YSRCP Fee Poru: యువతకు రకరకాల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీని అదే యూత్ గత ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టింది. పవన్‌కళ్యాణ్, లోకేష్‌ల ప్రభావంతో యువతీయువకుల ఓట్లు వైసీపీకి పూర్తిగా దూరమయ్యాయి. అందుకే వారిని తిరిగి ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. తమ హయాంలో జరిగిన తప్పిదాలను కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ ఫీజరు రీ ఎంబర్స్‌మెంట్ పోరంటూ తాజాగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి వైసీపీ సర్కారు పెండింగ్ పెట్టిన బకాయిలను ప్రభుత్వం తీర్చేసింది. అయినా జగన్ పోరు బాట అంటుండంపై వినిపిస్తున్న టాక్ ఏంటి?
వైసీపీ.. ప్రస్తుతం అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఉన్నా.. గడచిన ఎన్నికల్లో 40 శాతం ఓట్ షేరింగ్ వచ్చిందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నుంచి వరుసగా పెద్ద పెద్ద వికెట్లు పడిపోతున్నా.. ప్రజల్లోకి వెళ్లేందుకు తమదైన స్టైల్లో ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా ఈ నెల ఐదో తేదీన ఫీజు పోరుకు పిలుపునిచ్చింది. వాస్తవానికి గత ప్రభుత్వంలో పెండింగులో పెట్టిన ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బకాయిలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించేసింది. కానీ అదే అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
దీనికి కారణాలు లేకపోలేదనేది వైసీపీ వాదన. గతంతో పోల్చుకుంటే నారా లోకేష్‌కు యువత, విద్యార్థుల్లో క్రేజ్ పెరిగింది. పైగా లోకేష్ విద్యా శాఖను తీసుకుని.. యువతను, కొత్త ఓటర్లను ఆకట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. సహజంగా యువత తమ వైపు ఉంటారనేది వైసీపీ భావన. 2019 ఎన్నికల్లో యువత మద్దతు వైసీపీకి గట్టిగానే లభించి ఆ పార్టీ అధికారంలోకి రాగలగింది. కానీ గత ఎన్నికల్లో జగన్ విధానాలతో విసిగిపోయిన యూత్ అంత వైసీపీని వీడి లోకేష్, పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. దాంతో యువత, విద్యార్థులను తిరిగి తమ గూట్లోకి తెచ్చుకోవాలన్నా.. వారిని వైసీపీ వైపు ఆకర్షించాలన్నా.. విద్యార్థి.. యూత్ రిలేటెడ్ కార్యక్రమాలు, ఆందోళనలే చేపట్టాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫీజు పోరు అనివైసీపీ హడావుడి మొదలుపెట్టిందంట.
వాస్తవానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనవరి మూడో వారంలో జిల్లాల పర్యటన చేస్తామని చెప్పారు. జనవరి వెళ్లిపోయింది. ఫిబ్రవరి వచ్చేసింది. అయినా ఇప్పటి వరకూ జగన్ జిల్లాల పర్యటనపై క్లారిటీ రాలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలపై పోరుబాటకు వైసీపీ శ్రేణులకు పిలుపు మీద పిలుపు ఇస్తున్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేయడం లేదని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన వైసీపీ ఆందోళనకు దిగుతుంది. అయితే ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీ పట్ల పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీలో లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఆ పరిస్థితిని చక్క దిద్దడానికే జగన్ ఫీజు పోరు మంత్రం పఠిస్తున్నారంట.
Also Read: జోగి సైలెన్స్.. ఆందోళనలో జగన్
వైసీపీ ఫీజుపోరులో ఆ ప్రభుత్వ పెట్టిన బకాయిల కుప్ప గురించి కూడా చెప్పు జగన్ రెడ్డి అని టీడీపీ బ్రోచర్లు రిలీజ్ చేసింది .. ఫిబ్రవరి 5న వైసీపీ చేపట్టే ‘ఫీజుపోరు’ కార్యక్రమం పోస్టర్‌ను వైసీపీ దొంగల ముఠా అంతాకలిసి విడుదల చేసిందని పసుపు నేతలు యద్దేవా చేస్తున్నారు. పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అంటున్న జోగి మాటలకు అర్ధం ప్రజలు బిక్షగాళ్లు అనేనా? ప్రజలను బిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదని మండి పడుతున్నారు.. గతంలో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పధకాన్ని సృష్టించినట్లు జగన్ రెడ్డి సిగ్గు లేకుండా ప్రచారం చేసుకున్నారని ఫైర్ అవుతున్నారు. జగన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పెట్టిన మానసిన క్షోభను రెండు తరాలు మర్చిపోవని మండి పడుతున్నారు.
జగన్ లండన్ వెళ్లే ముందే రైతుపోరు అని పిలుపు నిచ్చారు. అందులో ఆయన పాల్గొనకుండానే లండన్ టూర్‌కి వెళ్లి వచ్చారు. ఆ రైతు పోరు అట్టర్ ఫ్లాప్ అయింది. విద్యుత్తు బిల్లుల పెంపుకు వ్యతిరేకంగా పిలుపు ఇచ్చారు. అదీ అంతే అయింది. ఇక ఇప్పుడు ఫీజు పోరు అంటున్నారు. కట్టేసిన ఫీజు బకాయిల కోసం ఆందోళనలు చేయడమేమో కాని… కనీసం అందులో అయినా ఆయన పాల్గొంటారో? లేదో? చూడాలి