Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారమంతా చివరి మెగా చీఫ్ ఎవరు అవుతారు అనే పోటీలతో కంటెస్టెంట్స్ అంతా బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఎన్నో టాస్కులు జరిగాయి. ఫైనల్‌గా అందరినీ దాటుకుంటూ రోహిణి మెగా చీఫ్ అయ్యింది. కానీ ఈ మెగా చీఫ్ కంటెండర్ల మధ్య జరిగిన టాస్కుల సమయంలో అందరి మధ్య చాలానే మనస్పర్థలు వచ్చాయి. ముఖ్యంగా రోహిణి, విష్ణుప్రియా అయితే ఒకరినొకరు అనకూడని మాటలు అన్నీ అనుకున్నారు. దీంతో ఆ ఇద్దరినీ కన్ఫెక్షన్ రూమ్‌కు పిలిచి మరీ వారిపై ఫైర్ అయ్యారు నాగార్జున. ఆ తర్వాత దీనిపై కంటెస్టెంట్స్ అభిప్రాయం కనుక్కున్నారు.
క్యారెక్టర్‌పై స్టేట్‌మెంట్
బిగ్ బాస్ 8 వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో ముందుగా రోహిణి.. మెగా చీఫ్‌గా గెలిచినందుకు తనను అభినందించారు నాగార్జున. ‘‘ఎంత బాగా గెలిచావు రోహిణి. నీతో నేను పర్సనల్‌గా కొన్ని విషయాలు మాట్లాడాలి. కన్ఫెషన్ రూమ్‌కు వచ్చేయ్’’ అని పిలిచారు. ఆ తర్వాత విష్ణుప్రియాను కూడా అక్కడికే పిలిచారు. ‘‘ఇలా మీ ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్‌కు పిలవాలని ఎప్పుడూ అనుకోలేదు’’ అంటూ ఆటో టాస్కులో ఇద్దరూ తిట్టుకున్న వీడియోను ప్లే చేశారు. ‘‘నీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది అందుకే ఉన్నావు’’ అని రోహిణి అనగా.. ‘‘నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది’’ అని విష్ణుప్రియా సీరియస్ అవ్వడం ఈ వీడియోలో కనిపించింది. అదంతా చూపించిన తర్వాత తన స్థానంలో ఎవరు ఉన్నా అలాగే గొడవపడతారు అని స్టేట్‌మెంట్ ఇచ్చింది విష్ణుప్రియా.
Also Read: సోనియా కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
పెద్ద నింద
క్యారెక్టర్ అనేది చాలా పెద్ద పదం కదా అని చెప్పబోయారు నాగార్జున. ‘‘పరిస్థితిని బట్టి మనమేంటో కనిపిస్తుందని మీరే చెప్పారు కదా’’ అని గుర్తుచేసింది విష్ణు. ‘‘అదే కనిపించింది. నీ క్యారెక్టర్ ఏంటో కనిపించింది. ఉపయోగించకూడని పదం ఉపయోగించావు’’ అని సీరియస్ అయ్యారు నాగ్. క్యారెక్టర్‌లెస్ అని ఏం చెప్పలేదు కదా అని విష్ణు స్పష్టం చేయగా.. తను అన్న మాటలకు అదే అర్థమని తెలిపారు. ఆ వీడియోలో అసలు ప్లాన్ ఏంటి అని విష్ణు అడగగానే.. ‘‘ముందు నిఖిల్‌కు ట్రై చేస్తే అవ్వలేదు తర్వాత పృథ్వికి ట్రై చేశానని నువ్వే చెప్పావు’’అని తనపై పెద్ద నింద వేసింది రోహిణి. అది నిజమేనా అని మరోసారి నాగార్జున క్లారిటీతో అడగగా అవును అంటూ నవ్వింది రోహిణి. దీంతో విష్ణు షాకయ్యింది.
ఎవరిది తప్పు?
విష్ణుప్రియా, రోహిణి బయటికి రాగానే ఇద్దరిలో తప్పు ఎవరిది అని కంటెస్టెంట్స్‌ను అడిగారు నాగార్జున. ముందుగా అవినాష్‌ను అడగగా.. ప్లాన్ అనే పదం ఉపయోగించినందుకు రోహిణిదే తప్పు అన్నాడు. ఆ తర్వాత ప్రేరణ ఏమో రోహిణి ప్లాన్ అనే పదాన్ని ఉపయోగిస్తే విష్ణుప్రియా అంతకంటే పెద్ద మాటలే మాట్లాడిందని తన అభిప్రాయం చెప్తుండగానే విష్ణు జోక్యం చేసుకుంది. దీంతో తనను సైలెంట్ అయిపోమని నాగార్జున సీరియస్ అయ్యారు. ‘‘ప్రస్తుతం నీ బుర్రలో సెన్స్ మిస్ అయ్యింది. మనం నాలుగు మాటలు వదిలేస్తే.. అవతల వాళ్లు కూడా నాలుగు మాటలు వదిలేస్తారు. ఈ మాటల మధ్యలో క్యారెక్టర్ లాంటి పెద్ద పదాలు వచ్చేస్తాయి. దాని తర్వాత ప్లాన్ అని వస్తుంది. ఆలోచన లేనప్పుడు ఆత్మీయులు దూరమవుతారు’’ అని నాగ్ సీరియస్ అయ్యారు.