఉబలాటపడుతున్నది. వీటన్నింటినీ తట్టుకునేది ముందుకు సాగేదెలా అనే ప్రశ్నలు బీఆర్ఎస్ హైకమాండ్‌ను ఆలోచనలో పడేసినట్టు తెలుస్తున్నది. అందుకే పొత్తు మార్గాలను బీఆర్ఎస్ అన్వేషిస్తున్నదని వార్తలు వస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని, కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఇందులో భాగమేనని ఓ జాతీయ మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.

- Advertisement -

పవర్ కమిషన్, కాలేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తున్నది. భవిష్యత్‌లో మరిన్ని నిర్ణయాలపై దర్యాప్తులు మొదలు పెట్టే అవకాశాలు లేకపోలేవు. పవర్ కమిషన్ దర్యాప్తులో నోటీసులు ఏకంగా కేసీఆర్ వరకు వచ్చాయి. ఇక తనయ కవిత ఇది వరకే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలకు చిక్కి తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదు నెలలుగా ఆమె జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

- Advertisement -

ఇలాంటి జటిల పరిస్థితుల్లో కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలను కలిసి పొత్తు అవకాశాలపై సంప్రదింపులు జరిపినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ పొత్తు ప్రతిపాదనను కొందరు బీజేపీ నేతలు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పొత్తును వ్యతిరేకించేవారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలనుకునే బీజేపీ నేతల నుంచే ఈ పొత్తుకు అంగీకారం వస్తున్నదని వివరించారు. దీర్ఘకాలంలో ఈ పొత్తు బీజేపీకి ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని, ఎందుకంటే ఒక కుటుంబాన్ని కాపాడటానికి బీజేపీ మద్దతు ఇచ్చిందనే విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఎనిమిది లోక్ సభ సీట్లను గెలిచిన బీజేపీకి మరో పార్టీతో పొత్తు అవసరమే లేదని, ఆ మాటకొస్తే దాని ఏపీ మిత్రులతోనూ తెలంగాణలో పొత్తు అక్కర్లేదని ఈ వర్గం స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో బీజేపీ సొంతకాళ్ల మీద ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నది.

బీఆర్ఎస్ నిజంగానే అవకాశాలను వెతుకుతున్నదనే మాటను ఆ పార్టీ నాయకులు కొందరు అంగీకరించారు. మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఏ విషయాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ప్రతిపాదన ఉన్నదా? అని అడగ్గా.. ‘మా పార్టీలోని మెజార్టీ నాయకులు ప్రజాస్వామికులు, ప్రగతిశీకులు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఎన్నో పోరాటాలను తెలంగాణ చూసింది…. ఎన్నికలూ బహుదూరంగా ఉన్నాయి. కాబట్టి, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. దేన్నీ కొట్టిపారేయలేం’ అని వినోద్ కుమార్ అన్నారు. కానీ, బీఆర్ఎస్ కథ ముగిసిందనే అభిప్రాయానికి రావడం సరికాదని, రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీకి కూడా లేని క్యాడర్ తమ పార్టీకి ప్రతిగ్రామంలో ఉన్నదని వివరించారు. మళ్లీ పుంజుకోవడానికి తమ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల క్రితం అధ్వాన్న స్థితిలో ఉన్నదని, కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారని, కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని వివరించారు. కాబట్టి, ప్రస్తుత పరిస్థితిని బట్టి దిగులుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మరో బీఆర్ఎస్ నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలకు బెదిరి తొందరపాటు నిర్ణయాలను పార్టీ తీసుకోదని అనుకుంటున్నానని చెప్పారు. వైఎస్ జగన్ తొందరపాటు చర్యగా మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేస్తే అది బూమరాంగ్ అయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఘనవిజయం సాధించి సీఎం అయ్యారని విశ్లేషించారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్నారని, ఆ తప్పును రేవంత్ రిపీట్ చేయకపోవచ్చని చెప్పారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News