Big Stories

Gottipati Ravi Kumar: గొట్టిపాటికి గట్టి పోటీ? అద్దంకి..ఎవరికి?

addanki
 
- Advertisement -

ఏపీలోని రాజకీయ ఆసక్తిని కలిగించే నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఒకటి. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా మూడుసార్లు విజయం సాధించి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు తెచ్చుకున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా.. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగాయనేది రాజకీయ వర్గాల అంచనా. పార్టీలతో సంబంధం లేకుండా… అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి రవికుమార్ గెలుపొందారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డ్ రవికుమార్ సొంతమైందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

- Advertisement -

Also Read: నన్ను కలవడానికి వచ్చి.. సన్న బ్లేడ్‌లతో కట్ చేస్తున్నారు: పవన్ కళ్యాణ్ 

అద్దంకిలో పార్టీలకు అతీతంగా రవికుమార్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో కొన్నేళ్లుగా గొట్టిపాటి రవికుమార్ వన్ మెన్ షో నడుస్తోందని రాజకీయవర్గాలూ చెబుతున్నాయి. అందుకే ఆయన పార్టీలు మారినా సదరు నియోజకవర్గంలో హవా నడుస్తోందట. వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో YCP జెండా ఎగరవేసి గొట్టిపాటి రవికుమార్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ నేతలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న గొట్టిపాటిని ఈసారి గట్టిగా ఎదుర్కొనేందుకు అధికారపార్టీ మాస్టర్ ప్లాన్ వేసిందట.

రవికుమార్‌కు చెక్ పెట్టేందుకు వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం.. వర్క్ అవుట్ అవుతుందా లేదా అనే రాజకీయ చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోందట. గొట్టిపాటి రవికుమార్ 2004 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. తరువాత 2009 ఎన్నికల నుంచి అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టిపాటి.. 2014 ఎన్నికల్లో YCP నుంచి, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గొట్టిపాటి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

అద్దంకి నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడిన గొట్టిపాటి రవికుమార్‌కు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు YCP సీరియస్ గా దృష్టి పెట్టిందట. ఈ క్రమంలోనే వైసీపీ అద్దంకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నబాచిన కృష్ణ చైతన్యను పక్కనపెట్టి ఆయన స్థానంలో గుంటురు జిల్లాకు చెందిన పాణెం చిన్నహానిమిరెడ్డిని రంగంలోకి దింపుతోంది. జరగబోయే ఎన్నికల్లో రవికుమార్‌ను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం. ఆయన్ను ఎలాగైనా ఓడించి.. దెబ్బ కొట్టాలని పట్టుదలతో ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. వైసీపీ కీలకనేత Y. V సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గ కావడంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వ్యూహాలను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.

సుబ్బారెడ్డికి సన్నిహితుడుగా ఉంటడమే కాకుండా..ఆర్థికంగా బలమైన హానిమిరెడ్డిని అద్దంకిలో గెలిపించేందుకు ఫ్యాన్‌ పార్టీ.. అన్ని అవకాశాలనూ వాడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా.. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయించాలని హనిమిరెడ్డికి అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన హనిమిరెడ్డి.. పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారట.

మరోవైపు.. టికెట్‌ దక్కలేదని బాచిన కృష్ణచైతన్య, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య టీడీపీలో చేరారు. బాచినతో పాటు ఆయన అనుచరులు, అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యనేతలంతా ఫ్యాన్ పార్టీని వీడారు. నిజానికి అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నారు. కానీ..వైసీపీ మాత్రం..రెడ్డి సామాజికవర్గానికి చెందిన హనిమిరెడ్డిని రంగంలోకి దింపింది. రెడ్డి సామాజికవర్గంతో మిగతా వర్గాలు కలిసొస్తే..అద్దంకిలో విజయం సాధించవచ్చు అనేది YCP ప్లాన్‌. అందుకు తగినట్లుగానే హనిమిరెడ్డి.. ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తున్నారట.

Also Read: పార్టీలు, అభ్యర్థులపై ప్రత్యేక నిఘా, ఏం చేస్తారు?

ఇటు.. కరణం బలరాం కూడా అద్దంకిలో తన వర్గాన్ని పూర్తి స్థాయిలో సపర్ట్ చేయాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అద్దంకి రాజకీయాల్లో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ మధ్య గతంలో పెద్ద యుద్దాలే జరిగాయి. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కరణం బలరాంని అద్దంకి నుంచి చీరాలకు పంపటంతో అద్దంకిలో కొద్దిగా పొలిటికల్ హీట్‌ తగ్గిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గొట్టిపాటి, హనిమిరెడ్డి వర్గీయుల మధ్య పొలిటికల్ వార్ మాత్రం విపరీతంగా సాగుతోందని ఇరుపార్టీల కార్యకర్తలే చెప్పుకుంటున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధిక ఖర్చు అయ్యే నియోజకవర్గాల్లో అద్దంకి ఒక్కటనేది రాష్ట్రవ్యాప్తంగా వినిపించే మాటే. అన్నింటీనీ తట్టుకునే వ్యక్తి కావటంతోనే హనిమిరెడ్డిని వైసీపీ అవకాశం ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. మొదటిసారి అద్దంకిలో వైసీపీ..రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపింది. తక్కువ టైమ్‌లో అద్దంకిలో అడుగుపెట్టిన హనిమిరెడ్డి.. నాన్ లోకల్ అనే ఫీలింగ్‌ తగ్గించుకున్నారట.

నియోజకవర్గంలోని సంతమాగులూరు, అద్దంకి ,మండాలలో వైసీపీ ముందంజలో ఉంటే..కొరిశపాడు, బల్లికురవ, జె.పంగులూరు మండలాలలో టీడీపీ ముందజలో ఉందని సర్వేలు చెబుతున్నాయట. మొత్తం మీద.. మనీ పాలిటిక్స్‌పై రెండు పార్టీల నేతలూ దృష్టి సారించారనే ప్రచారం సాగుతోంది. అసమతి ఉన్న నేతలకు..ఆఫర్లు ప్రకటిస్తూ కండువాలు మార్చేస్తున్నారని టాక్‌. ఓవైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. మరోవైపు ఆర్థిక పరిపుష్టి ఉన్న నేత…ఇద్దరూ కూడా అద్దంకిలో తమ పార్టీ జెండా ఎగురువేయాలని శతవిధాలా యత్నిస్తున్నారట. దీంతో మండే ఎండల కంటే అద్దంకి రాజకీయాలే హీట్‌ పెంచుతున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు. అద్దంకిని ఏ పార్టీ కైవసం చేసుకుంటుదనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News