Janasena: అయ్యయ్యో..ఆ నలుగురి పరిస్థితి అధ్వాన్యంగా తయారైంది…అయ్యయ్యో..ఆ నలుగురి ఫ్యూచర్ అగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన.. ఆ నలుగురు..ఇప్పుడు తమ దారుణమైన స్థితిని ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నారట. ఏదో అనుకుంటే ..ఇంకేదో జరిగిందంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారట. ఇంతకు ఎవరా నలుగురు…? ఏమనుకుంటే ఏమైంది..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ, జనసేనలోకి వలసలు పెరిగాయి. రెండు పార్టీల్లో చేరేందుకు ఎంతో మంది నేతలు ఆసక్తి చూపించారు. అయితే వైసీపీ నుండి మెజార్టీ నాయకులు జనసేన వైపే అడుగులు వేశారు. అలా జనసేనలో ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు చేరారు. అయితే ఒకప్పుడు వీరంతా కరుడు కట్టిన వైసిపి నాయకులుగా ఉన్నారు. ఇక 2024లో వైసీపీ అధికారం కోల్పోవడంతో..తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది. ఈ సమయంలో బద్ద శత్రువుగా చూసిన టీడీపీలో చేరే కంటే.. అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ నలుగురు అనుకున్నదొక్కటి..తర్వాత అయింది ఒక్కటి.
వాస్తవానికి ఈ నలుగురు నేతలు.. వారి వారి నియోజకవర్గాల్లో బలమైన కేడర్ కలిగి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. తన నియోజకవర్గంలో పాటు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తన ప్రభావం చూపిస్తారు. 2022 ఏప్రిల్‌లో వైఎస్ జగన్…తనను మంత్రి పదవిలో నుంచి తీసేసిన దగ్గర నుండే ..ఆయనతో అంటీముంటున్నట్టుగా ఉన్నారు. ఆ సమయంలోనే బాలినేని జనసేనలోకి వెళ్తారు అనే టాక్ నడిచింది. అప్పుడున్న రాజకీయ పరిణామాల కారణంగా బాలినేని వైసీపీ నుండే పోటీ చేశారు. ఆ తర్వాత భారీ అనుచరగణంతో జనసేనలో చేరిన బాలినేనికి…పార్టీలో పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని టాక్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వినపడుతుందట. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి, మంత్రిగా పనిచేసిన బాలినేనిని.. పవన్ కళ్యాణ్ సరిగా ఉపయోగించుకోవడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి. చేరిన నాటి నుంచి ఇప్పటివరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పార్టీ పదవిని కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. అయితే జనసేనలో చేరే సమయంలో.. బాలినేనికి ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ పార్టీ పగ్గాలు కాదు కదా..కనీసం కార్యదర్శి పదవి కూడా ఇవ్వలేదు.
పదవులు లేకపోయినా పర్వాలేదు..కనీసం గౌరవం అయినా దక్కుతుందనుకుంటే..అదీ లేదు. జనసేన కీలక సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవాల్లో బాలినేనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. పిఠాపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో … బాలినేనిని ఎక్కడో వెనక వరుసలో కూర్చోబెట్టడం, రెండు నెలల ముందు విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా బాలినేనికి సరైన ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయం ఆయన అనుచరల నుండి వస్తుందట. పార్టీ పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ..సీనియర్ రాజకీయ నాయకుడిగా.. పార్టీ సమావేశాల్లోనైనా ప్రాధాన్యత ఇవ్వాలి కదా.. అనే గుసగుసలాడుకుంటున్నారట. జనసేన పార్టీ, అధినేత పవన్ కల్యాణ్ తీరుపై బాలినేని కూడా అసంతృప్తిగా ఉన్నారట. అంతేకాదు రాజకీయంగా రాంగ్ స్టెప్పు వేశానా అనే డైలమాలో బాలినేని ఉన్నట్లు ప్రచారం నడుస్తోందట. ఈ క్రమంలో ప్రస్తుతం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిన బాలినేని.. హైదరాబాద్‌కే పరిమితం అయ్యారట.
ఇక జనసేన పార్టీలో ఎంతో ఉత్సాహంతో చేరిన మరో కీలక నేత సామినేని ఉదయభాను. అయితే బాలినేనితో పోల్చుకుంటే… ఉదయభానుకి పవన్ కల్యాణ్ గౌరవం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ..ఉదయభాను అసంతృప్తిగానే ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయట. జిల్లాలో సరైన క్యాడర్ లేకపోవడంతో పార్టీని నడిపించడం ఇబ్బందిగా మారింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట. అంతేకాదు పవన్ కల్యాణ్‌ను కలవడానికి పెద్దగా అవకాశాలు ఉండడం లేదని నిరుత్సాహంలో ఉన్నట్లు టాక్. పార్టీ నిర్మాణం కోసం సీనియర్ నాయకులను పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్లడం లేదని ఉదయభాను నిట్టూరుస్తున్నారట. పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరితే.. ఇక్కడి పరిణామాలు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట.
పార్టీలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించు బాలినేని, ఉదయభాను మాదిరిగానే ఉన్నట్లు ప్రచారం నడుస్తుందట. పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫైవ్ మెన్ కమిటీలో పెండం దొరబాబుకి స్థానం కల్పించడం తప్ప.. రాజకీయంగా, పార్టీ పరంగా పవన్ కల్యాణ్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల విభజన జరిగితే స్థానికంగా ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పిస్తామనే భరోసాతోనే పెండం దొరబాబు ఇంకా పార్టీలో కొనసాగుతున్నట్లు చర్చ నడుస్తోంది. లేకపోతే ఎప్పుడో ఆయన పార్టీ మారే వారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పరిస్థితి..ఈ ముగ్గురి కంటే దారుణంగా ఉందని టాక్. నియోజకవర్గ బాధ్యతలు గాని మరే ఇతర పదవులు కానీ ఇప్పటివరకు ఆయనకు ఇవ్వలేదు. గతంలో పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా ఉన్న మార్కండేయ బాబు.. అక్కడ హవా నడిపిస్తున్నారు. దీంతో కిలారు రోశయ్య సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
మొత్తానికి అనుకున్నదొక్కటి..అయింది ఒక్కటి…జనసేనలో చేరి బోల్తా పడ్డాం అని అనుకుంటున్నారట ఈ నలుగురు లీడర్లు. ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో చేరితే.. తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందని ఆశపడ్డ బాలినేని, ఉదయభాను, పెండెం దొరబాబు, కిలారు రోశయ్యలు.. ఇప్పుడు అనవసరంగా చేరామా అనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. తిరిగి వైసీపీలోకి వెళ్దామంటే ముఖం చెల్లక…జనసేనలో ఉండి ఇబ్బంది పడుతూ..సతమతమవుతున్నారట. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు సైలెంట్‌గా ఉంటే.. అన్నీ సర్దుకుపోతాయన్న భావనలో ఉన్నారట.
Story by Kishan, Big Tv