Bigg Boss 8 Telugu Latest Promo : బిగ్ బాస్ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ మొదలయ్యింది. ముగిసిపోయింది. ఇప్పటివరకు దాదాపు అందరి కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీస్ హౌస్‌లోకి వచ్చాయి. తమవారితో సరదాగా సమయాన్ని గడిపారు. దీంతో కంటెస్టెంట్స్‌లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. వారు చెప్పిన సలహాలు, సూచనలతో అసలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఇకపై ఎలా ఆడాలి అనే క్లారిటీ వచ్చింది. అయితే కంటెస్టెంట్స్‌లో మెజారిటీ సభ్యులు టేస్టీ తేజ వరస్ట్ అని ఓటు వేయడంతో తన తల్లి హౌస్‌లోకి రాదు అని పనిష్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ఫ్యామిలీ వీక్ మొదలయినప్పటి నుండి తేజ ఏడుస్తూనే ఉన్నాడు. చివరిగా తనకు ఒక్క ఫోన్ కాల్‌తో సంతోషం దొరికింది.
బాధపడకు నాని బాబు
కంటెస్టెంట్స్ అంతా నిద్రపోతున్న సమయంలో గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఫోన్‌కు ఒక కాల్ రావడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వస్తారు. ముందుగా వచ్చిన టేస్టీ తేజ ఫోన్ ఎత్తాడు. ‘‘హాయ్ నాని బాబు. ఎలా ఉన్నావమ్మా? నేను హౌస్ లోపలికి రాలేదని నీకు చాలా బాధగా ఉంది. నీ కల నెరవేరలేదని నువ్వు బాధపడకు నాని బాబు. ఫైనల్ ట్రోఫీతో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. అదే నా కల’’ అని అవతలి వైపు నుండి తేజ తల్లి మాట్లాడారు. దీంతో మరోసారి తేజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కంటెస్టెంట్స్ అంతా తనను ఓదార్చడానికి ప్రయత్నించారు.
Also Read: జీవితంలో మరిచిపోలేని సర్ప్రైజ్.. ఎమోషనల్ అయిన ప్రేరణ..!
ఇంక ఏడవద్దు…
తేజ తల్లిని హౌస్ లోపలికి రానిస్తే ఒక కన్నతల్లి, ఒక కొడుకు కోరికను నెరవేర్చిన వాళ్లు అవుతారు బిగ్ బాస్ అంటూ అవినాష్ రిక్వెస్ట్ చేశాడు. ‘‘ఏడవకూడదని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగట్లేదు. నేనెందుకు ఇలా ఏడుస్తున్నాను’’ అంటూ మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. అప్పుడే గేట్స్ ఓపెన్ అయ్యి తేజ తల్లి హౌస్‌లోకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరూ హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యారు. ‘‘నేను లోపలికి వచ్చాను. నువ్వు ఏడవకు ఇంకా’’ అంటూ కొడుకును ఓదార్చారు తల్లి. ‘‘తేజగాడి అమ్మ ఇంట్లోకి వచ్చిందోచ్’’ అంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు తేజ. హౌస్‌లోకి కుడి కాళ్లు పెట్టమని చెప్పి తన తల్లిని లోపలికి తీసుకెళ్లాడు.
కల నెరవేరింది…
‘‘గేమ్ పరంగా అంతా బాగుంది. ఈ 4 వారాలు కూడా కష్టపడి ఆడాలి. ఫైనల్‌లో ఫ్యామిలీ అంతా కూర్చొని నిన్ను స్టేజ్‌పై చూడాలి’’ అంటూ కొడుకును మోటివేట్ చేశారు. ‘‘మీ అమ్మ ఇంట్లోకి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది తేజ?’’ అంటూ బిగ్ బాస్ అడిగారు. ‘‘దేని ముందు అయినా అమ్మ ఎమోషన్ అనేది డామినేట్ చేసేస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది అమ్మే. అమ్మ తర్వాతే ఏదైనా’’ అని చెప్పాడు తేజ. ఆ తర్వాత లక్ష్మీ ఐ లవ్ యూ అంటూ తన తల్లిని ప్రపోజ్ చేశాడు. ‘‘నా కల ఈ రోజుతో నెరవేరిపోయింది’’ అన్నాడు. ‘‘ఇప్పుడు ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్‌గా ఎండ్ అయ్యింది’’ అంటూ నబీల్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.