BigTV English

Manipur Riots: రెండు జాతుల మధ్య వైరం.. మణిపూర్ అల్లర్ల వెనుక ఏం జరిగింది?

Manipur Riots: రెండు జాతుల మధ్య వైరం.. మణిపూర్ అల్లర్ల వెనుక ఏం జరిగింది?

ఇప్పుడు.. దేశం మొత్తం ఇదే చర్చ! గతేడాది మణిపూర్‌లో జరిగిన అల్లర్లు ఎంతటి హింసకు దారితీశాయో.. ఎన్ని వందల మంది ప్రాణాలను తీసుకున్నాయో.. భారత్ మొత్తం చూసింది. అయితే.. ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారు? హింసను ప్రేరేపించింది ఎవరనేదానిపై.. ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఆయన పేరుతో ఓ ఆడియో క్లిప్ వైరల్ అవడమే ప్రధాన కారణం. మెయితీలు, కుకీల మధ్య జరిగిన హింసను.. సీఎం బీరేన్ సింగే ప్రేరేపించారని లీకైన ఆడియో క్లిప్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు.. మెయితీలకు అవకాశమివ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయింది. దాంతో వివాదం మరింత ముదిరింది.

సీఎం బీరేన్ సింగ్ వ్యాఖ్యలతో సంబంధం ఉన్న ఆడియో టేపులు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ.. కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో.. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకొని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. లీక్ అయిన ఆడియో క్లిప్‌లను.. హైదరాబాద్‌లోని స్వతంత్ర ఫోరెన్సిక్ ల్యాబ్.. ట్రూత్ ల్యాబ్స్ పరిశీలించింది. అందులోని వాయిస్.. సీఎం బీరెన్ సింగ్ గొంతుతో 93 శాతం మ్యాచ్ అయిందని.. కుకీ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు. అదే.. ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.


అయితే.. కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ రిపోర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైరల్ అయిన ఆడియో క్లిప్‌పై.. కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలనకు 3 వారాల గడువు కావాలని కోరారు. ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడం వెనుక కుకీ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఉద్దేశాన్ని సైతం ప్రశ్నించారు. వారికి సైద్ధాంతిక ధోరణులు, వేర్పాటువాదుల రకాలు ఉన్నాయని మెహతా వాదించారు. పిటిషనర్ ఉద్దేశం కేవలం ఇప్పుడున్న సున్నితమైన అంశాన్ని మరింత మరిగించడమేనన్నారు. పైగా.. ఈ కేసుని మణిపూర్ హైకోర్టు విచారించాలని ఆయన కోరుతున్నారు. అయితే.. ఈ కేసుని.. తాము విచారించాలా? మణిపూర్ హైకోర్టు విచారించాలా? అనేది తదుపరి విచారణలో నిర్ణయిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

పూర్తి వాదనలు విన్న తర్వాత… సీఎం బీరెన్ సింగ్ ఆడియోకు సంబంధించి ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ అందించాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఫోరెన్సిక్‌ లాబొరేటరీ CFSLకు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది. వాస్తవానికి.. ఏడాదిన్నర కాలంగా మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

మెయితీలు, కుకీల మధ్య రేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 250 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ.. ఆ రాష్ట్రం అట్టుడుకుతూనే ఉంది. హింసని నిలువరించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది. ఓ వైపు సర్కార్ చర్యలు కొనసాగుతున్నా.. హింసను పూర్తిగా అణచివేయడంలో పూరి స్థాయిలో విఫలమవుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో.. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై ఆదేశాలిచ్చారంటూ వచ్చిన ఆరోపణలు.. ఈ సమస్యని మరింత క్లిష్టంగా మార్చాయి.

Also Read: అవిమాత్రం..అడక్కు! అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ డీప్ సీక్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ.. హింసాగ్నిని చల్లార్చేందుకు, శాంతిభద్రతల్ని కాపాడేందుకు ప్రయత్నించాల్సిన సమయంలో.. ఓ వర్గానికి కొమ్ము కాస్తూ.. వారి పట్ల సానుకూలతను వ్యక్తం చేయడం, హింసను ప్రేరేపించేలా ఆదేశాలిచ్చారనే ఆరోపణలు.. ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య నెలకొన్న వైషమ్యాలు, హింస ఏ స్థాయికి చేరాయో అంతా చూశాం. ఇలాంటి సమయంలో.. సీఎం బీరేన్ సింగ్ చర్యలు మరింత హింసను పెంచేలా చేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

పైకి అంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా.. మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. అక్కడి వాతావరణమంతా.. నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఘర్షణలు తగ్గినప్పటికీ.. మెయితీ, కుకీ, నాగ తెగల ప్రజలు కలిసి జీవించాలనే కల.. కొన్ని నెలల కిందటే చెదిరిపోయింది. పరస్పర విశ్వాసం కోల్పోయిన అక్కడి ప్రజలు నిస్సహాయంగా మారారు. హింసాత్మక అల్లర్లు ఆగిపోయి ఏడాదిన్నర దాటినా.. మణిపూర్‌లో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. ఇంకా.. మెయితీలు, కుకీ తెగలు రగిలిపోతూనే ఉన్నాయి. ఇంతలోనే.. సీఎం బీరేన్ సింగ్ పేరుతో ఆడియో క్లిప్‌ వైరల్ అవడం.. అందులో మెయితీలకు సానుకూలంగా మాట్లాడారనే ఆరోపణలతో.. హీట్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల నుంచి మణిపూర్ ఎప్పటికి బయటపడుతుందన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

మెయితీలు, కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో మొదలైన వివాదం.. రెండు జాతుల మధ్య హింసకు దారితీసింది. అది కాస్తా.. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేసింది. ఈ భయానక పరిస్థితుల్ని భారత్ మొత్తం చూసింది. ఇప్పటికీ.. మణిపూర్‌లో ఆ రెండు తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదిన్నర కిందట అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు.. ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, పోలీసులు.. హింసను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా.. ఆ మంటలు చల్లారలేదు. ఆ సమయంలోనే పోలీసుల ఆయుధాల్ని దొంగిలించారు. అలా.. రెండు తెగల మధ్య ఘర్షణ.. మరింత హింసాత్మకంగా మారింది.

మణిపూర్‌లో సంక్షోభం తలెత్తేందుకు అనేక కారణాలు ఉన్నాయి. సుమారు 35 గిరిజన తెగలున్నా.. ప్రధాన తెగలు మూడే. అవే.. మెయితీ, కుకీ, నాగ తెగలు. మణిపూర్ మొత్తం జనాభా 33 లక్షలు ఉంటే.. అందులో 53 శాతం మెయితీలే ఉన్నారు. వీరంతా.. రాష్ట్రం మధ్యలోని ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. పైగా.. మణిపూర్‌లో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. ఈ కుకీ, నాగాతో పాటు ఇతర తెగలన్నీ కలిపి.. 47 శాతంగా ఉన్నారు. వీరంతా.. ఇంఫాలో లోయ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం.. ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మెయితీలు, నాగా, కుకీల మాదిరిగానే.. తమకు కూడా ఎస్టీ హోదా కావాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే.. వివాదానికి దారితీసింది. మణిపూర్‌ని అట్టుడికిపోయేలా చేసింది.

మెయితీల డిమాండ్‌కు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని.. మణిపూర్ హైకోర్ట్ ఆదేశించింది. దీనిపై.. అప్పటికి ప్రభుత్వం స్పందించలేదు. ఒకవేళ.. మణిపూర్ సర్కార్ మెయితీలకు సానుకూలంగా స్పందిస్తే.. తమకు నష్టం జరుగుతుందని కుకీ, నాగ తెగలకు చెందిన వారు ఘర్షణ పడటంతో హింస మొదలైందనే వాదనలున్నాయి. ఇప్పటికే.. ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకుబడి ఉన్న మెయితీల ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే.. కుకీలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు, అక్కడే స్థిరపడేందుకు వారికి అనుమతించినట్లవుతుందని.. కుకీలు వ్యతిరేకిస్తున్నారు.

అదీగాక.. 53 శాతం ఉన్న మెయితీల చేతుల్లో 10 శాతం భూమి ఉంటే.. 47 శాతం ఉన్న నాగ, కుకీ, ఇతర తెగల చేతుల్లో 90 శాతం భూమి ఉంది. ఇంఫాల్ లోయలో పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు, నిరుద్యోగం, వలసలు, ఇతర కారణాలతో మెయితీలు కూడా కొండ ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎస్టీలు మాత్రమే కొండ ప్రాంతాల్లో భూముల్ని కొనుగోలు చేయాలి. అందువల్ల.. తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనేది మెయితీల డిమాండ్. దీనిని.. కుకీ, నాగ తెగలు వ్యతిరేకిస్తున్నాయి.

కుకీ తెగ ఆందోళనకు ఇతర కారణలూ ఉన్నాయి. మణిపూర్ ప్రభుత్వం డ్రగ్స్‌పై చేపట్టిన యుద్ధంతో.. తమ కమ్యూనిటీలను సమూలంగా నాశనం చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మయన్మార్ నుంచి పెరిగిన అక్రమ వలసలు కూడా ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. పెరుగుతున్న జనాభాతో.. రాష్ట్రంలో భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. ఇలా.. అనేక కారణాలున్నాయి. అయితే.. అల్లర్లు చెలరేగిన తర్వాత.. అవి హింసాత్మకంగా మారేందుకు దారితీసిన పరిణామాలేంటనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు.. సీఎం మెడకే చుట్టుకునేలా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మెయితీలకు అనుకూలంగా పనిచేసిందెవరు? కుకీ తెగకు వ్యతిరేకంగా నిలిచిందెవరు? సీఎం బీరేన్ సింగ్ ఆడియోలో నిజమెంత? అనేది తెలిస్తే గానీ.. ఈ సంక్షోభానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందనే దానిపై స్పష్టత రాదంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×