Marri Rajasekhar Reddy: వైసీపీకి మర్రి రాజశేఖర్ గుడ్‌బై చెప్పనున్నారా.. జగన్‌కు ఎమ్మెల్సీ ముఖం చాటేస్తున్నారా.. ఉమ్మడి జిల్లా నేతలతో పార్టీ అధినేత నిర్వహించిన సమావేశానికి మర్రి ఎందుకు హాజరుకాలేదు. ఇదీ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన అంశం. చాలా కాలంగా రాజశేఖర్ పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతున్నా.. వైసీపీ సమావేశానికి ఆయన హాజరుకాకపోవటంతో.. ఆ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. ఇంతకీ ఫ్యాన్ పార్టీకి వీడితే.. మర్రి అడుగులు ఎటువైపు. వాచ్ దిస్ స్టోరీ.
ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్న కీలక నేతలు
గత ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీలో వలసలపర్వం కొనసాగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా.. అన్నీ తామై వ్యవహరించిన నేతలు కూడా.. ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన వారు సైలెంట్ అయిపోయారు. ఛాన్స్ దొరికితే.. కండువా మార్చేద్దాం అన్నట్లు కొందరి తీరు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి నూట్రల్‌గా ఉండగా.. మరికొందరు అసలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటం మానేశారట. ఇదంతా.. కూటమి ప్రభుత్వానికి భయపడి చేస్తున్నారా లేక పార్టీలో ఉండకూడదనే ఉద్దేశమా అనేది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి నేతల జాబితాలో చేరారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్.
ఆవిర్భావం నుంచి వైసీపీ ఉన్న మర్రి రాజశేఖర్
వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్.. పార్టీలో ఉన్నారు, జగన్ వెంట నడిచి..ఆయనకు డియరెస్ట్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2014లో.. జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. అయితే ఓటమిపాలు అయ్యాక.. 2019 ముందు.. వైసీపీలో చేరిన విడదల రజనీకి టికెట్ ఇచ్చి రాజశేఖర్‌ను పక్కన పెట్టారు. ఆ ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకుంటే.. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. విడదల రజనీకి మాత్రం మంత్రిపదవి దక్కింది. ఇక 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి మాత్రమే మర్రి రాజశేఖర్‌కు దక్కింది. మరోవైపు 2024 ఎన్నికలలో అప్పటి మంత్రి విడదల రజనీని.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసినా చిలకలూరిపేట టికెట్ మాత్రం మర్రికి కేటాయించలేదు. దాంతో ఆయన ఆనాడే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
తనను కనీసం సంప్రదించలేదంటూ ఆవేదన
2024 ఎన్నికలు ముగిశాక రజనీకి.. మళ్ళీ చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్ బాధ్యతలు కట్టిబెట్టారు. ఆ నియామకం జరిగినపుడు..పార్టీలో సీనియర్ నేతగా, ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా..తనను కనీసం సంప్రదించలేదంటూ మర్రి వర్గం తీవ్ర అసహనానికి గురైనట్లు వార్తలు వినిపించాయి. కొన్ని సందర్భాల్లో ఆయన అనుచరుల వద్దే.. రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారని టాక్ నడిచింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలాకాలంగా మర్రి సైలంట్‌గా ఉన్నారు.
Also Read: దెందులూరులో చింతమనేని.. రెడ్ బుక్ రాజ్యాంగం
జగన్ సమావేశానికి డుమ్మా కొట్టిన మర్రి
ఇటీవల జిల్లా ముఖ్యనేతలతో జగన్ సమావేశం నిర్వహించినా.. దానికి మర్రి హాజరుకాలేదు. దీంతో ఆయన ఫ్యాన్ పార్టీని వీడతారనే ప్రచారానికి మరింత బలం చేకూరిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీలో తనకు ఎలాంటి ప్రోత్సాహం దక్కదని భావించిన ఆయన.. కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరతారనే టాక్ నడిచింది. చివరకు.. మర్రి రాజశేఖర్.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. ద్వారా ఆయన టీడీపీ పెద్దలకు టచ్‌లోకి వెళ్లారని.. త్వరలోనే ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే చర్చ సాగుతోంది.
నెలాఖరులోగా సైకిల్ ఎక్కే అవకాశమంటూ వార్తలు
అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెలాఖరులోగా.. మర్రి రాజశేఖర్.. తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయన అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమయంలో టీడీపీలో చేరితేనే.. తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందనే ఉద్దేశంతో మర్రి.. సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మర్రి కనుక వైసీపీని వీడితే.. పార్టీ ఆరంభం నుంచి ఉన్న వారిలో మరో వికెట్ డౌన్ అయినట్లేనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.