Kurnool Diamond Hunt: మాములుగా మనం కేజీఎఫ్ గురించి వినే ఉంటాం. కానీ ఇది KDF. అంటే కోహినూర్ డైమాండ్ ఫీల్డ్. మాములుగా అయితే వర్షాకాలం వస్తూ వస్తూ పంట తెస్తుందేమో.. కానీ ఇక్కడ మాత్రం వజ్రాలను వెంట తెస్తుంది. ఇంతకీ ఇక్కడ దొరికే వజ్రాల విలువ ఎంత ఉంటుంది? ఏటా ఎన్నేసి కోట్ల విలువ చేసే వజ్రాల మార్కెట్ ఇక్కడ నడుస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతమేది? అక్కడ జరిగే ఆ డైమండ్ హంట్ ఎలాంటిది?
15 క్యారట్ల వజ్రం లభ్యం
ఏపీలోని కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, పెండేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళకు 15 క్యారట్ల వజ్రం దొరికింది. దీని విలువ లక్షల్లో ఉంటుంది. దీంతో తన దరిద్రం తీరిపోయిందని భావిస్తున్నారీమె. ఇక పెరవలి కొల్లాపూర్ కి చెందిన ఒక వ్యక్తికి రూ. 30 లక్షల విలువైన వజ్రం దొరికింది. తాను పడ్డ కష్టాలకొక పరిష్కార మార్గం దొరికిందని ఫీలవుతారీయన. ఇలాంటి డైమండ్ స్టోరీస్ ఇక్కడ సర్వ సాధారణం. కారణం.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కొన్ని కోట్ల రూపాయల విలువైన వజ్రాలు బయట పడతాయి. అనుకోని అదృష్టంలా కొందరి జీవితాలనే మార్చేస్తాయ్.
వర్షాకాలంలో చిన్న సైజు కేజీఎఫ్ సీన్
అనంతపురంలో.. అయితే ఒక ఊరి పేరే వజ్ర కరూర్. ఈ ఊరు చూస్తే దుమ్మధూళితో కనిపిస్తుంది. కానీ, వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ ఒక చిన్నసైజు కేజీఎఫ్ ని తలపిస్తుంది. అలాగని పెద్ద పెద్ద నరాచీ సెట్లు ఏమీ ఉండవు. ఎవర్నీ ఎవరూ బంధించరు. అందుకంటూ గరుడ రేంజ్ విలన్లు కూడా పెద్దగా ఉండరు. ఆ మాటకొస్తే హరి హర వీరమల్లులా ఒకరికి దొరికిన వజ్రం మరొకరు చోరీ చేయడం వంటి సెంటిమెంటు సన్నివేశాలేం ఉండవు. వారి చేతిలో కూడా పెద్ద పరికరాలు ఏవీ ఉండవు. చిన్న చిన్న కర్రలు, గరిటలు, స్పూన్లు, జల్లెడ్లు వంటి సామాన్యమైన వంటింటి సామాన్లతోనే వారీ వజ్రాల వేట కొనసాగిస్తారు.
పెద్ద బ్యానర్లు బ్రాండ్ల వంటివేవి కనిపించవు..
అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర వంటి మండలాల్లో ఈ వజ్రాల వేట ఒక రేంజ్ లో జరుగుతుంది. వర్షాకాలం రావడంతోటే బీడు భూములు కాస్తా వీరికి నిధినిక్షేపాలు దొరికే గనుల్లా కనిపిస్తాయి. ఇక్కడి ఒండ్రు మట్టిలో వీరు వెతికే కొద్దీ వజ్రాలతో పాటు ఎన్నో విలువైన రాళ్లు దొరుకుతాయి. వాటిలో కొన్ని హరి హర వీరమల్లులో చూపించినట్టు కోహినూర్ లాంటివి కూడా ఉంటాయి. వాటి ధరలు కొన్ని కోట్లల్లో పలుకుతుంటాయి. అలాగని ఇక్కడేం పెద్ద పెద్ద బ్యానర్లుండవు, భారీ భారీ కంపెనీ బ్రాండ్లు కూడా ఏవీ కనిపించవు. కానీ ఈ ప్రాంతాల్లో వజ్రాల వేటకు దిగే వారికి లక్షా రెండు లక్షల నుంచి మొదలు పెడితే.. అప్పుడప్పుడూ 50 లక్షల రూపాయల మేర విలువైన రాళ్లను చేజిక్కించుకుంటూ ఉంటారు. మద్దికెర, తుగ్గిలి మండలాల్లో సీజన్ కి సుమారు 5 కోట్ల విలువైన వజ్రాలు లభిస్తాయంటే అర్ధం చేసుకోవచ్చు..
బిలియన్ సంవత్సారా నాటి కింబర్ లైట్ నిర్మాణాలు
ఇక్కడే ఎందుకిలా దొరుకుతాయంటే.. ఇక్కడ కొన్ని బిలియన్ సంవత్సరాల నాటి అగ్ని పర్వత కింబర్ లైట్ నిర్మాణాలు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి సహజ సిద్ధ ప్రక్రియల ద్వారా వజ్రాల్లా తయరవుతుంటాయి. వాటిలో కొన్ని.. నదీగర్భాలు, పొలాల్లోకి తరచూ వాతావరణ మార్పిడి కారణంగా మారుతుంటాయి. ఏళ్ల తరబడి భూగర్భంలో ఉంటూ.. ఇదిగో ఇలా సామాన్యుల చేతికి చిక్కేస్తుంటారు. వారిని లక్షాధికారులను చేస్తుంటాయి. ఇక్కడిలా విలువైన రాళ్లు దొరుకుతున్నాయని తెలియడంతో కేవలం ఏపీకి చెందిన వారు మాత్రమే కాదు.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని వందలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బీడు భూములు ఇతర స్థలాలు పొలాలను జల్లెడ పట్టేస్తారు. గంటల కొద్దీ అదే పనిగా.. మట్టి తొవ్వుతూనే ఉంటారు. చిన్న రాయి చేజిక్కినా లక్షా రెండు లక్షలైనా.. దొరుకుతుంది కదా? అన్న కోణంలో వీరి డైమండ్ హంట్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్కో సారి వీరి అదృష్టం బాగుంటే అవి యాభై అరవై లక్షలు మాత్రమే కాదు.. 3, 4 కోట్ల రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదని అంటారు.
కర్నూలు రైతుకు రూ.13 లక్షల వజ్రం
ఈ డైమండ్ రష్ కారణంగా ఈ ప్రాంతం ఆర్ధికంగా ఎంతో మెరుగుపడుతోంది. ఓ కర్నూలు రైతుకు 13 లక్షల విలువ చేసే వజ్రం దొరికిందనీ.. మరో మహిళకు పది లక్షల మేర విలువైన రాయి దొరికిందనీ.. ఇక్కడ తరచూ ఏదో ఒక వార్త.. వర్షాకాలంలో వినిపిస్తూనే ఉంటుంది. ఒక్కో సీజన్లో ఈ అదృష్టవంతుల సంఖ్య పెరగొచ్చు కూడా. కోహినూర్ వజ్రం దొరికింది కూడా సరిగ్గా ఇలాంటి ప్రాంతంలోనే. అయితే అది కృష్ణానదికి దగ్గర్లోని కొల్లూరు ప్రాంతంలో. ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల్లో ఒకటైన ఈ కోహినూర్ 105 క్యారెట్లకు పైగా ఉంటుంది. ఇది కాకతీయ రాజుల నుంచి మొఘల్, పర్షియన్, సిక్ ఇలాచేతులు మారి మారి.. చివరికి బ్రిటీష్ వారు దీన్ని 1849లో చేజిక్కించుకుంచుకున్నట్టు చెబుతుంది హిస్టరీ ఆఫ్ కోహినూర్. కోహినూర్ హిస్టరీ మొత్తం గోల్కొండ ప్రాంతంతో ముడి పడి ఉంటుంది. ఈ ప్రాంతం హోప్ డైమండ్, దరియా- ఇ- నూర్ వంటి ప్రసిద్ధ వజ్రాలతో ముడిపడి ఉంటుంది. కృష్ణ దాని పరివాహక ప్రాంతాలు, ఇతర ఉప నదులు ఇలాంటి వజ్ర వైఢూర్యాలను అందించే ప్రాంతాలుగా పేరు సాధించాయి. ఆనాటి నుంచీ ఈ వజ్రాల వేట కొనసాగుతూనే వస్తోంది. ఎందర్నో లక్షాధికారులను చేస్తూనే ఉంది.
గోల్కొండ- అప్పట్లోనే ప్రపంచ వజ్రాల కేంద్రంగా పేరు
కేవలం ఇది ఆర్ధిక పరమైన వ్యవహారం మాత్రమే కాదు. సాంస్కృతికంగానూ ప్రభావితం చేస్తూనే ఉందీ వజ్రాల వేట. తరచి చూస్తే సుదీర్ఘ చరిత్రతో పెనవేసుకుని కనిపిస్తోంది. ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజ వంశం ఆధీనంలోని గోల్కొండ ప్రపంచ వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా నిలిచింది. ఈ వేట ఇప్పటిది కాదు. ఆ నాటి నుంచే ఉందని చరిత్రను తిరిగి గుర్తు చేస్తుంటాయీ దృశ్యాలు. ఇది కేవలం ఆశల వేట మాత్రమే కాదు.. అలనాటి సంప్రదాయంగా చెబుతాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఎంత వర్షం కురుస్తున్నా లెక్క చేయక.. ఈ పంట పొలాల్లో, బీడు భూముల్లో, తమ తమ అదృష్ట పరీక్ష చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యవసాయ చరిత్రలోనే ఇదొక వజ్రతుల్యమైన అధ్యాయం. వజ్రాల వ్యవసాయంగా వీరు ఒకింత గర్వంగా చెప్పడం కనిపిస్తుందిక్కడ.
పంతులుగారి చెరువు దగ్గర దొరికిన కోహినూర్
హరి హర వీరమల్లు సినిమా చూసిన వారికి తెలిసే ఉంటుంది. కోహినూర్ డైమండ్ కోసమే ఆ సినిమా అంతా. అలాంటి కోహినూర్ దొరికింది మరెక్కడో కాదు. ఇక్కడే మన తెలుగు రాష్ట్రంలోనే. అసలీ ప్రాంతం భౌగోళికంగా ఎందుకంత ప్రత్యేకమైనది? ఆ కాలంలో కూడా ఈ వజ్రాల వేట ఎంత లాభదాయకమైనది? ఇప్పుడు చూద్దాం. రకరకాల దిశల్లో వెలుగులీనే వజ్రంకోహినూర్ ఈ పేరు చెప్పగానే అందరి కళ్లు జిగేల్మంటాయి. అలాంటి జిగేల్మనే ఈ వజ్రం దొరికింది.. కృష్ణానదిని ఆనుకుని ఉండే కొల్లూరు అనే గ్రామంలో. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో ఆ ఊరు కూడా ఖాళీ అయిపోయింది. నదికి అవతలి వైపు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కొల్లూరుకు వెళ్లాలంటే సత్తెనపల్లి నుంచి ఇరుకైన దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఊరు దాటిన తర్వాత కృష్ణా నది ఒడ్డున పంతులుగారి చెరువు అనే ప్రాంతం. సరిగ్గా ఇదే కోహినూరు వజ్రం దొరికిన చోటుగా చెబుతారు.
కాకతీయ, కుతుబ్ షాహీలకు ఆదాయ వనరుగా వజ్రాల వ్యాపారం
వజ్రాలు దొరికే ప్రాంతానికి ప్రత్యేక భౌగోళిక స్వరూపం ఉంటుంది. కోహినూరు దొరికిన ఈ ప్రాంతంలో కంకర రాళ్లగుంతలు 2 నుంచి 14 అడుగుల వరకూ ఉంటాయి. వజ్రాలుండే పొర దాదాపు అర అడుగు మందం ఉంటుంది. నల్లమల కొండల అంచుల్లో ఈ ప్రాంతం ఉండటాన్ని బట్టీ చూస్తే.. ఇక్కడ వజ్రాలు పుట్టాయని చెప్పడం కంటే కొట్టుకు వచ్చాయని అంటారు నిపుణులు. మేలిమి వజ్రాలు ఇక్కడ తవ్వేకొద్దీ దొరుకుతుండటంతో.. ఆయా రాజుల కాలంలో వారికో అయాచిత వరంగా మారినట్టుగానూ అంచనా వేస్తారు పురావస్తు శాస్త్రవేత్తలు.
కాకతీయులు, కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాలు ఆయా రాజ్యాల పాలిట అదనపు ఆదాయ వనరులుగా వర్ధిల్లాయి. కుతుబ్ షాహీల కాలంలో ఈ వజ్రాల ఖ్యాతి ఐరోపా వరకూ పాకడంతో.. గోల్కొండ అంటేనే వజ్రాలకు పర్యాయ పదంగా మారింది. గోల్కొండ అనగానే అశేష- విశేష సంపదకు నిలయంగా పేరు గాంచింది. కొల్లూరు గనులు అప్పట్లో భారత్ లోనే అతి పెద్ద గనులుగా పేరు సాధించాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో లక్ష జనాభా మాత్రమే ఉండేదని.. ఈ గనుల్లో ఎప్పుడూ 30 నుంచి అరవై వేల మంది వరకూ పని చేస్తుండేవారని రాసుకొచ్చారో ఫ్రెంచి పర్యాటకుడు. ఈ ప్రాంతంలో నాటి కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన వాచ్ టవర్ అలనాటి చరిత్రకు సాక్షీభూతంగా చెబుతారు.
కోహినూర్ కొల్లూరులో దొరికినట్టు రాసిన మెకంజీ
ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే మేలిమి వజ్రాలు దొరికినట్టు చెబుతుంది చరిత్ర. రీజెంట్, దరియా- ఇ- నూర్, అర్లాఫ్, నిజామ్ డైమండ్, గ్రేట్ మొఘల్, హోప్ వంటివి ఈ గనులనుంచి వెలుగు చూసినవే. అయితే ఇవన్నీ ఇప్పుడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. గార్డన్ మెకంజీ కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నపుడు 19వ శతాబ్దిలో మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్ లో కోహినూర్ కొల్లూరులో దొరికిందని రాశారు. ఈ ప్రాంతంలో గోల్కొండ పాలకుల కింద ఉండేదని అన్నారు. బాప్టిస్ట్ టావెర్నియర్ అనే పర్యాటకుడు గోల్కొండ నుంచి ప్రయాణించి.. కృష్ణానదిని దాటి గని కొల్లూరు అనే ఈ ప్రాంతం చేరుకున్నట్టు రాసుకొచ్చారు. ఇది పులిచింతలకు దక్షిణంగా బెల్లంకొండకు పడమటగా ఉందని. దీన్నే కొల్లూరు అంటారని చెబుతారు చరిత్రకారులు. ఒక రైతు తాను విత్తనాలు నాటుతూ 25 క్యారెట్ల వజ్రాన్ని కనుగొనడం ద్వారా.. ఇక్కడి వజ్రాల వేటకు పునాది వేసినట్టు చెబుతాడు టావెర్నియర్. ది కోహినూర్ డైమండ్- ది హిస్టరీ అండ్ ది లెజండ్ అనే పుస్తకంలోనూ కొల్లూరు కోహినూరు జన్మస్థలంగా రాశారు.
13వ శతాబ్దిలో మార్కోపోలో సైతం గుర్తింపు
జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా కొల్లూరు కోహినూర్ పుట్టిన ప్రాంతంగా చెబుతుంది. కొల్లూరు వజ్రపు గనుల గురించి 13వ శతాబ్దిలో మార్కో పోలో రికార్డు చేసినట్టు చెబుతారు. పలువురు పరిశోధకులు, చరిత్ర కారులు, కోహినూర్ సహా అనేక వజ్రాలు ఇక్కడే దొరికినట్టు రాసుకొచ్చారు. 1290లో తొలిసారిగా ఇక్కడ గనులున్నట్టుగా బయట పడినట్టు చెబుతారు. రుద్రమదేవి పాలనా కాలంలో మార్కోపోలో అనే యాత్రికుడు చీరాల ద్వారా ఈ ప్రాంతంలోకి ప్రవేశించి కొల్లూరు దగ్గర వజ్రాల గనుల గురించి ప్రస్తావించినట్టు చెబుతుంది చరిత్ర. కుతుబ్ షాహీల తర్వాత మొఘలులు, నిజాంల పాలన వచ్చింది. ఆ తర్వాత ఈ గనుల గురించి తెలియ రాలేదు. బ్రిటీష్ వారు ఇక్కడ వజ్రాల గనులున్నట్టు గుర్తించారు కానీ తర్వాతి కాలంలో కొత్త వజ్రాలను తవ్వినట్టు చరిత్ర లేదు. ఇక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు దొరకడానికి ప్రధాన కారణం ఇక్కడ కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లోని చతుర్భజ కంకర ఉండటమేనంటారు. వీటినే డైమండ్ బేరింగ్ గ్రావెల్స్ అంటారు. ఈ కంకర ఉన్న చోట వజ్రాలు దొరుకుతాయని చెబుతారు.. నిపుణులు. అప్పట్లో ఈ ప్రాంతం కూడా గోల్కొండ కిందకు వచ్చేదే.
Also Read: సునామీ దెబ్బకు ఆ దేశాలు గజ గజ.. న్యూ బాబా వంగా చెప్పిన జోస్యం నిజమైనట్టేనా?
ఒక రాయి వజ్రమా కాదా? కొన్ని కొన్ని పరీక్షల ద్వారా గుర్తిస్తారు. మొదట దాని మెరుపును అంచనా వేస్తారు. అంతే కాదు పారదర్శకత కూడా కీలకమే. ఎంతో మెరుగ్గా ఉంటూ అంతే ట్రాన్స్ పరెంట్ గా ఉంటాయి వజ్రాలు. ఇక కాఠిన్యం కూడా వజ్రం విషయంలో ముఖ్యమే. వజ్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గీతలు పడవు. వీటికి సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. నిజమైన వజ్రం నీటిలో మునిగిపోతుందని అంటారు నిపుణులు. అదే నకిలీదైతే తేలిపోతుందని చెబుతారు. వజ్రం వేడిగా ఉంటే పొగ పీల్చుకోదని.. అదే నకిలీది పీల్చుకుంటుందని అంటారు. వజ్రం రకరకాల దిశల్లో వెలుగులీనుతుంది. అదే నకిలీది అలా చేయదని చెబుతారు డైమండ్ ఎక్స్ పర్ట్స్.
Story By Adinarayana, Bigtv