Wedding Insurance Exclusions| పెళ్లి అంటే ప్రతి ఒక్కరికీ జీవితంలో మధురమైన జ్ఞాపకం. అందుకే చాలామంది లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రాండ్గా వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఫంక్షన్ హాల్, డెకరేషన్, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, అతిథుల ప్రయాణం ఇలా ప్రతిదానికీ భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందు అనుకోని సమస్యలు వస్తే పరిస్థితి ఏంటి? వేదిక రద్దయినా, డెకరేటర్ రాకపోయినా, భారీ వర్షం కురిసినా ఖర్చు చేసిన డబ్బులు తిరిగి వస్తాయా? ఇలాంటి నష్టాల నుంచి రక్షణ కల్పించేందుకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది. అయితే, బీమా తీసుకున్నంత మాత్రాన ప్రతి నష్టానికి పరిహారం లభించదు. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవర్ చేయని 7 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.
పెళ్లి జరగాల్సిన ఫంక్షన్ హాల్ అకస్మాత్తుగా అందుబాటులో లేకపోతే ఆర్థిక నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, ప్రతి సందర్భంలోనూ బీమా పరిహారం లభించదు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వేదిక అందుబాటులో లేకపోతే కొన్ని పాలసీలు కవర్ చేస్తాయి. కానీ వాణిజ్యపరమైన వివాదాలకు పరిహారం లభించకపోవచ్చు.
పెళ్లి రోజున డెకరేటర్, క్యాటరర్ రాకపోతే వేడుకకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్ వీటిని కవర్ చేస్తుందని భావించకూడదు. పాలసీలో వెండర్ వైఫల్యానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. ముందుగానే చెల్లించిన అడ్వాన్స్ రిఫండ్ నిబంధనలు కూడా తెలుసుకోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో పెళ్లి చేసుకునేవారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. భారీ వర్షాలు, తుఫానులు, తీవ్రమైన ఎండలకు ప్రతి పాలసీ కవరేజ్ ఇవ్వదు. మండపాలు, స్టేజీలు, తాత్కాలిక ఏర్పాట్ల వివరాలను బీమా సంస్థకు తెలియజేయాలి. దుస్తులు, అద్దె పరికరాల నష్టాలకు కవరేజ్ ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.
పెళ్లికి ఖర్చు చేసే మొత్తం డబ్బుకు బీమా వస్తుందని అనుకోవద్దు. వేడుక రద్దయితే తిరిగి పొందలేని అడ్వాన్సులు ఎంత ఉన్నాయో లెక్కించాలి. అతిథుల హోటల్ బుకింగ్స్, ప్రయాణ ఖర్చులు కూడా పాలసీలో ఉన్నాయో లేదో పరిశీలించాలి.
ప్రతి బీమా పాలసీలో కొన్ని పరిమితులు, మినహాయింపులు ఉంటాయి. డిడక్టబుల్స్, క్లెయిమ్ పరిమితులు కూడా వర్తిస్తాయి. చివరి నిమిషంలో చేసిన ఖరీదైన మార్పులు, ఒప్పంద ఉల్లంఘన జరిమానాలు మీరే భరించాల్సి రావచ్చు.
చౌకగా ఉందని తొందరపడి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కొనకూడదు. బీమా సంస్థ పేరు, పాలసీ యూఐఎన్ నంబర్, క్లెయిమ్ గడువులను పరిశీలించాలి. ఇప్పటికే చెల్లించిన అడ్వాన్సులకు రక్షణ ఉందో లేదో తెలుసుకోవాలి.
Also Read: పిల్లలు తప్పు చేసినా సరే.. కోపంలో ఈ మాటలు మాత్రం అనకండి!
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ సాధారణంగా అతిథుల ప్రయాణ సమస్యలను కవర్ చేయదు. ముఖ్యంగా విదేశాల్లో పెళ్లి వేడుకలు నిర్వహించేవారు ప్రత్యేక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. విమాన ఆలస్యం, లగేజీ పోవడం, విదేశాల్లో వైద్య అత్యవసర పరిస్థితులకు కవరేజ్ ఉందో చూడాలి. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిబంధనలను కూడా పరిశీలించాలి.
Also Read: విదుర నీతి.. ఈ 4 గుణాలు ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి వస్తుంది.. డబ్బు కొరత ఎప్పుడూ ఉండదు?
పెళ్లి ఖర్చులకు ఆర్థిక భద్రత కల్పించాలంటే సరైన బీమా పాలసీ ఎంచుకోవాలి. పాలసీ నిబంధనలు, మినహాయింపులు, క్లెయిమ్ పరిమితులను పూర్తిగా చదవాలి. వెండర్లతో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవాలి. అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బును ప్రత్యేకంగా ఉంచుకోవాలి.