Superhuman AI – 2027: కృత్రిమ మేధ (AI) రంగంలో చోటుచేసుకుంటున్న వేగవంతమైన మార్పులు మానవ ఉపాధికి పెను ముప్పుగా పరిణమించనున్నాయని తెలుస్తోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ (Anthropic) పరిశోధకుడు టావో లిన్ (Tao Lin) చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ మానవాళిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో మనుషుల కంటే వేగంగా, సమర్థవంతంగా పనిచేసే ఏఐ వ్యవస్థలు మరో రెండేళ్లలోపే అందుబాటులోకి వస్తాయని టావో లిన్ అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మానవులు శాశ్వతంగా నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
‘పాలిసేడ్ రీసెర్చ్’ (Palisade Research) కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో టావో లిన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. మరో 1.3 ఏళ్లలో అంటే 2027 చివరి నాటికి ‘బ్రాడ్లీ సూపర్ హ్యూమన్ ఏఐ’ (అన్ని రంగాల్లో మానవ మేధస్సును మించిన ఏఐ) ఆవిర్భవిస్తుందని ఆయన అంచనా వేశారు. ప్రోగ్రామింగ్, ఫిల్మ్ మేకింగ్, రాజకీయాలతో సహా దాదాపు ప్రతి రంగంలోనూ అత్యుత్తమ నిపుణులతో సమానంగా లేదా వారి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం ఈ ఏఐకి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు భవిష్యత్తులో ఉద్యోగాల తీరుతెన్నులపై కూడా లిన్ ఆందోళనకరమైన అంచనాలను వెల్లబుచ్చారు. ఏఐ ప్రభావంతో ముందుగా అందరూ తమ ప్రస్తుత ఉద్యోగాలను కోల్పోయి కొంతకాలం పాటు వేరే వృత్తుల్లోకి మారతారని అభిప్రాయపడ్డారు. అయితే ఆ కొత్త రంగాలను కూడా ఏఐ ఆక్రమించేస్తుందని.. ఫలితంగా మనుషులకు ఎక్కడా పని దొరకని స్థితి ఏర్పడుతుందని తెలిపారు. చివరికి భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక అవసరాల కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడాల్సి వస్తుందని లిన్ అభిప్రాయపడ్డారు.
ఏఐ అంత శక్తివంతమైనదైతే ఇప్పటికే ఉద్యోగాలు ఎందుకు పోలేదన్న ప్రశ్నకు సైతం లిన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా మేధోపరమైన పనులను ఏఐ త్వరలోనే అధిగమించినా.. భౌతిక ప్రపంచంలో మనుషులను పూర్తిగా భర్తీ చేయడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికుల స్థానంలో భారీ ఎత్తున అధునాతన రోబోలను కంపెనీలు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి అంత పెద్ద మెుత్తంలో రోబోలను తయారు చేయగల సామర్థ్యం రోబోటిక్ సంస్థలకు లేదని వివరించారు.
అయితే మార్పులకు అనుగుణంగా సమాజం సిద్ధమయ్యే వేగం కంటే.. ఏఐ వ్యవస్థల అభివృద్ధి వేగం చాలా ఎక్కువగా ఉందని లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఏఐ కంపెనీలు తమ పరిశోధనల వేగాన్ని కొంత తగ్గించాలని ఆయన సూచించారు. లేని పక్షంలో భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అంశాల్లోనూ మానవాళిని ఏఐ పూర్తిగా పక్కన పెట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Also Read: డీమార్ట్‌లో మాంసాహారం, కూరగాయలు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ఎందుకు అమ్మరు? అసలు సీక్రెట్ తెలిస్తే షాకే!
అయితే లిన్ వ్యాఖ్యలకు భిన్నంగా ప్రస్తుతం బయట పరిస్థితులు ఉన్నాయి. 2022 చివరి నుండి ఏఐ ప్రభావం ఉన్న రంగాలలో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని లిన్ వర్క్ చేస్తున్న ‘ఆంథ్రోపిక్’ (Anthropic) సంస్థ నివేదికలే చెబుతున్నాయి. కాకపోతే కొన్ని రంగాలలో యువతకు కొత్తగా ఉద్యోగాలు లభించే వేగం మాత్రం కొంత మందగించినట్లు ఆ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: ఎన్నికల వరకే రాజకీయం.. 3 జోన్లుగా తెలంగాణ విభజన.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!