YCP Leaders on Peddireddy: పరాజయం అయితే ఫర్వాలేదు.. ఘోర పరాభావానికి కారణం మాత్రం కూటమి కాదు.. తమ పనితీరు కాదు.. సొంత పార్టీ సీనియర్ నేత పరోక్షంగా ప్రత్యర్థులకు సహకరించడమే కారణమని ఆ జిల్లా వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారంట. ఒకరు కాదు ఇద్దరు కాదు జిల్లాలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధులందరూ అదే అభిప్రాయంతో జగన్‌కు ఫిర్యాదులు గుప్పిస్తున్నారంట. అంతేకాదు సందర్భం వచ్చినప్పుడల్లా ఆ అక్కసుని బాహటంగానే వెల్లగక్కుతున్నారు. అటు చూస్తే సదరు సీనియర్ ప్రతి సెగ్మెంట్లో సొంత వర్గాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ చక్రం తిప్పుతుంటారు. దాంతో ఆ జిల్లా వైసీపీ రాజకీయం హాట్‌హాట్‌గా మారిందిప్పుడు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలలో రెండు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. అది కూడా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో అయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి మాత్రమే ఎన్నికలలో విజయం సాధించారు. ఇక జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయానందారెడ్డి, బియ్యం మధుసూదన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూమార్తె కృపాలక్ష్మిలు ఓటమి పాలయ్యారు. అది కూడా వారు ఉహించని విధంగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.
ఓడిపోయిన వారందరూ తమ ఘోరపరాజయానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని ఆగ్రహంతో ఉన్నాంట. అంతర్గత సంభాషణల్లో పలుమార్లు ఆ అక్కసు వెల్లగక్కతున్న ఆ నాయకులు వివిధ సందర్భాల్లో బహిరంగంగా పెద్దిరెడ్డిపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ రోజే రోజా నగరిలో పెద్దిరెడ్డి వర్గీయులు అయిన కేజే కూమార్ దంపతులు సైకిల్‌కు ఓటేయ్యమని బహిరంగంగా చెబుతున్నారని అరోపించారు. దానికి తగ్గట్టుగానే రోజా ఓడిపోయిన తర్వాత కేజే శాంతి నగరికి పీడ విరగడ అయ్యిందని సెల్పీ వీడియో విడుదల చేసారు.
ఫలితాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డ భాస్కరరెడ్డి స్వయంగా పూనుకుని పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జీడి నెల్లూరు టికెట్ విషయంలో తనను, తనకూమార్తెను పెద్దిరెడ్డి అనేక ఇబ్బందులు పెట్టాడని అరోపించారు. విజయానందరెడ్డి అయితే పెద్దిరెడ్డిని ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు బహిరంగంగానే వ్యతిరేకించారు. నారాయణ స్వామి సైతం జగన్‌తో ఇదే విషయాన్ని చెప్పారంట. దాంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడిగా ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రకటించిన జగన్ తర్వాత ఆయన్ని తప్పించి భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రకటించారు.
భూమన కరుణాకర్ రెడ్డి అట్టహాసంగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెద్దిరెడ్డి కాని అయన కూమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాని హాజరు కాలేదు. దానికి కారణం పెద్దిరెడ్డి వ్యతిరేక వర్గం హాడావుడి ప్రమాణ స్వీకార సమయంలో ఎక్కువుగా ఉందని అంటున్నారు. అయితే పార్టీ అవిర్భావం నుంచి భూమన , రోజా, బియ్యం మధుసూదన్ రెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పని చేసారు. పెద్దిరెడ్డి 2014 ఎన్నికల ముందు పార్టీలో ఎంటర్ అయ్యి తమ మీద పెత్తనం చేయడమే కాకుండా కాంగ్రెస్ మార్క్ పాలిట్రిక్స్ చేస్తున్నాడని మిగిలిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దిరెడ్డి ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తమను ఇబ్బంది పెట్టాడని అధికారంలో ఉన్నప్పుడు సైతం ఆయనపై జగన్‌కు వారంతా ఫిర్యాదులు చేశారు.. అయితే వాటిని అప్పట్లో జగన్ లైట్ తీసుకున్నారని అంటున్నారు. తిరుపతి , చంద్రగిరి, సత్యవేడు, జీడి నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలలో తమ కంటే పెద్దిరెడ్డి , అయన అనుచరుల పెత్తనమే సాగిందని.. విచ్చలవిడిగా భూదందాలు, క్యారీల దందాలు చేసారని.. అందువల్ల పార్టీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్‌కి అధారాలతో సహా ఫిర్యాదు చేసారంట. దాంతో జగన్ ఇంత జరిగిందా? అని ఆశ్చర్యపోయారని పెద్దిరెడ్డి వ్యతిరేకులు ఆఫ్ ద రికార్డ్‌గా చెప్తున్నారు.
Also Read: రిటైర్డ్ ఉద్యోగులకే పెద్దపీట.. టీటీడీలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 13 స్థానాలు గెలుచుకున్న వైసీపీ గత ఎన్నికల్లో 2 స్థానాలకు పడిపోవడానికి కారణం పెద్దిరెడ్డి నిర్వాకాలే అని జగన్ ముందు స్పష్టం చేశారంట .. అయితే సీఎంగా ఉన్నప్పుడు జగన్ రాయలసీమలో పార్టీ పెత్తనం పెద్దిరెడ్డికే కట్టబెట్టి.. వారి ఫిర్యాదులు పట్టించుకోక పోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయిందని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీపట్టు కోసం జిల్లాల విభజన జరిగినప్పటికి పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలిపేలా పెద్దిరెడ్డే చక్రం తిప్పారంట. అదే విధంగా అన్నమయ్య జిల్లాలో తమ్ముడు ద్వారకనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లెను చేర్చారంట. ఇక రాజంపేట ఎంపీగా రామచంద్రారెడ్డి కూమారుడు మిథున్ రెడ్డి ఉండనే ఉన్నారు.
మరో వైపు తిరుపతి జిల్లాలో పట్టు కోసం పుంగనూరు నియోజకవర్గంలోని రెండు మండలాలలను తిరుపతి జిల్లాలో కలపడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించారంట. అయితే ఎన్నికలు ముంచుకు రావడంతో అది జరగలేదని అంటున్నారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును సైతం అన్నమయ్య జిల్లాలో కలిపేసి పెద్దిరెడ్డి పెత్తనాన్ని ఆ జిల్లాకే పరిమితం చేయాలని అప్పట్లో జగన్‌కి చెప్పినా ఫలితం లేక పోయిందని … ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయిన ఆ దిశగా చర్యలు తీసుకుంటే తమకు శని వదిలిపోతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్లు భావిస్తున్నారంట.
తాజాగా జరిగిన నగరి వైసీపీ విసృత స్థాయి సమావేశంలో రోజా అదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారంట. దాంతో పాటు పెద్దిరెడ్డి వల్ల తామంతా ఓడిపోయామనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే పెద్దిరెడ్డిని బూచిగా చూపిస్తూ వారంతా క్యాడర్ లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉ్నాయ. ఓడిపోయిన నేతలు కూడా తక్కువేమి కాదని ఓటర్లను క్యాడర్‌ను పట్టించుకోకుండా వ్యవహారించిన ఫలితమే భారీ ఓటమని.. అవేమి పట్టించుకోకుండా తప్పంతా పెద్దిరెడ్డి మీద రుద్ది తాము మాత్రం సుద్ద పూసలు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి వర్గం అంటుంది.
మొత్తం మీదాపెద్దిరెడ్డి కూటమికి చాల చోట్ల సహాకరించారన్న ప్రచారం లో కొంత వాస్తవం ఉందని , వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో పెద్దిరెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎదురులేకుండా చేసుకోవడానికి వెన్నుపోటు రాజకీయం చేశారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పెద్దిరెడ్డిపై అవినీతి, అక్రమాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలున్నాయి. వాటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే తమ విజయాలకు పెద్దిరెడ్డి పరోక్షంగా సహకరించడంతో జిల్లా కూటమి నేతలు కొందరు ఆయన విషయంలో సాఫ్ట్‌కార్నర్‌తో ఉన్నారంట.
అందుకే పెద్దిరెడ్డిపై ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదేమో? అని కూటమి క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. అలాంటిదిప్పుడు పెద్దిరెడ్డి అక్రమాలు వెలుగుచూస్తున్నా.. చర్యలకు ఉపక్రమించకపోవడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.