Etela Rajender Future: కాళేశ్వరం అంశానికి సంబంధించి సొంత పార్టీలో మల్కాజ్‌గిరి ఎంపీఈటల రాజేందర్‌కు సెగ తగులుతుందా..? కాళేశ్వరo బిజెపి దృష్టిలో బీఆర్ఎస్‌కు ఏటీఎం అయినప్పుడు ఈటల దృష్టిలో అద్భుతం ఎందుకయింది..? కాళేశ్వరం అంశంతో ఈటల రాజేందర్ మళ్లీ కేసీఆర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? సొంత పార్టీ నేతలతో ఇమడలేక పార్టీ స్టాండ్‌కి భిన్నంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారా..?.. అసలు ఈ వ్యవహారిని సంబందించి ఈటల వైఖరిపై జరుగుతున్న చర్చేంటి?
కాళేశ్వరం అంశంలో ఈటల రాజేందర్ స్టాండ్ ఎటు వైపు?
కాళేశ్వరం అంశంలో ఈటల రాజేందర్ స్టాండ్ ఎటు వైపు..? కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా మారిందని ఆరోపిస్తున్న బీజేపీ వైపుకా..? లేకపోతే కాళేశ్వరం మహా అద్భుతం అంటున్న కేసీఆర్ వైపా?.. కేసీఆర్ సహా ఈటల కాళేశ్వరానికి కితాబులిస్తుంటే మేడిగడ్డ కుంగుబాటు ఎలా జరిగింది..? అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ఎలా కోతకు గురయ్యాయి..? ఈటల వ్యవహారం బీజేపీకి డ్యామేజీ కలిగిస్తుందా..? అన్న అంశాలు ఇటు బీజేపీలో, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి
బీజేపీ ఆరోపణలకు విరుద్దంగా ఈటల స్టేట్‌మెంట్లు
బీజేపీ అధిష్టాన పెద్దలకు రాష్ట్ర నేతలు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చారో ? ఏమో? కానీ రాష్ట్రానికి వచ్చిన ప్రతి నేత కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేసిందని ఆరోపణలు గుప్పించారు. ఆ దిశగా ప్రజలను నమ్మించడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఆ ఏటీఎంతో తెలంగాణ ఖజానా మొత్తం కాజేశారని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాల దగ్గర నుంచి రాష్ట్ర నేతల వరకు తెగ ఊదరగొట్టేశారు. కానీ తీరా అసలు సమయానికి ఈటల రాజేందర్ బీజేపీ నేతల ఆరోపణలను కొట్టి పారేసినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు
బీజేపీలో ఈటలపై పెరుగుతున్న వ్యతరేకత
కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చిన వివరణ ఆ పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. కమిషన్ ముందే కాదు ఈటల రాజేందర్ మీడియా ముందు కూడా కాళేశ్వరం ఏటీఎం కాదు, భేష్ అని కితాబిచ్చారు. కేసీఆర్ తరహాలో కాళేశ్వరం మహా అద్భుతం అంటూనే, అయితే దాని నిర్మాణంలో అధికారుల తప్పిదాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు సొంత పార్టీలోనే ఈటలపై వ్యతిరేకత పెరుగుతోంది.
బ్యారేజీలు కోతకు గురవ్వడంతో బయటపడిన డొల్లతనం
కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్, కాళేశ్వరం నిర్మాణానికి కర్త, కర్మా, క్రియా కేసీఆరే. వేల పుస్తకాలు చదివి కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణం చేపట్టినట్లు ఆ పార్టీ వారు చెప్పుకుంటున్నారు. అంతర్జాతీయ మీడియాలో సైతం కాళేశ్వరం గొప్పదనంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే మేడిగడ్డ కుంగుబాటు జరగడం, సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కోతకు గురవ్వడంతో ఆప్రాజెక్టులో డొల్లతనం బైట పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిషన్ నియమించింది. అదే ఇప్పుడు కేసీఆర్ అండ్ కో కు మింగుడు పడటం లేదు.
కమిషన్ ముందు నీళ్లు నములుతున్న కేసీఆర్ టీమ్
కాళేశ్వరoపై అంత గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అండ్ కో కంపెనీ కమిషన్ ముందు జవాబులు చెప్పడానికి నీళ్ళు నమలడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం నిర్మాణం అధికారుల తప్పిదమేనని, అంతా కేబినెట్ నిర్ణయమని కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్లు చెపుతుండటం.. తప్పిదాలు జరగాయనడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.
ఈటల పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని మండిపాటు
ఆదటుంచితే కాళేశ్వరం ఎపిసోడ్ లో ఈటల రాజేందర్ వ్యవహారం బీజేపీకి తలవంపులు తెచ్చిపెడుతుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా పనిచేసిందని బీజేపీ నాయకత్వం ఆరోపిస్తుంటే.. ఆపార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఈటల రాజేందర్ మాత్రం విరుద్ధంగా వెళ్తున్నారని, పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరంపై ఈటల రాజేందర్ కామెంట్స్ ను, ఆయన తీరును ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిప్పి కొట్టారు. కాళేశ్వరం ప్రజలకు ఉపయోగపడేది కాదని, ఆది కేవలం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని మరోసారి తేల్చిచెప్పారు. కిషన్ రెడ్డే కాదు టోటల్ పార్టీ మొత్తం వన్ సైడ్, ఈటల ఒక్కరు ఒక సైడ్ అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి.
ఈటల మళ్లీ కేసీఆర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా?
ఆ క్రమంలోఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేక, పార్టీలో పాత నేతల ఎత్తుగడలను ఎదుర్కోలేక మెల్లిగా కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీలో పొమ్మనలేక తనకు పొగ పెడుతున్నారనే విషయం ఈటల పసిగట్టరన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కాళేశ్వరాన్ని బీజేపీ ఏటీఎంతో పోలిస్తే, అందుకు విరుద్ధంగా ఈటల మాత్రం కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ కితాబు ఇచ్చారనే చర్చ సొంత పార్టీతో పాటు, రాజకీయ వర్గాల్లో మొదలైంది.
Also Read: ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ వాడితే.. ఇరాన్ టెహ్రాన్ ఖాళీ చేయాల్సిందేనా? బాంబుల్లోనే బాహుబలి!
బీజేపీ ఆరోపణలు అబద్దమని ఫోకస్ చేసిన ఈటల
కాళేశ్వరంపై ఈటల వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర నాయకత్వానికి అస్సలు నచ్చడం లేదంటున్నారు. ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అండ్ బ్యాచ్ బండారం బయట పెడతారని రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. మీడియా సమావేశాల్లో కూడా పార్టీ నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాల అంచనాలకు భిన్నంగా ఈటల తీరు వ్యవహరించారు. కాళేశ్వరంపై బీజేపీ ఆరోపణలను ఒక అబద్ధ ప్రచారంగా ఈటల ఫోకస్ చేసి, ఆ పార్టీని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టారని ఈటల రాజేందర్ పై పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. మొత్తం మీద ఇన్నాళ్లు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఈటల రాజేందరే, తెలంగాణలో బీజేపీకి ఈటల సారథ్యంలో భవిష్యత్తు అన్న ప్రచారం జరిగింది. అయితే కాళేశ్వరంపై పార్టీ స్టాండ్‌తో వ్యతిరేకించిన ఈటల బీజేపీలో తన ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Story By Apparao, Bigtv Live