Mahanadi Coalfields IPO: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-MCL ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 8981.12 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇష్యూలో ఒక్కో షేరు ధర రూ. 129 నుంచి 136 మధ్య ఉంటుంది. ఇప్పుడు కొన్ని వివరాలు చెక్ చేద్దాం.
చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అందులో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా రిస్క్ ఉండదని నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు. అదే మంచి కంపెనీతోపాటు సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉంటే రెట్టింపు లాభాలు రావడం ఖాయం. అందుకే ఐపీఓ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు.
కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓకు వచ్చింది. నవంబర్ 19 అనగా గురువారం ఎంసీఎల్ ఐపీఓ మొదలైంది. సోమవారం వరకు ఉండనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో ఉండనుంది. పేరెంట్ కంపెనీ అయిన కోల్ ఇండియానే సుమారు 10 శాతం వాటాకు సమానమైన సుమారు 66.18 కోట్ల మేర షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనుంది. దీనిద్వారా రూ. 8981.12 కోట్లను సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కావడంతో సమీకరించిన నిధులు పూర్తిగా ప్రమోటర్ సంస్థకే వెళ్తనున్నాయి.
ఐపీఐ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరు రూ. 129 నుంచి రూ. 136 గా పేర్కొంది సదరు కంపెనీ. ఒక్కో లాట్ కింద కనీసం 110 షేర్లను కొనుగోలు చేయాలి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ కింద చూస్తే కనీస పెట్టుబడి సుమారు రూ. 15 వేలు అవసరం. రిటైల్ షేర్ హోల్డర్లు గరిష్ఠంగా 13 లాట్లకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దానికి పెట్టుబడి రూ. 1,94,480 ఉంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ కింద కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ. 90 వేల కోట్లకుపైనే.
ALSO READ: ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే
మహానది కోల్‌ఫీల్డ్స్ కంపెనీ BSE, NSE రెండింట్లో లిస్టింగ్ కానుంది. ఇక ఫేస్ వాల్యూ రెండు రూపాయలుగా పేర్కొంది. ఉద్యోగులకు ఇష్యూ ప్రైస్‌లో ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున డిస్కౌంట్ రానుంది. వారు ఎంప్లాయి కేటగిరీలో ఐపీఓకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఐపీఓ తగలని వారికి మనీ రిటర్న్ చేస్తారు. నవంబర్ 25న షేర్ల అలాట్మెంట్ ఉండగా, 27న ఆ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అవుతాయి.
ఐపీఓకు రిజిస్ట్రార్‌గా కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఉంటోంది. గ్రే మార్కెట్లో ప్రీమియం నామమాత్రంగా ఉంది. నవంబర్ 19న జీఎంపీ ఒక్కో షేరుపై కేవలం మూడు రూపాయలుగా ఉంది. నేటి నుంచి ఇష్యూ మొదలుకావడంతో అదికాస్త పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.
పబ్లిక్ ఇష్యూకు ముందే తన యాంకర్ బుక్ ద్వారా సంస్థాగత పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించింది. నవంబర్ 18న 53 ఫండ్లకు ఒక్కో షేరుకు రూ.136 చొప్పున 16,87,68,255 షేర్లను కేటాయించడం ద్వారా సుమారు రూ.2,295.2 కోట్లు సమీకరించింది. అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC యాంకర్ కేటాయింపులో అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. సుమారు రూ. 568 కోట్ల విలువైన షేర్లను పొందింది. నిప్పన్ లైఫ్ ఇండియా ట్రస్టీ దాదాపు రూ. 500 కోట్ల కేటాయింపు పొందింది. మిగతా వారిలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్, దేశీయ బీమా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి.