TG Wine Shops: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నిన్నటితో(అక్టోబర్ 18) దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల టెండర్ల గడువును అక్టోబర్ 23 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
లిక్కర్ షాపుల టెండర్ల గడువును పొడిగించడంతో ఈ నెల 23న జరగాల్సిన లక్కీ డ్రా ప్రక్రియను వాయిదా వేశారు. శనివారం బీసీ బంద్ కారణంగా పలువురు దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేయాలనుకున్నవారికి నిరాశ చెందారు. దీంతో దరఖాస్తు గడువును పెంచుతూ ఎక్సైజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు రుసుమును రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు భారీగా తగ్గాయని తెలుస్తోంది.
లిక్కర్ షాపుల దరఖాస్తు రుసుము పెంచడంతో.. ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్న వారు, కొత్త వారు సిండికేట్‌గా మారి ఎక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలు చేస్తున్నారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపుల వివరాలు తెలుసుకుని చివరి సమయంలో దరఖాస్తులు చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం రూ. 2 లక్షల ఫీజు ఉండగా, ప్రస్తుతం రూ.3 లక్షలకు పెంచారు. దీంతో భారీగా దరఖాస్తులు తగ్గాయి. శనివారం సాయంత్రంతో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే ఎక్సైజ్ అధికారులు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం, బీసీ బంద్ కారణంగా బ్యాంకులు తెరుచుకోకపోవడంతో దరఖాస్తు చేసే అవకాశం లేకపోయింది. దీంతో దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
చివరిరోజుగా ప్రకటించడంతో శనివారం రోజున భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ ఒక్క రోజే 30 వేలకు పైగా లిక్కర్ టెండర్లు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
తెలంగాణలోని లిక్కర్ షాపుల కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ భారీగా టెండర్లు దాఖలు చేసింది. దాదాపు 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఏపీ బోర్డర్ లోని తెలంగాణ జిల్లాల్లోని మద్యం షాపులకు ఆ మహిళ అధికంగా దరఖాస్తు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు లిక్కర్ షాపులకు దరఖాస్తు చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాల్లో 101 మద్యం షాపులకు 4,190 దరఖాస్తులు రాగా, మెదక్ జిల్లాలో 49 మద్యం షాపులకు 1,369 టెండర్లు వచ్చాయి. వరంగల్ అర్బన్ 3,621,
వరంగల్ రూరల్ 1,905, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 1,615, జనగామ జిల్లాలో 1,798, మహబూబాబాద్ జిల్లాలో 1,850 అప్లికేషన్లు దాఖలయ్యాయి.