Jagan Strategy: వైసీపీ ఘోరపరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్దగా జనజీవన స్రవంతిలో కనిపించడం లేదు.. బెంగళూరులో ఎక్కువ సమయం గడుపుతూ.. అప్పుడప్పుడు మొక్కుబడిగా తాడేపల్లి వచ్చి హడావుడి చేసి వెళ్లిపోతున్నారు. దానిపై సొంత పార్టీలోనే విమర్శలు పెరుగుతుండటంతో ..ఇక రాష్ట్ర జనాల్లోనే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారంట.. ప్రజా సమస్యలపై పోరాటాల దగ్గర నుంచి కార్యకర్తలకు భరోసా వరకు ..నేను ఉన్నానని .. అనిపించుకోవడానికి సిద్దమయ్యారంట. ఆ క్రమంలో జగన్ జిల్లాల్లో వరుస పర్యటనలు హాట్ టాపిక్‌గా మారాయి.
వైసిపి అధ్యక్షుడు జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ఇటీవల వైసీపీ క్యాడర్లో జోష్ నింపడానికే అంటున్నారు. ఓటమి తరువాత పార్టీలో నెలకొన్న సైలెన్స్ బ్రేక్ చేసేలా 20 నెలలుగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత, తాజాగా అంతకు మించి అన్నట్లు పర్యటనలు, మీటింగ్‌లు ప్లాన్ చేస్తున్నారంట. ఒక వైపు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తూ, మరోవైపు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పార్టీ నేతలు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పార్టీ తరపున క్షేత్ర స్థాయిలో కమిటీల నియామకం పూర్తి చేసిన జగన్ తాజాగా తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ పార్టీ తరపున ఇంప్లిమెంట్ అయ్యేలా చేయాలని చూస్తున్నారంట.
నిన్న మొన్నటి వరకు పార్టీ నేతలతో సమావేశాలంటే తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగేవి. వాటిలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జగన్ కోటరీ నేతలే పాల్గొనేవారు. అయితే జగన్ తాజాగా స్టైల్ మార్చి ఇప్పుడు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతూ వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అవసరం అయితే కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో, నాయకులతో భేటీ అవడం,.. లేదంటే తన పర్యటనలు ప్రత్యేకించి ఆయా ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారంట.
ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎక్కువగా ప్రజల్లో ఉండేలా జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారంట. ఇటీవల పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు,అక్రమ కేసులు, అరెస్టులు, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో ప్రజలలోకి వెళ్ళాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తన రెగ్యులర్ యాక్టివిటీకి బిన్నంగా ఉండే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారంట. తద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, ప్రజల్లో నిత్యం పర్యటనలు చేయడం వంటి వాటితో ప్రజలకు, కార్యకర్తలకు మరింత చేరువ కావొచ్చన్నది జగన్ ఆలోచనగా తెలుస్తుంది.
ఇప్పటికే కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ జగన్ ప్రజల్లోకి రావాలని చాలాకాలంగా క్యాడర్ కోరుతుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అయి మూడేళ్లు పూర్తయిన తరువాత పాదయాత్రతో ప్రజలలోకి వెళ్ళాలని వేచి చూసిన జగన్ ఇటీవల తమ ఆలోచన మార్చుకొని పర్యటనలు ముమ్మరం చేశారు. ఇప్పటికే లడ్డు వ్యవహారం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలపై తమ వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని జగన్ భావిస్తున్నారంట.
వైసీపీలో క్యాడర్ కు,లీడర్ కు భరోసా ఇవ్వాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర కంటే ముందే ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడుల ఘటనపై పర్యటనలు చేస్తూనే పార్టీలో ప్రతి ఒక్కరికి నేను ఉంటాను అనే భరోసా ఇచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు అరెస్టులు ,కేసులు లాంటి అంశాలపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పిన ఆయన, అనూహ్యంగా మాజీ మంత్రుల ఇళ్లపై చేసిన దాడులతో, ఇకపై తాను ప్రత్యక్షంగా ప్రజల్లోకి కార్యకర్తలు, నాయకుల వద్దకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారంట. మరి మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావుతు కదపాలని చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read: సొంత పార్టీలోనే ఏకాకిని చేశారా? కవిత ఆవేదన వెనుక అసలు రాజకీయం ఇదే!
Story by: Apparao, Big Tv