Cracked Heels: చలికాలంలోనే కాకుండా.. అన్ని కాలాల్లోనూ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య పాదాల పగుళ్లు. పగిలిన మడమలు చూడటానికి ఇబ్బందిగా ఉండటమే కాక.. ఒక్కోసారి నొప్పి, మంట, రక్తస్రావానికి కూడా దారితీస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వంటింట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఈ పగుళ్లకు సులభంగా.. సమర్థవంతంగా చికిత్స చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి పగిలిన చర్మాన్ని నయం చేయడంలో సహాయ పడతాయి.
చిట్కా: రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. కొద్దిగా గోరు వెచ్చని కొబ్బరి నూనెను తీసుకుని.. పగుళ్లపై, మడమలపై బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన కాటన్ సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మడమలు మృదువుగా మారతాయి.
2. తేనె, వేడి నీటి స్నానం: తేనె సహజంగా తేమను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో.. పగుళ్లను నయం చేయడంలో, చర్మానికి తేమను అందించడంలో సహాయ పడుతుంది.
చిట్కా: ఒక టబ్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని.. అందులో ఒక కప్పు తేనె కలపాలి. ఈ తేనె నీటిలో మీ పాదాలను సుమారు 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మెత్తని స్క్రబ్బర్‌తో మడమలను సున్నితంగా రుద్ది.. మృతకణాలను తొలగించాలి.
3. అరటిపండు, అవకాడో మాస్క్: అరటిపండులో విటమిన్ A, B6 , C ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను కాపాడతాయి. అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది.
చిట్కా: బాగా పండిన ఒక అరటిపండు, సగం అవకాడోను తీసుకుని మెత్తని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను పగిలిన మడమలపై మందపాటి పొరలా అప్లై చేసి.. 15-20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
4. బియ్యపు పిండి స్క్రబ్: బియ్యపు పిండి మృతకణాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మృతకణాలు తొలగడం వల్ల చర్మం మాయిశ్చరైజర్‌ను బాగా శోషించుకుంటుంది.
ఒక టేబుల్‌స్పూన్ బియ్యపు పిండిలో కొద్దిగా తేనె, కొంచెం ఆలివ్ నూనె కలిపి పేస్ట్ చేయాలి. పాదాలను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత.. ఈ పేస్ట్‌తో మడమలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది గరుకుగా మారిన చర్మాన్ని తొలగించి.. పగుళ్లను తగ్గిస్తుంది.
5. గ్లిజరిన్, నిమ్మరసం మిశ్రమం: గ్లిజరిన్ చర్మానికి తేమను బంధించి ఉంచడంలో సహాయ పడుతుంది. నిమ్మరసంలోని సహజ ఆమ్లాలు మృత కణాలను తొలగిస్తాయి.
చిట్కా: 1 టేబుల్‌స్పూన్ గ్లిజరిన్‌లో 1 టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పగుళ్లపై రాసి, సాక్స్ ధరించాలి. ఉదయం శుభ్రం చేయడం వల్ల చర్మం మెత్తగా మారుతుంది.
పాదాల పగుళ్ల సమస్య ఉన్నవారు ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.