జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతగా వైసీపీని స్థాపించి దాదాపు పదిహేనేళ్లు అవుతుంది. 2011 మార్చిలో సొంత కుంపటి పెట్టుకున్న జగన్ మూడు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని ఒకసారి అధికారం కూడా చెలాయించారు. అదీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఏపీలో ఇక తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించారు . అలాంటి పార్టీకి ఇంత కాలం తర్వాత బాలారిష్టాలు మొదలయ్యాయి. వివిధ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నడిపించే నాయకుడు కరువవుతున్నారు .
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లా వైసీపీలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై ఘోర పరాజయానికి గురవ్వడంతో కుంగిపోతున్న వైసీపీ నేతలకు కేసుల భయం మరింత ఆందోళనకు గురిచేస్తుందంట. అది ఎంతలా అంటే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన ఐదు నియోజకవర్గాలకు ఇన్చార్జులు దూరమయ్యారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ కేడర్‌కే అంతుపట్టడం లేదంట. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కృష్ణాజిల్లా లో కీలకమైన అధ్యక్ష బాధ్యతలను జగన్ పార్టీ సీనియర్ నేతైన పేర్ని నానికి ఏరికోరి అప్పగించారు.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటి, ఇప్పుడు పేర్ని నాని రేషన్ బియ్యం స్కాంలో ఇరుక్కోవడం, అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలకు సంబంధించి వివాదాలు పెద్ద ఎత్తున ఆయన్ను చుట్టు ముట్టడంతో పార్టీ పిలుపునిచ్చిన కార్య క్రమాలకు సైతం దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు పార్టీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన రైతు సమస్యలతో పాటు విద్యుత్తు చార్జీలకు పెంపుదలకు వ్యతిరేకంగా చేపట్టి ఆందోళనల్లో జిల్లాలోని అయిదు నియోజకవర్గాల నేతలు పాల్గొనలేదు . దాంతో అసలే అధికారం కోల్పోయమని కుంగిపోతున్న కేడర్ నడిపించే నాయకుడు కూడా లేకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు.
జిల్లాల్లో కీలకమైన 5 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు సైతం అందుబాటులో లేకపోవడం, జిల్లా పార్టీ అధ్యక్షుడు కేసుల్లో చిక్కుకుని కనిపించకుండా పోవడంతో పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో పాగా వేసామన్న ఆనందం పట్టుమని అయిదేళ్లు కూడా లేకుండా పోవడం ఒకెత్తు.. అయితే భవిష్యత్తులో అయినా పార్టీ జెండా మోసి మళ్ళీ అక్కడే తిరిగి పాగా వేద్దామన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయని పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా కేసుల ఎఫెక్ట్‌తో స్పీడ్ తగ్గించేసి కామ్ అయిపోయారు.
చూశారుగా మాజీ మంత్రి పేర్ని నాని వాయిస్ ఎలా మారిపోయిందో.. చనిపోయిన అమ్మ మీద ఒట్టేసి తానేమీ తప్పు చేయలేదని బిక్కముఖం పెట్టి చెప్తున్నారు. అమాయకురాలైన తన భార్యపై అన్యాయంగా కేసు పెట్టి వేధిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.. అప్పట్లో ఇదే మాజీ మంత్రిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మాత్రం నైతిక విలువలు, మహిళలు అంటూ తెగ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: జగన్ జిల్లాలో కలవరం! నేతలంతా ఎందుకు సైలెంట్ అయ్యారు?
వైసీపీ బూతు మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయిన పేర్ని నాని ఇలా బేలగా మాట్లాడుతూ కూటమి నేతలకు టార్గెట్ అవుతుండటం వైసీపీ కేడర్‌ని మరింత గందరగోళంలోకి నెడుతోందంట. వైసీపీ ఓటమి తరువాత కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు చేర్పులతో పాటు జిల్లా అధ్యక్షులను కూడా జగన్ మార్చారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నానినీ ఏరికోరి మరీ నియమించి కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక జిల్లాల్లో కీలకమైన గన్నవరం, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు.
గన్నవారానికి వల్లభనేని వంశీని, గుడివాడకు కొడాలి నానిని , మచిలీపట్నానికి పేర్ని నానిని ఇన్చార్జులుగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించినా ముగ్గురూ కేడర్‌కి అందుబాటులో లేకుండా పోయారు. పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో తిరిగి కొత్త వారికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారు కూడా కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని వీడిన వల్లభనేని వంశీ, గుడివాడకు దూరమైన కొడాలి నాని ఇప్పటివరకు ఎక్కడున్నారో తెలియదు. ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి.
ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోని ఐదు నియోజకవర్గాల నేతలు గడప దాటి అడుగు బయట పెట్టడం లేదని భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారంట. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెడన, పెనమలూరు నియోజక వర్గాలు జిల్లాల్లో కీలకమైనవి కావడం, ఈ ఐదు నియోజకవర్గాల్లో ఇన్చార్జులు ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడంతో … భవిష్యత్తులో యాక్టివ్ అవుతారన్న నమ్మకం కూడా కనిపించడం లేదని, పార్టీని మళ్ళీ తిరిగి గెలిపిస్తారన్న భరోసా లేదని క్యాడర్ అంటుంది.
పేర్ని నాని అడపాదడపా బయటకు వస్తున్నారు. రేషన్ బియ్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ కాకుండా కోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని ఉన్నప్పటికీ ఇతర నియోజక వర్గాల్లో కార్య క్రమాలకు సైతం కార్యకర్తలు కదలాలని పిలుపునివ్వలేదని ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి . నియోజకవర్గాల్లో క్యాడర్ పై కేసులు నమోదు అవుతున్నా, వరుస అరెస్టులు జరుగుతున్నా కనీసం అండగా నిలిచే వారే లేకుండా పోయారని ఆయా సెగ్మెంట్ల కేడర్ వాపోతుంది. రాజకీయాల్లో కేసులు, అరెస్టులు సర్వసాధారణమైనా క్యాడర్కు భరోసా కల్పించలేని స్థితిలో కీలక నేతలే ఉంటే భవిష్యత్తులో పార్టీ జండా మోసేదెవరు పార్టీ, కార్యక్రమాలకు వచ్చేది ఎవరు, పార్టీని నడిపించేది ఎవరని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి కృష్ణ జిల్లా వైసీపీని నాయకత్వ లోపం వేధిస్తోంది. చూడాలి ఈ సమస్య వైసీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో