సాధారణంగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఇలాంటి నిబంధనలను పెద్దగా పాటించకపోయినప్పటికీ, ఇప్పుడిప్పుడు వీటి పట్ల అవగాహన చాలామందిలో పెరుగుతోంది. ముఖ్యంగా లావాదేవీలు అన్నీ కూడా డిజిటల్ రూపంలోకి మారుతున్న నేపథ్యంలో, ఇంటి యజమానులు సైతం తమకు లభించే రెంట్ ను చట్టబద్ధంగా తీసుకునేందుకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఇళ్లను అద్దెకు ఇచ్చి అద్దె వసూలు చేసినట్లయితే భవిష్యత్తులో ఐటీ రిటర్న్స్ విషయంలో సమస్యలు తలయితే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అటు ఇంటి యజమాని, అలాగే ఇంటి అద్దె దారుడు పరస్పరం రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు.
అయితే సాధారణంగా రెంటల్ అగ్రిమెంట్ అనేది 11 నెలల కాలానికి మాత్రమే చేసుకోవడం చాలా మంది గమనించి ఉండవచ్చు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా రెంటల్ అగ్రిమెంట్లో చాలామంది 11 నెలల కాల వ్యవధికి అగ్రిమెంట్ చేసుకుంటారు. 11 నెలల కాల వ్యవధి ముగిసిన తర్వాత కిరాయిదారుడు ఆ ఇంట్లో కొనసాగాలి అనుకున్నట్లయితే, మళ్లీ 11 నెలలకు అగ్రిమెంట్ చేసుకుంటారు. అయితే ఇలా రెంటల్ ఒప్పందాన్ని 11 నెలలకు ఒకసారి రెగ్యులరైజ్ చేసుకోవడం వెనుక ఒక మతలవు ఉంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.
సాధారణంగా రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ అనేది 12 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం ఉన్నట్లయితే, ఆ రెంటల్ అగ్రిమెంట్ స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే మీ రెంటల్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాల పరిధిలో ఒప్పందం కనుక కుదుర్చుకున్నట్లైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. అయితే ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం సాధారణంగా సంవత్సరం రెంటులో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే స్టాంపు డ్యూటీ మరో రెండు శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి యజమానికి, కూడా భారం పెంచే అవకాశం ఉంది. ఈ కారణంగా 11 నెలలకు ఒకసారి ఇంటి అద్దె అగ్రిమెంట్ రెన్యువల్ చేయించుకోవడం ఉత్తమమని భావిస్తుంటారు.
అయితే ఈ విధంగా చేయడం చట్టపరంగా నేరమా అనే సందేహం కలగవచ్చు. నిజానికి 11 నెలల అదే ఒప్పందం చేసుకొని ఆపైన రిజిస్ట్రేషన్ చార్జీలను తప్పించుకోవడం అనేది నిజానికి చట్ట వ్యతిరేక చర్య కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది కేవలం యజమాని, కిరాయిదారుడు ఇతర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ విధంగా చేసుకునే ఒక వెసులుబాటు మాత్రమే. అయితే రెంటల్ అగ్రిమెంట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా రెంటల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ వల్ల ఇంటి యజమానికి చట్టపరంగా పూర్తి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తులో ఏవన్నా వివాదాలు తలెత్తినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒక కీలకమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాదు రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల మీ రెంటల్ అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలకు ఒక చట్టబద్ధత అనేది లభిస్తుంది. . అలాగే మీ ప్రాపర్టీ పైన హక్కులను కాపాడుకునేందుకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది.