సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్ అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనూ బొత్స.. తనదైన మార్క్ రాజకీయం చేస్తున్నారట. ఉప్పూ.. నిప్పులా మారిన ప్రస్తుత రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఆ నేత దూసుకుపోతూ.. ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీలో బొత్స మార్కు రాజకీయం చూసిన వారంతా.. ఇది కదా సీనియారిటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయన స్టైలే వేరంటూ చర్చించుకుంటున్నారట.
ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా బొత్స సత్యనారాయణ పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి, పీసీసీ సారథిగా పనిచేసిన బొత్స..ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైసీపీకి..శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో.. మండలిపైనే ఫ్యాన్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మండలిలో కూటమి ప్రభుత్వాన్ని.. వైసీపీ ఢీ కొట్టాల్సిన పరిస్ధితి. కూటమి సభ్యుల ఎత్తుకు.. పైఎత్తులు వేస్తేనే కానీ.. అక్కడ మాట్లాడలేని పరిస్థితిలో బొత్స సమర్థంగా పనిచేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని ఎదురొడ్డి.. పార్టీ వాయిస్‌ను బలంగా తీసుకువెళ్లే బాధ్యతను.. వైసీపీ అధినేత జగన్.. బొత్స సత్యనారాయణకు అప్పగించారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించే.. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని తప్పించి.. బొత్సకు ప్రతిపక్ష నేత హోదా అప్పగించారట. అనూహ్యంగా ప్రతిపక్ష నేత హోదా దక్కించుకున్న బొత్స.. ఇప్పుడు తనదైన మార్కు పాలిటిక్స్‌తో అందర్నీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
ఏపీలో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో రాజకీయాలు మారాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, పార్టీల్లో ఉన్న పరిస్ధితుల్లో.. ఇద్దరు వేరే పార్టీలకు చెందిన నేతలు ఎక్కడ ఎదురైనా పలకరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఐదేళ్లలో వైసీపీ.. కూటమినేతలపై తీవ్ర అణచివేత సాగించిందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్షాలు.. రాజకీయ ప్రత్యర్థులమన్న సంగతి మరిచిపోయి వ్యక్తిగత శత్రువులుగా మారిపోయారే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రతిపక్షనేత హోదాలో వైసీపీలో కేబినెట్ హోదా దక్కించుకున్న బొత్స.. తనదైన మార్క్ రాజకీయం చేస్తూ.. పార్టీ వాయిస్ వినిపించటంలో సక్సెస్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. అవకాశం ఉన్న మండలిలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా బొత్స చూస్తున్నారని.. సొంత పార్టీలోనే చర్చ సాగుతోందట.
Also Read: తిరుపతిలో క్యాంప్ పాలిటిక్స్ షురూ.. గెలుపెవరిది?
తాజాగా.. బొత్స సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలతో సామరస్యంగా మెలగడం చర్చనీయాంశంగా మారిందట. ఇటీవల మంత్రులను.. బొత్స కలిసిన విధానం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి.. బొత్సను కలిసి ఆశీస్సులు తీసుకున్నారనే రచ్చ నడిచింది. దానిపై సదరు మంత్రితో పాటు బొత్స కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితి. మండలి సమావేశాల సందర్భంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పలకరించిన విధానం కూడా.. రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ఎట్ హోం కార్యక్రమానికి వెళ్లి మంత్రి లోకేశ్‌తో.. బొత్స సత్యనారాయణ ముచ్చటించడం..రాజకీయ వర్గాల్లో ఆశ్చర్య కలిగించిందట.
వైసీపీలో.. సామరస్యంతో పనిచేయడంతో పాటు.. సందర్భానుగుణంగా నడుచుకోవడం బొత్సకు మాత్రమే చెల్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి నేతలపై పరుషంగా మాట్లాడితే జగన్‌కు నచ్చుతుందనే భావనలో చాలామంది నేతలూ ఉన్నారు. దీంతో ఇష్టానుసారంగా మాట్లాడి.. గత ఎన్నికల్లో ఓటమికి వారు కూడా కారణంగా మారారనే టాక్ పొంత పార్టీలో ఉంది. అలాంటి నేతలు.. గత ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్న వైసీపీ కార్యకర్తలకు.. సీనియర్ నేత బొత్స మార్కు రాజకీయం ఆకర్షిస్తోందనే టాక్ వినిపిస్తోంది.