అతిశి పగ్గాలు చేపట్టిన సందర్భంగా బీజేపీ దాడిని మరింత తీవ్రతరం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని బిజెపి విమర్శించింది. కేజ్రీవాల్ సీఎం పదవి నుండి వైదొలగడం చీప్‌గా ప్రజాదరణ పొందే ప్రయత్నమని, ఈ మార్పు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ భవితవ్యాన్ని మార్చలేదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని, తాజాగా ఇచ్చిన బెయిల్‌ను వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే, కేజ్రీవాల్‌పై కోర్టు విధించిన ఆంక్షలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇందులో అధికారిక విధులు నిర్వహించడం, సీఎం కార్యాలయానికి హాజరుకావడం, అవినీతికి సంబంధించిన విషయాలపై వ్యాఖ్యానించడం వంటి నిషేధాలు ఉన్నాయి. కాగా, ముఖ్యమంత్రిగా పేరు తప్ప ఏమీ చేయలేని కేజ్రివాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. .
అయితే, అతిశి ఢిల్లీకి సీఎంగా ఎన్నుబడిన వెంటనే బీజేపీ అతిశిపై ఆరోపణలు మొదలుపెట్టారు. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు, ఆప్ రెబల్, రాజ్య సభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా అతిశిపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ఎంపిక చేయాలనే ఆప్ నిర్ణయం తర్వాత, స్వాతి మలివాల్ ఆ పార్టీని విమర్శించారు. 2001లో పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీయ్యొదంటూ అతిశి తల్లిదండ్రులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఉగ్రవాది అఫ్జల్ గురు కోసం క్షమాభిక్ష పిటిషన్‌పై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్న అతిశి తల్లిదండ్రులు సంతకం చేసారని అన్నారు. తీవ్రవాది అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన కుటుంబానికి చెందిన మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం బాధాకరమని స్వాతి మలివాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. తీవ్రవాది అఫ్జల్ గురును కాపాడాలని అతిశి తల్లిదండ్రులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు రాశారని తెలిపారు. అతిశి డమ్మీ సిఎం అయినప్పటికీ, ఈ సమస్య జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను లేవనెత్తుతుందని మలివాల్ ఆరోపించారు. అయితే, అతిశి ఇలాంటి విమర్శలను తిప్పికొట్టగలదనే ధీమా ఆప్‌లో లేకపోలేదు.
ఇప్పుడు, ఇన్ని విమర్శలు, ఆరోపణల మధ్య ఢిల్లీ సీఎంగా అతిశి నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి ఉంది. విమర్శలను దాటుకుంటూ ఈ కొత్త సిఎం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలి. తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో అధికారాన్ని నిలుపుకునే పార్టీ అవకాశాలను కాపాడాల్సి ఉంటుంది. ‘కేజ్రీవాల్ పాలనా విధానాన్ని కూడా బలపరచగలగాలి. ఎందుకంటే, ఆప్ ప్రజాకర్షక అజెండా దేశ రాజధానిలో పార్టీ గెలుపుకు బాగా పనిచేసింది. పొరుగునున్న పంజాబ్‌లో అధికారంలోకి రావడానికి కూడా అది తోడ్పడింది. అయితే, ఈ నాలుగు నెలల కాలాన్నే అతిశి అత్యంత వేగంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క తప్పటడుగు వేసినా అది పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, కేజ్రివాల్ జైలుకు వెళ్లక ముందు ప్రకటించిన కొత్త పథకాలను అమలు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పథకాలను తక్కువ పరిమితులతో సరిదిద్దాల్సి ఉంది. ఈ కొత్త పథకాల అమలు, పలు కీలక పథకాల పొడిగింపునకు కేబినెట్ ఆమోదం అవసరం కాగా, అతిశితో అవన్నీ చేయించాలని కేజ్రివాల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..
ఇప్పటికే, ఆప్ ప్రభుత్వం మహిళలకు అందించే వెయ్యి రూపాయలన స్టైఫండ్ ఇంకా క్యాబినెట్ ఆమోదం, ఇతర ఆమోదాలు పొందలేకపోవడంతో నిలిచిపోయింది. అలాగే, గవర్నమెంట్ జాబ్ పోర్టల్, విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల కోసం ప్రీమియర్ ప్రైవేట్ సెంటర్‌లలో ఉచిత కోచింగ్ పొందగలిగే పథకం, ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే అందజేయడం వంటి అనేక ఇతర పథకాలు కూడా వివిధ కారణాల వల్ల నిలిచిపోయాయి. సంవత్సరాలుగా ఆప్ రాజకీయాలు హిందూత్వ, జాతీయవాదంతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ, పార్టీకి ఎన్నికల్లో విజయం రావడానికి ఈ సంక్షేమ పథకాలు, ప్రజల అనుకూల విధానాలే కారణం. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో భాగంగా ఉన్న రోజుల నుండి ప్రస్తుతం ఆప్ నాయకులు ఫాలో అవుతున్న ఫార్ములా ఇది. అందుకే, దీనికి ఎలాంటి విఘాతం కలగకుండా కేజ్రివాల్ ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
2020లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందు, ఆప్ ప్రభుత్వం మహిళలకు బస్సు ప్రయాణాలు ఉచితం అని ప్రకటించింది. ఎన్నికల ముందు దానిని అమలు చేసింది. “నేను పని చేసి ఉంటే, నాకు ఓటు వేయండి” అనేది నాటి ప్రచార సమయంలో కేజ్రీవాల్ ప్రధాన స్లోగన్. అప్పటి నుండి పార్టీ వివిధ రాష్ట్రాల్లో తన మేనిఫెస్టోలలో ఇలాంటి ఎన్నో పథకాలను ప్రకటించింది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆధ్వర్యంలో వాటిలో కొన్నింటిని కూడా అమలు చేసింది. అయితే, మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి, ఆప్ అజెండాను పూర్తి చేయడానికి ఈ కొత్త సీఎం ఆప్‌కి అత్యవసరం అయ్యింది. అయితే, క్యాబినెట్ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి అవసరం కాబట్టి, దీన్ని నయా సీఎం అతిశి ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సి ఉంది.