CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్, కేవలం నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. ఈ 22 శాతం ఓట్లు ఎవరికి చేరాయి…? ఏ పార్టీలు కలిసి ఇదంతా డ్రామా చేస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే కుట్రను కొనసాగించాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఎనిమిది స్థానాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని స్పష్టం చేశారు. ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలే కారణమని ఆయన ఆరోపించారు.
మరోవైపు.. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించిన స్ఫూర్తితో.. చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికోసం త్వరలో తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ రెజల్యూషన్ తీసుకువస్తామని ప్రకటించారు. పార్లమెంటులో చట్టసవరణ జరిగితే యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యతను కాపాడుతోందని, మూడు తరాలుగా దేశం కోసం పని చేస్తోందని రేవంత్ రెడ్డి కొనియాడారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గొప్పతనం గురించి మాట్లాడారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని చెప్పారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ సద్భావన అవార్డును ప్రదానం చేశారు.