Kumbhmela Stampede Akhilesh Yadav| అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా (Kumbh Mela)లో ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్యను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆయన ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
‘ప్రభుత్వం నిరంతరం బడ్జెట్ గణాంకాలు ఇస్తూనే ఉంది. అదే విధంగా, మహా కుంభమేళాలో మరణించిన వారి గణాంకాలు కూడా ఇవ్వాలి. అక్కడి ఏర్పాట్లపై స్పష్టత కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. కుంభమేళా నిర్వహణ బాధ్యతలను ఆర్మీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాను. మృతుల సంఖ్య, గాయపడిన వారికి అందించిన వైద్య సహాయం, మందులు, ఆహారం, రవాణా వంటి అన్ని వివరాలను పార్లమెంటులో సమర్పించాలి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిజాన్ని దాచిన వారిని శిక్షించాలని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నేరం లేకుంటే ఆ గణాంకాలను ఎందుకు దాచారు?’ అని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు.
మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో మౌని అమావాస్య రోజున భారీగా భక్తులు తరలివచ్చడంతో తొక్కిసలాట (Kumbh Mela Stampede) జరిగింది. సంగం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
Also Read: భారత్‌కు చేరిన 400 లకు పైగా పాకిస్తానీ హిందువుల చితాభస్మం, ఏళ్ల నిరీక్షణ ఎందుకంటే ?
అఖిలేశ్ యాదవ్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన బిజేపీ ఎంపీ హేమమాలినీ
మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై బిజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని (Hema Malini) స్పందించారు. ఆ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని ఆమె అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
‘‘అసత్యాలు మాట్లాడటమే అఖిలేశ్ యాదవ్ పని. మేము కూడా కుంభమేళా (Kumbh Mela)ను సందర్శించాం. కుంభమేళాకు ఎంతోమంది వస్తున్నారు. అంతమంది వస్తున్నప్పుడు నిర్వహణ కష్టమైనప్పటికీ, యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తోంది’’ అని ఆమె అన్నారు.
మరోవైపు రాజ్యసభలో కూడా వరుసగా రెండో రోజు కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్యపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నాయకులు కుంభమేళా మృతులు వేల సంఖ్యలో ఉన్నారని దావా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సంఖ్యను దాస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుంభమేళా మృతులు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పడంతో దుమారం రేగింది. ఆ వేడి చల్లారకుండానే తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జనవరి 29న జరిగిన కుంభమేళా తొక్కిసలాటలో 2000 మంది భక్తులు చనిపోయారని.. ఉత్తర్ ప్రభుత్వం కుంభమేళా ఏర్పాట్లు అధ్వానంగా చేసిందని విమర్శించారు. కుంభమేళా వేడుకన పొలిటికల్ మార్కెటింగ్ కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
దీనిపై రాజ్యసభలో డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏదైనా ప్రమాణాలు ఉంటే చూపించాలని ప్రశ్నించారు. దీనిపై ఎంపీ రౌత్ స్పందిస్తూ.. త్వరలోనే ఆధారాలు చూపుతామని చెప్పారు.