Ys Jagan New Strategy: కార్యకర్తలని నాయకులని యాక్టివ్ చేయడంతో పాటు.. వలసల్ని నివారించేందుకు వైసిపి అధినేత జగన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? వలసలతో కుదేలవుతున్న పార్టీని నిలబెట్టకోవడానికి కొత్త స్కెచ్‌లు గీసున్నారా? మరో ముప్పై ఏళ్లు అధికారం. జగన్ 2.0 మంత్రాలు కేడర్‌ను కాపాడుకోవడానికా? లేకపోతే అప్పడే జగన్‌లో అంత ధీమా పెరిగిపోయిందా? అసలు మాజీ ముఖ్యమంత్రి వ్యూహమేంటి? జగన్ ధీమాపై కూటమి నేతల్లో వినిస్తున్న టాక్ ఏంటి?
జగన్ వ్యక్తం చేస్తున్న ధీమా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో, అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్ పోయి 8 నెలలు కాకుండానే ఆయనలో అధికారంపై ధీమా పెరిగిపోయింది. మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాత పాట అందుకున్నారు . వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగనన్న 2 పాలన చాలా ఢిఫరెంట్‌గా ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు.
పార్టీ ఘోర పరాజయం. పార్టీ కీలక నేతల వరుస నిష్క్రమణలు.. చేజారుతున్న స్థానిక సంస్థలు.. కార్యకర్తలు, నేతలపై రోజురోజుకు పెరుగుతున్న కేసులతో సతమతం అవుతుంది వైసీపీ.. ఇదే తరుణంలో విజయవాడ నగర కార్పోరేటర్లతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద కూటములు వచ్చినా.. ఏం చేసినా, మన బలం, ప్రజల మద్దతు మనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. అయితే 40 శాతం ఓటింగ్ దక్కిందన్న ధీమా జగన్‌లో వ్యక్తమవుతుంది. అందుకే పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా ఫర్లేదు అన్నట్లు జగన్ మాట్లాడుతున్నారు. కీలకమైన రాజ్యసభ సభ్యులు వైసీపీకి రిజైన్ చేస్తున్నా జగన్ లెక్క చేయడం లేదు. అదేమంటే క్యారెక్టర్, క్రెడిబిలిటీ అంటూ పెద్దపెద్ద కబుర్లు చెప్తున్నారు.
ఇలాంటి లెక్చర్లతో జగన్ తన కొత్త కార్యాచరణను స్పష్టం చేస్తూ.. పార్టీ కార్యకర్తల్లో ఓ కొత్త ఆశను నింపే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2019 ఎన్నికల ముందు.. ఒక్క ఛాన్స్ ప్లీజ్… అంటూ ఓటర్లను ఆకట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి.. రాబోయే రోజుల్లో జగన్ 2 పాయింట్ ఓ (2.0) ఎలా ఉంటుందో చూస్తారంటూ కొత్త స్లోగన్ ని మోత మోగించే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించటంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఒప్పుకుంటున్నారు జగన్.. అయితే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని మర్చిపోతున్నారాయన
వాలంటీర్లు, సచివాలయాలు అంటూ సొంత వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని పాలన సాగించి .. బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమాలను అప్పులు చేసి మరీ అమలు చేసిన జగన్.. అవే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని గుడ్డిగా నమ్మిన జగన్ ఆశలు అడియాశలయ్యాయి. ఆ నవరత్నాల అమలులో పార్టీ నేతలకు కూడా జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్నీ జగన్ బటన్ నొక్కడం, వాలంటీర్ల పంపిణీలకే పరిమితమయ్యాయి. ఆ నగదు పంపిణీల్లో తమ పాత్ర ఉంటే కాస్తైనా మార్కులు పడతాయని నాయకులు మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదంట.
వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెత్తనం మొత్తం వారి చేతి కెళ్లింది. ఫించన్ల పంపిణీ దగ్గర నుంచి రేషన్ సరుకులు, ఇతరాత్రా పథకాలన్నీ వారి చేతుల్లోకి వెళ్లడంతో వాళ్లే రాజ్యాధికారం చెలాయించారు. ఆ క్రమంలో వాలంటీర్లుఎమ్మెల్యేలతో పాటు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలను కూడా లెక్కచేయలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికారంలో ఉన్నా నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేక ప్రజలకు దూరమయ్యారు. దాంతో ఎన్నికల సమయానికి అదేదో సామెత చెప్పినట్లు.. ఆ నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుందిలే అన్నట్లు అందరూ పూర్తిగా కాడి వదిలేయటంతో జగన్‌కి ప్రతిపక్ష హోదా కోసం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఘోర పరాజయం తర్వాత కొన్ని రోజుల పాటు జగన్ సైతం వాస్తవలోకంలోకి రాలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కచెల్లెమ్మల ఓట్లు, అవ్వా తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అయితే ఓటమిపై పోస్టుమార్టం తర్వాత జగన్ తత్వం గ్రహించినట్లు కనిపిస్తున్నారు. కార్యకర్తలు లేకుంటే పార్టీకి మనుగడ లేదని ఓ అంచనాకు వచ్చారంటున్నారు.
Also Read: రఘురామ వేట.. పులివెందులలో జై పోల్?
గతంలో జగన్ పార్టీ కేడర్‌కే కాదు నాయకులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు .. తనచుట్టూ ఇద్దరు ముగ్గురితో కోటరీ ఏర్పాటు చేసుకుని పరదాల మాటున పాలన సాగించిన ఆయన. ఈసారి ఆ తప్పులు జరగకూడదన్న తత్వం బోధపడినట్లు కనిపిస్తుంది. త్వరలో నియోజకవర్గాల్లో పర్యటన, వారానికి రెండు రోజులు అక్కడే నిద్ర అంటున్న జగన్.. 2.0 అంటూ కొత్త స్లోగన్ ఎత్తుకున్నారంట. వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సారి జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నానని జగన్ అంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు కష్టాలు వస్తాయంటున్న జగన్ చాలా కాలం తర్వాత తన 16 నెలల జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే.. ఆ కష్టాలు శాశ్వతం మాత్రం కాదని.. తాను జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యానని కేడర్‌కి ఆయన ధైర్యం చెపుతుండటం విశేషం. ఎవరికీ ఏ కష్టం వచ్చిన తన జీవితాన్నే గుర్తు చేసుకోవాలని ఇప్పటికీ అక్రమాస్తులు కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న ఆయన భరోసా ఇస్తున్నారు. మహా అయితే అధికారంలో ఉన్న వాళ్లు వైసీపీ కార్యకర్తలను 3 నెలలు జైల్లో పెట్టడం తప్ప.. ఇంకేం చేయలేరంట. ఈ కష్టాలను తట్టుకొని నిలబడినపుడే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని హితబోధ చేస్తున్నారు.
జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పని చేయలేకపోయానంటున్న జగన్ .. ఈ సారి కేడర్‌కే పెద్దపీట వేస్తానంటున్నారు. ఈ సందర్భంగా మీకు మంచి చేసిన వారిని.. చెడుచేసిన ఇద్దరినీ గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తం మీద అధికారంపై జగన్ ధీమా ఏంటో కాని ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి లెక్కల మాస్టారిలా జగన్ వేసుకుంటున్న అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.