AP Free Bus Scheme: ఏపీలో ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అములు చేయనుంది చంద్రబాబు సర్కార్. ఇప్పుడిప్పుడే వాటికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తోంది. మహిళలు ఆధార్, ఓటరు, పాన్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు.
సీఎం చంద్రబాబు చెప్పినట్టుగానే ఆగష్టు 15 నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. ప్రయాణం చేసే మహిళలు ఆధార్, ఓటరు, పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది. అప్పుడు కండర్టక్ వారికి జీరో టికెట్ ఇష్యూ చేస్తారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే.
ఈ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బుధవారం గుంటూరులో జోన్-3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల డిపోల అధికారులతో సమావేశమయ్యారు ఆర్టీసీ ఛైర్మన్ నారాయణ, ఎండీ ద్వారక తిరుమలరావు.
ఈ సందర్భంగా అసలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న బస్సులను ఉచిత ప్రయాణ పథకానికి ఉపయోగిస్తామన్నారు. బస్సుల సమయం, సిబ్బంది డ్యూటీ విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. త్వరలో 1,050 కొత్త బస్సులు రానున్నాయి. ప్రతీ ఏడాది కొత్త ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
ALSO READ: శ్రీవారి భక్తులకు గమనిక.. ఇకపై ఏ రోజుకు ఆ రోజే దర్శనం టికెట్లు
ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలో అన్ని బస్‌స్టేషన్లను ఆధునికీకరించినట్టు వెల్లడించారు. కేబినెట్ సమావేశం తర్వాత ఈ స్కీమ్ విధివిధానాలపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. కొన్నాళ్లుగా ఆర్టీసీ ఛైర్మన్, ఆర్టీసీ ఎండీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఉచిత బస్సు పథకంపై సమీక్షలు చేస్తున్నారు. ఇలాంటి పథకం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అమలు చేశాయి. అప్పుడు ఎదురైన ఇబ్బందులను వివరించారు. ఈ విషయంలో ప్రయాణికులపై సిబ్బంది ఎప్పటిమాదిరిగా ఉండాలని సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఇదిలా ఉండగా ‘స్త్రీ శక్తి’ పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో ఫ్రీ బస్సుకు సంబంధించి ముద్రించిన జీరో టికెట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరుతోపాటు డిపో పేరు, స్త్రీ శక్తి వంటివి అందులో ఉన్నాయి. టికెట్ ధర ఎంత అని చెబుతూనే, ప్రభుత్వ రాయితీ జీరో రూపాయలుగా ముద్రించారు.