జగన్ విపక్ష నేతగా అసెంబ్లీకి రావడానికి ఇష్టపడటం లేదు. 151 సీట్లు దక్కించుకుని అధికారం చెలాయించిన ఆయన పార్టీకి గత ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే దక్కడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాంతో ఆయన తప్పంతా స్పీకర్ మీదకు నెట్టేస్తూ.. అసెంబ్లీకి రానని మొరాయించి కూర్చొన్నారు.
కనీసం పదోవంతు స్థానాలు కూడా దక్కని పార్టీ అధ్యక్షుడికి కేబినెట్ ర్యాంకు హోదా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం సాంప్రదాయంగా వస్తుంది. వైసీపీకి 18 స్థానాలు దక్కి ఉంటే జగన్ ఆశించిన హోదా దక్కేది. అయితే ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంతో మాజీ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. దాంతో జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. అదీకాక జగన్ ఆగర్భ శత్రువులా భావించే రఘురామకృష్ణంరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో అప్పటి సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారాయన. ఆ తర్వాత కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతే టీడీపీ తరుఫున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. మొత్తానికి ఎలాగైతే డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ అయ్యాక ట్రిపుల్ ఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని, జగన్ అసెంబ్లీకి రావాలని విజ్క్షప్తి చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షమూ అవసరమేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు సైతం చెప్పానని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అసెంబ్లీకి జగన్ రాకపోవడంపై హాట్ కామెంట్స్ చేశారు . జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వేటు తప్పదన్నారు. ఒక వేళ అదే కనుక జరిగితే.. పులివెందులకు ఉపఎన్నికలు రావొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
అయితే ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేది లేదని జగన్ తేల్చి చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై స్పష్టత ఇచ్చేవరకు తగ్గేదే లేదంటున్నారు జగన్.. ఆ విషయంలో వాళ్లేం చేసుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్లు రియాక్ట్ అవుతున్నారాయన.. 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే సభ్యత్వం కూడా రద్దవుతుందన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను లైట్ తీసుకున్నట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
Also Read: రంగంలోకి రజినీ.. అంత కోపం ఎందుకో!
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గత కొంత కాలంగా ఓ చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అయినా హాజరవుతారా.. లేదా.. అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. జగన్ అసెంబ్లీకి వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఆయన ఎమ్మెల్యే హోదా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు రావచ్చు అనే విధంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ హోదా లోనే ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా కోసం వేసిన కేసుకి అసెంబ్లీ సభ్యత్వం రద్దుకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు మాజీ సీఎం జగన్ 60 రోజులపాటు అసెంబ్లీకి రాలేదని దీంతో పులివెందులకు ఉప ఎన్నికలు తప్పవనే విధంగా రఘురామరాజు మాట్లాడటంపై చాలామంది విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే సభకు వస్తానని, వైసీపీ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోనని శపధం చేశారు. దాదాపు రెండేళ్లు ఆయన అసెంబ్లీకి దూరంగానే ఉన్నారు… అప్పుడు ఆయన సభ్యత్వం రద్దు చేయలేదు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యే రద్దు అనేది చర్చకు రాలేదు.
ఇప్పుడు రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా వేధింపులకు గురైన ఆయన.. జగన్‌ని పర్సనల్‌గా తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, జగన్ కేసుల విచారణ హైదరాబాద్ కోర్టు నుంచి మార్చాలని ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. జగన్ కేసుల విచారణలో జాప్యాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇక అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా ఎసరు వస్తుందని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. లీగల్ అన్నీ విషయాలు కనుక్కున్న తర్వాతే ఆయన అంత గట్టిగా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ఆ క్రమంలో జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఉప ఎన్నికలపై ఆసక్తికర చర్చ మొదలైందిప్పుడు.