Tsunami Warning: భారీ భూకంపం. రష్యా- జపాన్- అమెరికాతో పాటు మొత్తం 30 దేశాలు గజ గజ. పెద్ద ఎత్తున అలలు తీరాన్ని తాకుతుండటంతో భారీ తిమింగలాలు ఒడ్డున పడుతున్న దృశ్యం. జనం సురక్షిత ప్రాంతాలకు పరుగులు. ఇంతకీ ఈ భూకంప తీవ్రత చరిత్రలో ఎన్నోది? న్యూ బాబా వంగా చెప్పిన జోస్యం నిజమైనట్టేనా? అసలేంటీ సునామీలకు ప్రధాన కారణం.. ప్రస్తుత భూకంపం ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు తలెతతాయి? సునామీ పోటెత్తిన ప్రారంభ దృశ్యాలు దేశాల వారీగా ఎలా ఉన్నాయి? ఆ వివరాలేంటి?
రష్యా భూకంప తీవ్రత చరిత్రలో 6వదిగా గుర్తింపు
ఇవి మచ్చుకు కొన్నంటే కొన్ని భూకంత తీవ్రతల వివరాలు. చరిత్రలో ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్తుత రష్యా భూకంప తీవ్రత చరిత్రలోనే ఆరోదిగా తెలుస్తోంది. అలాగని దీని ప్రభావం ఏమంత తక్కువగా లేదు. దీనంతటికీ కారణమేంటని చూస్తే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భారీ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్ధలవడం వంటి ఘటనలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్లో ఉన్న రష్యా కామ్చాట్కా ద్వీపకల్పం దగ్గర జూలై 29న రిక్టర్ స్కేల్ పై 8. 8 తీవ్రతతో భూమి కంపించడంతో.. పసిఫిక్ తీర దేశాలంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున అలలు ఎగసి పడ్డాయి.
రష్యా కురిస్క్ పట్టణాన్ని ఊపేసీన హెచ్చరికలు
రష్యాలోని సెవరో కురిస్క్ పట్టణాన్ని సునామీ ముంచెత్తిందని ఆ దేశ ఎమర్జెన్సీ విభాగం ప్రకటించింది. 2 వేల మంది జనాభా గల ఈ చిన్న పట్టణంలో సునామీకి చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతూ ప్రపంచ వ్యాప్త జనాభాను భయకంపితులను చేస్తున్నాయి. ఇటు రష్యన్ ఎమర్జెన్సీ విభాగం మాత్రమే కాదు.. అటు యూఎస్ జియోలాజికల్ సర్వే సైతం హెచ్చరించింది. దీంతో 30 దేశాలకు సునామీ టెన్షన్ పట్టుకుంది. జపాన్ లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూప్రకంపనల కారణంగా పెట్రోపావ్లోస్కీ, కమ్చాట్కా నగరాల్లోని భవనాలు కంపించాయి. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు దీశారు. కమ్చాట్కా ప్రాంంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. అత్యవసర సేవల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకడంతో.. హోనోలులులో సునామీ హెచ్చరికలకు చెందిన సైరన్లు మారు మోగాయి. భయాందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న దృశ్యం కనిపించింది. స్థానిక గవర్నర్ లిమారెంకో ప్రకారం చెబితే.. సునామీ మొదట రష్యాలోని కురిల్ దీవులలోని తీర ప్రాంతాన్ని తాకింది. ఇక్కడి ఓడరేవు మునిగిపోయినట్టు తెలుస్తోంది..
నీటి మధ్యలో ఉండాల్సిన తిమింగలాలు ఒడ్డుకు
జపాన్ లోనూ 3 మీటర్ల వరకూ రాకాసి అలలు ఎగసి పడుతున్నాయని.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఎవరూ సముద్రం వైపునకు వెళ్లొద్దన్న హెచ్చరికలు జారీ చేసింది జపాన్. ప్రస్తుత సునామీ కారణంగా ఆస్తినష్టం భారీ ఎత్తున సంభవించినట్టు తెలుస్తోంది. జపాన్ లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్ గా మారాయి. ఎందుంకటే సముద్రంలో కల్లోల తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి వచ్చి పడ్డాయి. రేడియేషన్ లీకేజీతో పుకుషిమా డయీచీ అణు కేంద్రం నుంచి ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టొకచాయ్, ఎరిమో, థోకు, కాంటో, హన్సంకీ, ఇషినోమోకి వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున అలలు ఎగసిపడ్డట్టు వార్తలందాయి. ఇక తీర ప్రాంతంలోని జపాన్ ఎయిర్ పోర్టులకు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్- సెండాయ్ విమానాశ్రయాన్ని మూసి వేశారు. ఈ ప్రాంతానికొచ్చే ఫ్లయిట్స్ దారి మళ్లించారు. మొత్తంగా జపాన్ తీర ప్రాంతాల్లోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
US హావాయి మొత్తనికి సునామీ హెచ్చరిక
చైనాకు కూడా ఈ విపత్తు ముప్పు పొంచి ఉండటంతో షాంగైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను వెంటనే నిలిపి వేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలోనూ ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హావాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయ్యింది. అలలు పెద్ద ఎత్తున ఎగసి పడ్డాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు మోగాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లడం కనిపించింది. ఒక్కసారిగా రాష్ట్రమంతా తరలి వెళ్తుండటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ దృశ్యాలు కనిపించాయి. రోడ్లన్నీ కార్లతో నిండిపోయి కనిపించాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలకు అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. ఫోటోల కోసం అనవసరంగా తీరానికి వెళ్లొద్దంటూ అమెరికా వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ఒక్క అలతో సునామీ రాదని.. పెద్ద ఎత్తున అలలు వస్తూనే ఉంటాయని.. ఈ సందర్భంగా సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిణామం పెద్ద ఎత్తున ఉంటుందని తన హెచ్చరిక ద్వారా తెలియ చేసింది.
ఒరేగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ ఎఫెక్ట్
తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం స్పందించారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది కాబట్టి.. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవల్సిందిగా సూచించారాయన. అంతే కాదు అధికారుల సూచనలు ఎప్పటికిప్పుడు పాటించాలని హెచ్చరించారు. ఇటు హవాయితో పాటు చిలీ, సోలేమన్ దీవులు, అలస్కా, ఒరేగాన్, వాషింగ్టన్లోని కొన్ని ప్రాంతాలకు కూడా సునామీ తాకే అవకాశం ఉండటంతో అధికార గణం అప్రమత్తమైంది. అసలేంటీ సునామీ? దీనికా పేరు ఎలా వచ్చింది? భూకంపం సునామీగా ఎలా రూపాంతరం చెందుతుంది. ప్రస్తుత సునామీ గురించి న్యూ బాబా వంగా ఎలా అంచనా వేయలిగింది? ఇప్పటి వరకూ వచ్చిన భూకంపాల చరిత్ర ఏంటి? వాటి ద్వారా సునామీల ఎంత భారీ నష్టం వచ్చేలా చేశాయి? వీటిలో పెద్దవి ఏవి? ఆ డీటైల్స్ ఏంటి? భూకంపాలు, అగ్నిపర్వతం బద్ధలైనపుడు.. సునామీలుసునామీ అనేది జపాన్ భాషకు చెందినది. దీనర్ధం ఏంటంటే హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడ్డపుడు రాకాసి అలలు ఒక్కోసారి వంద అడుగులకు పైగా ఎగుస్తాయి. ఈ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్ తో ఇది సమానం.
దెబ్బతిన్న పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్
2011 మార్చిలో జపాన్ తీరంలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తిమంత మైన భారీ భూకంపం సునామీకి కారణమైంది. ఈ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటె ఎక్కువ ఎగసి పడ్డాయి. ఈ విపత్తులో సుమారు 20 వేల మరణాలతో పాటు.. 2500 మంది ఆచూకీ లేకుండా పోయింది. లక్షా 20 వేల ఇళ్లు పూర్తి ధ్వంసం కాగా.. రెండున్నర లక్షలకు పైగా ఆవాసాలు దెబ్బ తిన్నాయి. పుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ కూడా దెబ్బ తినింది. దీంతో భారీ లీకేజీ సంభవించింది. కలుషిత నీటిని శుద్ధి చేసి తిరిగి సముద్రంలో విడుదల చేయడానికి చాలా సమయం పట్టింది. అయితే ప్రస్తుత సునామీ గురించి న్యూ బాబా వంగాగా పిలిచే.. రియో టాట్సుకీ జోస్యం చెప్పినట్టుగా పలు పుకార్లు షికార్లు చేశాయి. మొన్నటి ఐదో తేదీన ఈ ప్రమాదం తప్పిందని.. ఊపిరి పీల్చుకునేలోపు.. జూలై నెలాఖరున ఇంత భారీ భూకంపం విరుచుకుపడ్డంతో మళ్లీ కొత్త కథనాలు తెరపైకి వస్తున్నాయి. టాట్సుకీ జోస్యం తప్పలేదనీ.. 1999లో ఆమె రాసిన- ద ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకంలో జపాన్ సముద్రంలో భారీ భూకంపం వస్తుందని చెప్పారనీ అంటారు. అది సునామీకి కారణమవుతుందని అన్నారనీ.. అయితే ఆమె ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. కాబట్టి.. ఈ జోస్యం నిజమయ్యిందనే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
2004లో వచ్చే వరకూ సునామీ అంటే తెలీని జనం
నిజానికైతే 2004, డిసెంబర్ 26న హిందూ మహా సముద్ర తీర దేశాల్లో సునామీ విలయం సృష్టించే వరకూ మాములుగా దీని గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. అప్పుడే కాదు అంతకు ముందు తర్వాత కూడా భూకంపాలు, సునామీలు వాటి తీవ్రతలోని రికార్డులు పెద్ద ఎత్తున నమోదయ్యాయి. 1960.. చిలీలోని వాల్డివియాలో 9.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883.. ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డాయి. మొత్తం 36 వేల మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఇక 1896లో జపాన్- సాన్‌రికు లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల మేర అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22 వేల మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి.
అలస్కాలో 1958, జులై 9వ తేదీన మెగా సునామీ
చరిత్రలోనే అత్యంత ఎత్తైన మెగా సునామీ.. అలాస్కాలోని లిటుయా బే లో 1958, జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల మేర అంటే, 3వేల అడుగుల నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్‌బర్ట్ ఇంటెల్ ఉప నదిలోకి జారిపడ్డాయి. దీంతో 524 మీటర్లు అంటే సుమారు 1,720 అడుగుల అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే పెద్దది. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ దగ్గర కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ప్రాంతంలో జనం తక్కువగా ఉండటంతో ఇంతటి మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించడం గుర్తించాల్సిన విషయం. వీరంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం విశేషం.
Also Read: జగన్ సరికొత్త స్కెచ్!
25 వేల మందిని బలి తీస్కున్న భూకంపం
1868లో పెరూ- చిలీ మధ్య 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25వేల మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపింది. 1755లో పోర్చుగల్ లోని లిస్బన్ లో 8.5– 9.0 తీవ్రత మధ్య భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50వేల మంది మృతి చెందారు. యూరోప్ తో పాటు కరేబియన్ దీవులు, బ్రెజిల్‌ను ఈ సునామీ ప్రభావం తాకింది. అతి పెద్ద సునామీగా ఇది చరిత్ర పుటలకెక్కింది. ఇదీ సునామీలు, వాటికి కారణమైన భూకంప చరిత్ర. సముద్ర అడుగుభాగంలో వచ్చే భూకంపాలు లేదా అగ్ని పర్వతాలు బద్ధలైనప్పుడు.. సముద్ర నీరు చెల్లాచెదురవుతుంది. దీంతో పెద్ద ఎత్తున అలల ఎగసి పడతాయి. వీటి కారణంగా సునామీలు ఏర్పడతాయన్నది భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పే మాట. అయితే ఈ తీవ్రతను బట్టీ అలల ఎత్తు వాటి ఉధృతి ఆధారపడి ఉంటుందని అంటున్నారు సైంటిస్టులు.
Story By Adinarayana, Bigtv