Indian Railways: దేశ వ్యాప్తంగా రైలు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఆటోమేటిక్ రైల్వే ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్ ను ఏర్పాటు చేసింది. కవచ్ వ్యవస్థను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) అభివృద్ధి చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ముఖ్యమైన రైల్వే రూట్లలో ఏర్పాటు చేసింది. అన్ని రూట్లలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నది.
అందుబాటులోకి కవచ్ 4.0 వెర్షన్
కవచ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నది రైల్వే సంస్థ. ప్రస్తుతం అత్యాధునిక కవచ్ 4.0ను ఇన్ స్టాల్ చేస్తున్నది. రీసెంట్ గా తాజా వెర్షన్ ను తెలంగాణలోని సనత్ నగర్ – వికారాబాద్ సెక్షన్‌లో 63 కిలో మీటర్ల మేర విజయవంతంగా అమలు చేశారు. మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 1,465 కిలో మీటర్ల మేర అమలు చేశారు. సౌత్ సెంట్రల్ పరిధిలోని 144 రైలు ఇంజిన్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కారణంగా రైల్వే ప్రమాదాలు గణనీయంగా తగ్గనున్నాయి. రైల్వే అభివృద్ధితో పాటు ఆటోమేటిక్ రైల్వే రక్షణ వ్యవస్థ భద్రతను మరింత పటిష్టం చేయనుంది.
కవచ్ వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే?
అనివార్య కారణాలతో లోకో పైలట్ రైలును కంట్రోల్ చేయలేకపోతే, కవచ్ వ్యవస్థం ఆటోమేటిక్ గా రైలును కంట్రోల్ చేస్తుంది. బ్రేకులు వేసి ఆపేస్తుంది. లోకోమోటివ్‌ల మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ద్వారా మూవ్‌మెంట్ అథారిటీ, లెవెల్ క్రాసింగ్‌ల దగ్గర ఆటో విజిల్, రియల్ టైమ్ అప్ డేట్స్ అందించడం ద్వారా భద్రతను మెరుగుపరుస్తుంది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు కవచ్ సిస్టమ్ అత్యవసర SOS ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది.. ఇది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తుంది.
దేశ వ్యాప్తంగా 10 వేల లోకోమోటిల్ లలో కవచ్ 4.0 వెర్షన్ ను అమర్చనున్నారు. ఈ అప్ గ్రేడ్ వెర్షన్ రైల్వే ఆపరేషన్స్ ను మరింత మెరుగుపరుస్తుంది. అదే సమయంలో సురక్షితంగా మార్చుతుంది. కవచ్ తాజా వెర్సన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో సనత్ నగర్-వికారాబాద్ లో అందుబాటులోకి తీసుకురాగా, అంతకు ముందు వెర్షన్, నాగర్ సోల్- ముద్ఖేడ్, సికింద్రాబాద్-కర్నూల్, బీదర్- పర్భానీతో సహా ఇతర ప్రాంతాలో విస్తరించారు.
గర్వించదగ్గ భారతీయ ఆవిష్కరణ
‘కవాచ్ 4.0’ వెర్షన్ పరీక్షను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు. ఇది దేశం గర్వించదగిన ఆవిష్కరణగా ఆయన అభిప్రయాపడ్డారు. ఈ లెటెస్ట్ వెర్షన్ హుబ్బల్లి డివిజన్ లో 564 కి.మీ, బెంగళూరు డివిజన్ లో 789 కి.మీ, మైసూర్ డివిజన్ లో 689 కి.మీలో ఏర్పాటు చేశారు. కవచ్ టెక్నాలజీ, రైల్వే ట్రాక్‌లు, స్టేషన్‌లు, లోకోమోటివ్‌లపై ఇన్‌స్టాల్ చేయబడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ని ఉపయోగించుకుంటుంది. RFID సెన్సార్లు ట్రాక్ వెంబడి ప్రతి కిలోమీటరుకు ఉంచుతారు. సెన్సార్ ఫెయిల్ అయినప్పుడు అంతరాయం లేకుండా పనిచేయడానికి బ్యాకప్ వ్యవస్థలు ఉంటాయి. రెండు RFIDలు ఫెయిల్ అయితే రైలు ఆటోమేటిక్ గా ఆగిపోతుంది.లోకోమోటివ్‌లు, స్టేషన్ కంట్రోల్ రూమ్‌లకు రియల్-టైమ్ హెచ్చరికలు అందుతాయి. లోకో పైలట్ జోక్యం లేకుండా కూడా, అదే ట్రాక్‌లో మరొక రైలు గుర్తించబడితే రైలును ఆటోమేటిక్ గా ఆపేస్తుంది. RFID సిగ్నల్ ఉపయోగించి పొగమంచు, తక్కువ విజుబులిటీ ఉన్న పరిస్థితుల్లో రైళ్లు నడిచేలా ఉపయోగపడుతుంది. 2026 నాటికి దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే భావిస్తోంది.
Read Also: రైల్వేకు ఝలక్.. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలంటూ ప్రయాణీకుడు డిమాండ్!