Big Stories

Karnataka CM: కౌన్ బనేగా సీఎం?.. డబుల్ ఇంజిన్‌కు ‘జోడెద్దుల బండి’తో చెక్..

- Advertisement -

Karnataka CM: ఒకరు మాస్ లీడర్. ఇంకొకరు ట్రబుల్ షూటర్. ఒకరు మాజీ సీఎం. మరొకరు పీసీసీ చీఫ్. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఆ ఇద్దరే ప్రధాన కారణం. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలు, సభలు పార్టీకి బూస్ట్ ఇవ్వగా.. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు.. పార్టీని పదడుగులు ముందుంచాయి. గెలుపు గుర్రాలన్నిటినీ జాగ్రత్తగా దౌడు తీయిస్తూ.. రథసారధులుగా ఉండి.. కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చింది మాత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లే.
బీజేపీది డబుల్ ఇంజిన్‌ సర్కార్ అయితే.. కాంగ్రెస్‌ది జోడెద్దుల (సిద్దు-డీకే) బండి అనేది కాంగ్రెస్‌ కౌంటర్‌. ఇదే ఇప్పుడు మరో సమస్యను తెచ్చిపెట్టేలా ఉంది. రాజస్థాన్ పరిస్థితి తీసుకొచ్చేలా ఉంది. ఆ ఇద్దరులో ఎవరు సీఎం అవుతారనేది మరింత ఉత్కంఠ రేపుతోంది. ఫలితాల కంటే కూడా కౌన్ బనేగా సీఎం.. అనేదే టెన్షన్‌కు గురి చేస్తోందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

- Advertisement -

సోమవారం కంఠీరవ స్టేడియంలో కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. మరి, సీఎం పదవి చేపట్టేది ఎవరు? సోమవారమే డీకే శివకుమార్ పుట్టినరోజు కూడా. అదే రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటున్నారంటే? డీకేకు బర్త్ డే గిఫ్ట్‌గా సీఎం పోస్ట్ ఇస్తారా? పీసీసీ చీఫ్‌కే ముఖ్యమంత్రి కిరీటం పెడతారా? లేదంటే, అనుభవానికే ఓటేసి సిద్ధరామయ్యకే మరోసారి సీఎం ఛాన్స్ ఇస్తారా? ఇలా పార్టీ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ.

పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉన్నా.. ఎన్నికలు వచ్చేసరికి ఆ ఇద్దరు ఐకమత్యంతో పని చేశారు. పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో.. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే సమర్థవంతంగా వ్యవహరించారు. శివకుమార్ సామర్థ్యం తెలిసే.. ఆయన్ను భయపెట్టాలని కూడా చేసింది కేంద్రం. వరుస ఐటీ దాడులతో దడదడలాడించింది. అయినా, డీకే అదరలేదు, బెదరలేదు. మరింత కసితో కాంగ్రెస్ కోసం పని చేశారు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపారు. ఒకప్పుడు 2013లో శివకుమార్‌కు కొన్నినెలల పాటు కేబినెట్‌లో ఛాన్సే ఇవ్వలేదు సిద్ధరామయ్య. అలాంటి వారిద్దరు ఇప్పుడు కలిసిపోయి.. సీఎం రేసులో కలిసికట్టుగా దూసుకుపోతుండటం ఆసక్తికరం.

సిద్ధరామయ్య అనుకూలతలెన్నో..
కర్నాటక అంటే యడియూరప్పనే గుర్తుకొస్తారు చాలామందికి. ఆయనకు సమానమైన ఇమేజ్ ఉన్న నాయకుడు సిద్ధరామయ్య. గతంలో సీఎంగా చేసిన అనుభవం. సర్వేల్లోనూ సీఎంగా సిద్ధరామయ్యకే జై కొట్టారు ప్రజలు. కురబ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం అదనపు బలం. మోదీ దూకుడుకు కర్నాటకలో అడ్డుకట్ట వేయగల సత్తా ఉన్న నేతగా ప్రచారం. అయితే రాష్ట్రంలో అత్యంత బలమైన లింగాయత్, వక్కలిగ‌ సామాజిక వర్గాలు సిద్ధరామయ్యను సీఎంగా ఒప్పుకోకపోవచ్చు.

‘ఢీ’కే శివకుమార్..
ఇక కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌.. ఏకంగా వరుసగా ఎనిమిదిసార్లు ఓటమి ఎరుగని నేత. కర్నాటక కాంగ్రెస్‌లో ట్రబుల్‌ షూటర్. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, సన్నిహితుడు. వక్కలిగ సామాజిక వర్గం కావడం కలిసొచ్చే అంశం. కర్ణాటకలోనే అత్యంత సంపన్నుడైన నాయకుడు. అందుకే, డీకేపై సీబీఐ, ఈడీ, ఐటీలు వరుసపెట్టి దాడులు చేశాయి. కేసుల చక్రబంధనంలో బిగించాయి. 104 రోజులు తిహార్ జైల్లోనూ ఉన్నారు. ఇప్పుడు సీఎం రేసులో నిలిచారు.

సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇద్దరూ ఇద్దరే. లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే సిద్ధరామయ్య సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. డైనమిక్ లీడర్ కావాలనుకుంటే డీకేకు జై కొడతారని తెలుస్తోంది. మరి, కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని సీఎం చేస్తుందో?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News