ఇందుగలడందు లేదని సందేహము వలదు.. విష్ణుమూర్తి సర్వాంతర్యామి అని చెప్పే పద్యం ఇది. టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మనం ఇలాగే చెప్పుకోవాలేమో. అవును ఏఐ చేయని పని, చేయలేని పని అంటూ ఏమీ లేకుండా పోయింది. ఏయే రంగాల్లో చూసినా ఆయా రంగాల్లో దీని ప్రాధాన్యత పెరిగిపోతోంది. తాజాగా ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో ఏఐ పాఠాతో లాభాల పంట పండించాడు. కేవలం 10 రోజుల్లో అతను పెట్టుబడిగా పెట్టిన రూ. 34వేలు రెట్టింపయ్యాయి.
చాట్ జీపీటీ, గ్రోక్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని నమ్ముకుని 10రోజుల్లో జాక్ పాట్ కొట్టిన సదరు వ్యక్తి ఇప్పుడు టాక్ ఆఫ్ సోషల్ మీడియా అయ్యాడు. ఓపెన్ ఏఐ ప్లాట్ ఫామ్ కి చెందిన చాట్ జీపీటీ, ఎక్స్ ప్లాట్ ఫామ్ కి చెందిన గ్రోక్ ని దీనికోసం సంప్రదించాడు. అయితే అందరిలా ఇతను ఏయే స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలి అని ఏఐని అడగలేదు. దీనికోసం కొంత కసరత్తు చేశాడు. తన పోర్ట్ ఫోలియోను చాట్‌జీపీటీ , గ్రోక్ మధ్య విభజించాడు. “AI షోడౌన్” అనే కొత్త అప్లికేషన్ తయారు చేశాడు. స్ప్రెడ్‌షీట్‌లు, టెక్నికల్ చార్ట్‌లు, ఆప్షన్స్ చైన్ స్క్రీన్‌షాట్‌లతో కలిపి చాట్ జీపీటీ, గ్రోక్ కి విస్తృత డేటా అందించాడు. వాటి సహకారంతో పెట్టుబడి పెట్టాడు.
రెండిటితో లాభాల పంట..
కేవలం 10రోజుల్లోనే అతడు లాభాలు కళ్లజూశాడు. అది కూడా రెట్టింపు లాభం. అంటే అతడు పెట్టుబడిగా పెట్టిన 34వేల రూపాయలు 10రోజుల్లో రెట్టింపయ్యాయి. మొత్తం 18 స్టాక్స్ పై పెట్టుబడి పెట్టగా.. అందులో 17 స్టాక్స్ నుంచి లాభాలు వెనక్కి తీసేసుకున్నాడు. ఇందులో చాట్ జీపీటీ 13 స్టాక్స్ ని సూచించగా, గ్రోక్ సలహాతో 5 స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ వివరాలన్నిటినీ అతడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఇతరులతో పంచుకున్నాడు. దీంతో చాలామంది అతని ఫార్ములాని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు స్వల్పకాలిక పెట్టుబడులను ఎప్పుడూ నమ్మొద్దని, వాటి వల్ల లాభాలతోపాటు, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.
అంత సీన్ లేదు..
కొంతమంది మాత్రం ఈ ప్రయోగాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు. ఇదంతా ఒక స్కామ్ అని విమర్శిస్తున్నారు. డబ్బులు రెట్టింపు కావాలంటే 10రోజులు చాలు అనడం సరికాదని, ఏఐ కాదు కదా ఏ ఇతర ప్లాట్ ఫామ్ కూడా అంత త్వరగా డబ్బులు రెట్టింపు చేయలేదని అంటున్నారు. 6 నెలల క్రితం మార్కెట్ అస్సలు బాగోలేదని, ఇప్పుడు మాత్రం ఏ స్టాక్ లో పెట్టుబడి పెట్టినా లాభాలు వస్తున్నాయని మరికొందరు చెబుతున్నారు. అదృష్టం బాగుండటం వల్ల ఇలా సదరు వ్యక్తి స్టాక్ మార్కెట్ లో లాభాలు తీసుకుని ఉంటాడని అంచనా వేస్తున్నారు. అయితే ఆ అదృష్టాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ముడిపెట్టడం సరికాదంటున్నారు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇలాంటి అద్భుతాలు జరగవని వాటితోపాటు సమయం అనుకూలంగా ఉండటం కూడా అవసరమని చెబుతున్నారు.